సాక్షి, విజయవాడ: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెజవాడ దుర్గమ్మకు టీటీడీ పట్టువస్త్రాలు సమర్పించింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి దంపతులు పట్టువస్త్రాలు అందజేశారు. ఈ సందర్బంగా వై.వి. సుబ్బారెడ్డి దంపతులకు ఆలయ మర్యాదలతో దుర్గగుడి ఈవో భ్రమరాంబ, ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు.
కాగా, దసరా ఉత్సవాల్లో టీటీడీ దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. అనంతరం.. మహిషాసురమర్ధిని అలంకారంలో ఉన్న దుర్గమ్మను వారు దర్శించుకున్నారు. ఇక, దర్శనానంతరం వేద పండితులు దంపతులిద్దరికీ వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా దుర్గగుడి ఈవో భ్రమరాంబ.. సుబ్బారెడ్డి దంపతులకు అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు.
దర్శనం అనంతరం వై.వి. సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉంది. టీటీడీ తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాము. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తిరుపతి బ్రహ్మోత్సవాల కోసం బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశాము. దసరా సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కూడా చక్కని ఏర్పాట్లు చేశారు. మూలా నక్షత్రం రోజున అమ్మవారిని రెండున్నర లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. సీఎం జగన్ పాలనలో సకాలంలో వర్షాలు పడి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్ధించాను’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment