టీటీడీ పాలకమండలి సమావేశంలో మాట్లాడుతున్న భూమన కరుణాకర్‌రెడ్డి
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా పనిచేసే కార్మికులకు లబ్ధి కలిగించేందుకు టీటీడీ ధర్మకర్తల మండలి పలు నిర్ణయాలు తీసుకుంది. ధర్మకర్తల మండలి అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో మండలి సమావేశం జరిగింది. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, కమిషనర్ సత్యనారాయణ, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి టీటీడీ చైర్మన్ భూమన మీడియాకు వివరించారు.
కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాల పెంపు
- కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల కింద ఆరోగ్య శాఖలో విధులు నిర్వహిస్తున్న దాదాపు 5 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు, ఎఫ్‌ఎంఎస్ పారిశుద్ధ్య కార్మికుల వేతనాన్ని రూ.12 వేల నుంచి రూ.17 వేలకు పైగా పెంచేందుకు ఆమోదం.
- శ్రీ లక్ష్మీ శ్రీనివాసా మ్యాన్ పవర్ కార్పొరేషన్ ద్వారా పనిచేస్తున్న దాదాపు 6,600 మంది ఉద్యోగులకు ఇకపై ఏటా 3 శాతం వేతనం పెంపుదల.
- టీటీడీలో వివిధ సొసైటీల ద్వారా పనిచేస్తూ ఇప్పుడు కార్పొరేషన్‌లోకి మారిన ఉద్యోగులకు గత సేవల్ని గుర్తించి ప్రతి రెండేళ్లకు
3 శాతం ప్రోత్సాహకం ఇచ్చేందుకు నిర్ణయం.
- కార్పొరేషన్ ద్వారా పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైనా అకాల మరణం పొందితే రూ.2 లక్షల నష్టపరిహారం వారి కుటుంబ సభ్యులకు అందించేందుకు ఆమోదం.
- శ్రీలక్ష్మీ శ్రీనివాసా మ్యాన్‌పవర్ కార్పొరేషన్ ఉద్యోగులు దాదాపు 1500 మందికి హెల్త్ స్కీమ్ వర్తింప చేసేందుకు ఆమోదం.
Comments
Please login to add a commentAdd a comment