భక్తులు మెచ్చేలా చక్కటి కార్యాచరణ | YV Subba Reddy Special Interview In Sakshi Funday | Sakshi
Sakshi News home page

భక్తులు మెచ్చేలా చక్కటి కార్యాచరణ

Published Sun, Sep 29 2019 8:05 AM | Last Updated on Sun, Sep 29 2019 9:18 AM

YV Subba Reddy Special Interview In Sakshi Funday

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలకు సర్వం సన్నద్ధమైంది. తొమ్మిది రోజుల పాటు పదహారు రకాల వాహనాలపై శ్రీనివాసుడు తిరుమాడ వీధుల్లో ఊరేగే వైభవాన్ని తిలకించడానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు రానున్నారు. రుత్వికులు అంకురార్పణ చేసిన తర్వాత ఉత్సవాలు మొదలవుతాయి. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తులకు సకల ఏర్పాట్లూ చేసినట్లు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి నాయకత్వంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక తన చేతుల మీదుగా తొలిసారి బ్రహ్మోత్సవాలను నిర్వహించే భాగ్యం కలగడంపై ఆయన హర్షం వెలిబుచ్చారు. బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ...

టీటీడీ చైర్మన్‌గా తొలిసారిగా బ్రహ్మోత్సవాల నిర్వహణ చేపట్టడంపై మీ అనుభూతి?
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామికి అత్యంత వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించే భాగ్యం నాకు దక్కడం ఎంతో సంతోషంగా ఉంది. ఎన్నో జన్మల పుణ్యఫలంతోనే ఈ మహాక్రతువులో భాగస్వాములయ్యే అవకాశం లభిస్తుంది. బ్రహ్మోత్సవాలను భక్తులందరూ తిలకించేలా చక్కని ఏర్పాట్లు చేస్తున్నాం.

గతంలో కంటే మిన్నగా బ్రహ్మోత్సవాల నిర్వహణకు టీటీడీ రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలను వివరిస్తారా?
బ్రహ్మదేవుడే స్వయంగా నిర్వహించిన ఈ ఉత్సవాలను టీటీడీ ఎప్పటికప్పుడు భక్తజనరంజకంగా నిర్వహించడానికి వైభవోపేతంగా ఏర్పాట్లు చేస్తుంది. ఈసారి కూడా స్వామివారి ఉత్సవాలను భక్తులంతా మెచ్చేలా నిర్వహించడానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేశాం.

బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?
తిరుమల క్షేత్రంలో తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నాం. స్వామివారిని క్షణకాల దర్శనం చేసుకుంటే చాలని అశేష భక్తజనకోటి ఎదురు చూస్తుంటారు. వారి మనోభావాలను దృష్టిలో ఉంచుకుని, ఎంతమంది వస్తే అంతమందికి తగిన ఏర్పాట్లతో, ముందస్తు చర్యలతో భక్తులందరికీ చక్కగా దర్శనభాగ్యం కల్పించడానికి టీటీడీ యంత్రాంగం సిద్ధంగా ఉంది.

బ్రహ్మోత్సవాలకు విశేషంగా తరలివచ్చే భక్తులకు తిరుమలలో వసతి సౌకర్యాలు ఎలా ఉండబోతున్నాయి?
బ్రహ్మోత్సవాలలో తిరుమల క్షేత్రానికి తరలివచ్చే సామాన్య భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించడానికి ప్రాధాన్యమిస్తున్నాం. ఇందుకోసం తిరుమలలోని అద్దెగదుల్లో అధికశాతం కరెంట్‌ బుకింగ్‌ ద్వారానే కేటాయించాలని ఇప్పటికే నిర్ణయించాం. ఇవి కాకుండా, తిరుమలలోని ఐదు ఉచిత వసతి సముదాయాలను సకల వసతులతో సిద్ధంగా ఉంచాం. భక్తులందరూ టీటీడీ కల్పించిన ఈ వసతులను ఉపయోగించుకుని, బ్రహ్మోత్సవాలను తిలకించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుపతిలోని వసతి సముదాయాలలోనూ అద్దె గదులను ఎక్కువ శాతం కరెంట్‌ బుకింగ్‌ ద్వారానే కేటాయించే ఏర్పాట్లు చేశాం. వీటితో పాటు విష్ణునివాసం, శ్రీనివాసం, శ్రీగోవిందరాజస్వామి సత్రాలలో డార్మిటరీలు, గదులు భక్తులకు ఉచితంగానే అందుబాటులో ఉంటాయి.

బ్రహ్మోత్సవాలకు విచ్చేసే లక్షలాది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించేలా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడు స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. ఎంతమంది భక్తులు వచ్చినా అంతమందికీ అన్న పానీయాలను అందించడానికి టీటీడీ అన్నప్రసాదం విభాగం ఇప్పటికే ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉంది. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంతో పాటు తిరుమలలోని ముఖ్యమైన కూడళ్లు, వైకుంఠం–1, 2 క్యూకాంప్లెక్సులు, బయట క్యూలైన్లలో వేచి ఉండే భక్తులందరికీ ఎప్పటికప్పుడు అన్న ప్రసాదాలను అందించడానికి ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేశాం. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదాన్ని అందించే సమయంలోనూ మార్పులు చేశాం. సాధారణ రోజుల్లో ఉదయం 9 నుంచి రాత్రి 11 గంటల వరకు, బ్రహ్మోత్సవాలలో ఉదయం 8 నుంచి రాత్రి 11.30 గంటల వరకు అన్నపానీయాలను అందించాలని నిర్ణయించాం. గరుడసేవ రోజున రాత్రి 1 గంట వరకు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఇందుకోసం టీటీడీ యంత్రాంగంతో పాటు శ్రీవారి సేవకులు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ సేవలను వినియోగించుకోవడానికి ప్రత్యేక కార్యాచరణను రూపొందించాం.

తిరుమలకు వచ్చే భక్తులందరూ లడ్డు ప్రసాదం పొందేలా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో తరలివచ్చే భక్తులు తప్పకుండా శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని స్వీకరిస్తారు. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుగానే చక్కని ప్రణాళికలను టీటీడీ రూపొందించుకుంది. ఎనిమిదిన్నర లక్షల లడ్డులు నిల్వ ఉండేలా చర్యలు తీసుకుంది. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రతిరోజూ మూడున్నర లక్షల లడ్డులు భక్తులకు అందజేసేలా ఏర్పాట్లు చేశాం.

గరుడసేవ రోజున లక్షలాదిగా వచ్చే భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?
బ్రహ్మోత్సవాలు అంతా ఒక ఎత్తు అయితే, శ్రీవారి గరుడసేవ ఒక్కటే మరో ఎత్తు. ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులందరూ తప్పకుండా వీక్షించాలని తపనపడే వాహనసేవ స్వామివారి గరుడసేవ. గరుడసేవ రోజున తిరుమల భక్తజనసంద్రంగా మారుతుంది. తిరుమలలో భక్తులకు ఎలాంటి లోటు రాకుండా ప్రత్యేక చర్యలతో పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నాం. గరుడసేవ ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని, అదనపు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు ద్విచక్ర వాహనాలను పూర్తిగా నిషేధిస్తున్నాం. గత ఏడాది తిరుమలలో 7800 వాహనాలకు పార్కింగ్‌ ఏర్పాటు చేయగా, ఈసారి అదనంగా మరో 1200 వాహనాలకు పార్కింగ్‌ వసతి కల్పిస్తున్నాం. భక్తులందరికీ రాత్రి 1 గంట వరకు అన్న పానీయాలను నిరంతరాయంగా అందించే ఏర్పాట్లు చేశాం.
– కోన సుధాకర్‌రెడ్డి, సాక్షి, అమరావతి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement