శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ | TTD: The Nine Day Annual Brahmotsavam festival Started In Tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

Published Sat, Sep 19 2020 8:49 PM | Last Updated on Sat, Sep 19 2020 9:44 PM

TTD: The Nine Day Annual Brahmotsavam festival Started In Tirumala - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు ఏకాంతంగా జరుగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కన్యా మాసం హస్త నక్షత్రంలో శుక్ర‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల మధ్య ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో సేనాధిపతి ఉత్సవం, వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. (పెద్దశేష వాహనంపై దర్శనం ఇవ్వనున్న శ్రీవారు)

అంకురార్పణ విశిష్టత.. 
వైఖానసం ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. న‌వ ధాన్యాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం. ప్రధాన ఉత్సవానికి 7, 5, 3 రోజుల ముందు అంకురార్పణ నిర్వహిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. సూర్యుడు అస్తమించిన తరువాతే అంకురార్పణ నిర్వహిస్తారు. జ్యోతిష శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చంద్రుడిని 'సస్యకారక' అంటారు. ఈ కారణంగా పగటివేళ అంకురాలను ఆరోపింపచేయడం తగదు. సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు. అంకురార్పణంలో 9 రకాల వివిధ ధాన్యాలను నాటడం తెలిసిందే. అంకురార్పణంలో నాటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా నిర్వహించబడతాయి. (డిక్ల‌రేష‌న్ తీసేయాల‌ని చెప్ప‌లేదు: వైవీ సుబ్బారెడ్డి)

అంకురార్పణ క్రమం..
విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు. యాగశాలలో ఈ మొత్తం కార్యక్రమం నిర్వహిస్తారు. అత్రి అనే మహర్షి తన 'సముర్తార్చన అధికరణ' అనే గ్రంథంలో అంకురార్పణ క్రమాన్ని రచించాడు.  అంకురార్పణ జరిగే రోజు మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలో నీటిలో నానబెడతారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. ఇక్కడ బ్రహ్మపీఠాన్ని ఏర్పాటుచేస్తారు. ఆ తరువాత మంట ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను ఆహ్వానిస్తారు. (చరిత్రలో తొలిసారి.. బ్రహ్మోత్సవం ఏకాంతం..)


ఆ తరువాత భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపుతారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు. ప్రతిరోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తారు. ఈ మొత్తం కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ సాగుతుంది.

ఈ కార్యక్రమంలో టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి, సీవీఎస్‌వో గోపినాథ్ జెట్టి, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవోహ‌రీంద్ర‌నాథ్‌ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement