TTD approves highest-ever budget of Rs 4,411.68 crore - Sakshi
Sakshi News home page

రూ.4,411.68 కోట్లతో టీటీడీ బడ్జెట్‌ 

Published Thu, Mar 23 2023 4:27 AM | Last Updated on Thu, Mar 23 2023 11:27 AM

TTD budget with Rs.4,411.68 crores - Sakshi

తిరుమల: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023–24కి) తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) బడ్జెట్‌కు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. రూ.4,411.68 కోట్ల బడ్జెట్‌ను ఫిబ్రవరి 15న జరిగిన పాలకమండలి సమావేశం ఆమోదించినట్లు టీటీ­డీ చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి చెప్పారు.

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉన్నందున అప్పుడు ఈ వివరాలు వెల్లడించలేదని తెలిపారు. తిరుమలలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ బడ్జెట్‌ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభు­త్వం ఆమోదముద్ర వేసిందని చెప్పారు. శ్రీవేంకటేశ్వరస్వామి భక్తులందరికీ శ్రీ శోభకృత్‌ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ప్రపంచ ప్రజలంతా, ముఖ్యంగా తెలుగు ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. గతనెలలో జరిగిన పాలకమండలి సమావేశంలో కొన్ని పాలనపరమైన నిర్ణయాలు కూడా తీసుకున్న­ట్లు తెలిపారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి, జేఈవో సదా భార్గవి, ఎస్‌ఈ జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్న ఈ సమావేశంలో వై.వి.సుబ్బారెడ్డి వెల్లడించిన వివరాలు..  

వీఐపీ బ్రేక్‌ దర్శన సమయం మార్చినందువల్ల సామాన్య భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఈ విధానాన్ని కొనసాగిస్తాం. 
♦ కోవిడ్‌ తరువాత హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది. కోవిడ్‌కు ముందు ఏడాదికి రూ.1,200 కోట్ల కానుకలు లభించేవి. కోవిడ్‌ త­రు­వాత హుండీ ఆదాయం ఏడాదికి రూ.1,500 కోట్ల వరకు పెరిగింది. బ్యాంకుల్లో ఉన్న టీటీడీ డిపాజిట్ల మీద కూడా వడ్డీ రేట్లు పెరిగాయి. 
♦ భక్తుల కోరిక మేరకు కోవిడ్‌ సమయంలో వర్చువల్‌ సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో జారీచేశాం. తరువాత కూడా భక్తుల కోరిక మేరకు ఈ సేవలు కొనసాగించాలని నిర్ణయించాం. 
♦  తిరుపతిలో నిర్మిస్తున్న శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్‌ పనులు ఏప్రిల్‌ ఆఖరు నాటికి పూర్తిచేయించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తాం. 
♦  అలిపిరి నుంచి వకుళమాత ఆలయం వరకు కొత్తగా రోడ్డు మంజూరు చేశాం.  
♦ ఏప్రిల్‌ 5వ తేదీన ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువ్రస్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పి స్తారు.  
♦  వేసవిలో మూడునెలలు భక్తుల రద్దీ బాగా పెరిగే అవకాశం ఉన్నందువల్ల వీఐపీల సిఫారసులు బాగా తగ్గించాలని కోరుతున్నాం. శ్రీవాణి టికెట్ల సంఖ్య కూడా తగ్గించి ఎక్కువమంది సామాన్య భక్తులకు దర్శనం కల్పిస్తాం.  
 తిరుమలలో భక్తుల అవసరాలకు అనుగుణంగా లడ్డూ కాంప్లెక్స్‌ వద్ద 30 అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణానికి రూ.5.25 కోట్లు మంజూరు చేశాం.  
తమిళనాడు రాష్ట్రం ఊలందూరుపేటలో దాత విరాళంతో నిర్మిస్తున్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో రూ.4.70 కోట్లతో కొన్ని అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించాం. 
♦ తిరుపతిలోని ఎస్‌జీఎస్‌ ఆర్ట్స్‌ కళాశాల పడమర వైపు మూడో అంతస్తు నిర్మాణం, ల్యాబ్‌ ఆధునికీకరణ, గ్రంథాలయం, ఇండోర్‌ గేమ్స్‌ భవనాల నిర్మాణం తదితర పనుల కోసం రూ.4.71 కోట్లతో టెండర్లు ఖరారు చేశాం.  
♦  శ్రీలక్ష్మి శ్రీనివాస మ్యాన్‌పవర్‌ కార్పొరేషన్‌లో ప­­­నిచేస్తున్న సిబ్బందికి, వారి కుటుంబసభ్యుల­తో కలిపి దర్శన వసతి, రాయితీపై రూ.20 చొ­ప్పు­­­న నెలకు 10 లడ్డూలు ఇవ్వాలని నిర్ణయించాం.  

రూ.990 కోట్లకు వడ్డీ ఆదాయం 
టీ­టీడీ వివిధ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన నగదు, బం­­­గారం ద్వారా పెద్ద ఎత్తున వడ్డీ ఆదాయం లభిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.813 కోట్ల వడ్డీ వస్తున్నట్లు అంచనా వేసిన టీటీడీ.. రానున్న ఆ­ర్థిక సంవత్సరంలో వడ్డీ ఆదాయం మరో రూ.177 కో­ట్లు పెరిగి మొత్తం రూ.990 కోట్లు వస్తాయని పేర్కొంది.  

హుండీ ద్వారా రూ.1,591 కోట్ల రాబడి అంచనా 
వచ్చే ఆర్థిక సంవత్సరంలో శ్రీవారి హుండీ ద్వారా సుమారు రూ.1,591 కోట్లు ఆదాయం వస్తుందని బడ్జెట్‌లో టీటీడీ అంచనా వేసింది. 2022–23 బడ్జెట్‌తో పోలిస్తే ఈ బడ్జెట్‌ రూ.1,315.28 కోట్ల మేర పెరిగింది. ఇందులో ఉద్యోగులు, పొరుగు ఉద్యోగులు, ఒప్పందసేవ సిబ్బంది జీతాలకు రూ.1,532 కోట్లు వెచ్చించనున్నారు.

పరికరాల కొనుగోలుకు రూ.690.50 కోట్లు కేటాయించారు. కార్పస్, ఇతర పెట్టుబడుల కోసం రూ.600 కోట్లు వెచ్చించనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నిల్వ రూ.291.85 కోట్లుగా అంచనా వేశారు. ఇటీవల కొన్ని వసతి గదులు,  కల్యాణమండపాల అద్దె పెంచడం వల్ల ఆదాయం పెరుగుతుందని అంచనా వేశారు. వీటిద్వారా ప్రస్తుత సంవత్సరం రూ.118 కోట్ల ఆదాయాన్ని అంచనా వేయగా రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.129 కోట్లు వస్తాయని బడ్జెట్లో పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement