సామాన్య భక్తులకూ సంతృప్తికర దర్శనం | TTD EO Anil Kumar Singhal Exclusive Interview In Sakshi Funday | Sakshi
Sakshi News home page

సామాన్య భక్తులకూ సంతృప్తికర దర్శనం

Published Sun, Sep 29 2019 8:25 AM | Last Updated on Sun, Sep 29 2019 9:20 AM

TTD EO Anil Kumar Singhal Exclusive Interview In Sakshi Funday

ఈఓ అశోక్‌సింఘాల్‌

తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో దేవదేవుడు శ్రీవేంకటే«శ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అన్ని జాగ్రత్తలు తీసుకుంది. అత్యంత వైభవపేతంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు 14 రాష్ట్రాల కళాకారులను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఈఓ అశోక్‌సింఘాల్‌ ఇచ్చిన ఇంటర్వ్యూ...

బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులకు మెరుగైన దర్శనానికి తీసుకుంటున్న చర్యలు? 
శ్రీవారి మూలమూర్తితోపాటు వాహనసేవలను భక్తులు సంతృప్తికరంగా దర్శించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేపట్టాం. భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జితసేవలను, ప్రత్యేక దర్శనాలను రద్దు చేశాం. బ్రేక్‌ దర్శనం ప్రోటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే పరిమితం. గరుడసేవ రోజు (అక్టోబరు 4న) బ్రేక్‌ దర్శనాలు, అంగప్రదక్షిణ టోకెన్లు రద్దు చేశాం.

వాహనసేవలు తిలకించేందుకు మాడ వీధుల్లో చేపట్టిన ఏర్పాట్లు?
భక్తులు వాహనసేవలను వీక్షించేందుకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో గ్యాలరీలు ఏర్పాటు చేశాం. వాహనసేవలను తిలకించేందుకు మాడవీధులు, భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాల్లో 37 పెద్ద డిజిటల్‌ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నాం. 

శ్రీవారి ఆలయంలో కైంకర్యాల నిర్వహణ ఎలా ఉంటుంది?
శ్రీవారి ఆలయంలో నిత్యకైంకర్యాలన్నీ ఏకాంతంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో         
ఉదయం వాహనసేవ 9 నుండి 11 గంటల వరకు, రాత్రి వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహనసేవ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.

క్యూలైన్‌ వెలుపలికి వెళ్లినపుడు నారాయణగిరి ఉద్యానవనాల్లో భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్లు? 
నారాయణగిరి ఉద్యానవనాల్లో భక్తులకోసం తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశాం. ఇక్కడ వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తాం. షెడ్లకు అనుబంధంగా మరుగుదొడ్ల వసతి కల్పించాం. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోజుకు 7 లక్షల లడ్డూలు నిల్వ ఉండేలా ప్రణాళిక రూపొందించాం. 

గరుడసేవనాడు భక్తుల కోసం ప్రత్యేకంగా చేపట్టిన చర్యలు?
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబరు 4న గరుడసేవ రోజున విశేష సంఖ్యలో వచ్చే భక్తుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని అక్టోబరు 3 రాత్రి 11 గంటల నుండి అక్టోబరు 5 ఉదయం 6 గంటల వరకు తిరుమల ఘాట్‌రోడ్లలో ద్విచక్రవాహనాల రాకపోకలను రద్దు చేయనున్నాం. ద్విచక్రవాహనాలపై వచ్చే భక్తుల కోసం అలిపిరి పాత చెక్‌పోస్టు, శ్రీవారిమెట్టు వద్ద పార్కింగ్‌ ఏర్పాటు చేశాం. తిరుపతిలోని పార్కింగ్‌ ప్రదేశాల నుంచి తిరుమలకు వెళ్లేలా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశాం. బస్సుల్లో 3 వేల రౌండ్‌ ట్రిప్పుల ద్వారా దాదాపు 2 లక్షల మందిని తరలిస్తాం.

ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు?
భక్తులకు ఎలాంటి ఇక్కట్లు తలెత్తకుండా ఉండేందుకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశాం. దాదాపు 1,200మంది టీటీడీ నిఘా, భద్రతా సిబ్బందితోపాటు 4,200 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టాం. మాడ వీధులు, ఇతర ప్రాంతాల్లో 1,650 సీసీ కెమెరాలు ఏర్పాటుచేశాం. íపీఏసీ–4లోని సెంట్రల్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో వీడియోవాల్‌  ద్వారా పలు ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షిస్తాం.

భక్తులు ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్లు ఏమైనా ఉన్నాయా?
భక్తులు సమస్యలు ఎదుర్కొన్నప్పుడు టోల్‌ఫ్రీ నంబర్లు 18004254141, 1800425333333కు ఫిర్యాదు చేయవచ్చు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబరు  18004254242ను అందుబాటులో ఉంచాం.

తిరుమలకు వాహనాల్లో వచ్చే భక్తులకు పార్కింగ్‌ ఏర్పాట్లు ?
తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో 9 వేల వాహనాలకు సరిపడా పార్కింగ్‌ ఏర్పాట్లు చేపట్టాం. తిరుమలలో తిరువేంకటపథం, బాలాజినగర్, కౌస్తుభం ఎదురుగా, రాంభగీచా బస్టాండు, ముళ్లగుంటలోపార్కింగ్‌ ప్రదేశాలు ఉన్నాయి. తిరుపతిలోని అలిపిరి పాత చెక్‌ పాయింట్, శ్రీవారి మెట్టు వద్ద 5 వేల వాహనాలకు సరిపడా పార్కింగ్‌ ఏర్పాట్లు చేశాం.

పారిశుద్ధ్యం కోసం చేపట్టిన చర్యలు? అదనపు సిబ్బందిని నియమించారా?
తిరుమలలో రోజువారీ మొత్తం 1,088 మంది సిబ్బందితో పారిశుద్ధ్య నిర్వహణ. ఆలయ నాలుగు మాడవీధుల్లో పరిశుభ్రత, కాటేజీలు, యాత్రికుల వసతి సముదాయాలు, సామూహిక మరుగుదొడ్ల వద్ద మెరుగైన పారిశుద్ధ్యం కోసం బ్రహ్మోత్సవాల రోజుల్లో అదనంగా 510 మంది, గరుడసేవ నాడు అదనంగా మరో 1,075 మంది ఏర్పాటు చేయనున్నాం. 

భక్తులకు ఎక్కడెక్కడ అన్నప్రసాదాలు అందిస్తారు? ఫుడ్‌ కౌంటర్లు ఎన్ని?
బ్రహ్మోత్సవాలకు విచ్చేసే లక్షలాదిమంది భక్తులకు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లు, కాలిబాట మార్గాల్లో అన్నప్రసాదం, పాలు, అల్పాహార వితరణకు ఏర్పాట్లు. తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో 5 ఫుడ్‌ కౌంటర్ల ద్వారా అన్నప్రసాదాలు అందిస్తాం. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 8 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ.

వైద్యం కోసం చేపట్టిన చర్యలు? 
2 వైద్యకేంద్రాలు, 6 డిస్పెన్సరీలు, 11 ప్రథమ చికిత్స కేంద్రాలు, ఒక మొబైల్‌ క్లినిక్, 45 మంది వైద్యులు, 60 మంది పారామెడికల్‌ సిబ్బంది, 12 అంబులెన్సులతో వైద్యసేవలు అందించనున్నాం. అలాగే వివిధ శాఖల పరిధిలో 3,500 మంది శ్రీవారి సేవకులు, దాదాపు వెయ్యిమంది ఎన్‌సీసీ, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ తిరుమలలోని అన్ని విభాగాల్లో భక్తులకు సేవలందిస్తారు.
టీటీడీ కాల్‌ సెంటర్, వాట్సాప్‌ నంబరు, ఈ–మెయిల్‌?
టీటీడీ కాల్‌సెంటర్‌ ద్వారా శ్రీవారి బ్రహ్మోత్సవాల సమస్త సమాచారాన్ని భక్తులకు అందించే ఏర్పాటు. కాల్‌ సెంటర్‌ నంబరు: 0877–2277777, 2233333. భక్తులు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు వీలుగా వాట్సాప్‌ 9399399399, ఈ–మెయిల్‌: helpdesk@tirumala.org 


బ్రహ్మోత్సవాలకు బ్రహ్మాండంగా ఏర్పాట్లు

‘తిరుమల బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేశాం. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. టీటీడీకి బ్రహ్మోత్సవాలు నిర్వహించటం సర్వసాధారణమే అయినా, ప్రతి ఏటా నిర్వహణ లోపాలను సమీక్షించుకుని, అవి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాం. గత ఏడాది గరుడోత్సవం రోజున భక్తులు లగేజీని పెట్టుకున్న ప్రాంతం చేరుకోవటానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాం. ఈసారి వాహనాల పార్కింగ్‌ ఏర్పాట్లకు ఎక్కువ స్థలం కేటాయించాం. గోగర్భం నుంచి నారాయణగిరి వరకు రింగ్‌ రోడ్డు వచ్చింది. అక్కడ పార్కింగ్‌కు ఎలాంటి సమస్య ఉండదు. దేవుని కృపతో చిత్తశుద్ధితో నిజాయతీగా కార్యక్రమాలు చెయ్యగలుగుతున్నాం. సీఎం ఆదేశాల మేరకు తు.చ. తప్పకుండా కార్యక్రమాలు చేపడుతున్నాము’ అని టీటీడీ ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి స్పష్టం చేశారు. సెప్టెంబర్‌ 30 నుంచి అక్టోబర్‌ 8 వరకు నిర్వహించనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధర్మారెడ్డి చెప్పిన బ్రహ్మోత్సవాల విశేషాలు ఆయన మాటల్లోనే...

టీటీడీ ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి 

భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా...
తిరుమలలో పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా టీటీడీ భారీ మార్పులు చేపట్టింది. గతంలో 40 వేల నుంచి 50 వేల మంది భక్తులు వచ్చేవారు. ప్రస్తుతం 70 వేల నుంచి 80 వేల మంది వరకు భక్తులు ప్రతిరోజూ స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. గతంలో 20 వేల నుంచి 30 వేల మందికి అన్నదానం చేసేవాళ్లం. ప్రస్తుతం లక్ష మందికిపైగా భక్తులకు టీటీడీ అన్నదానం చేస్తోంది. క్యూకాంప్లెక్స్‌లో భక్తులకు పాలు, కాఫీ, టీ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నాం. శ్రీవారి సేవకులను నా హయాంలో మొదలు పెట్టాం. ఇప్పుడు వైకుంఠం క్యూకాంప్లెక్స్, రిసెప్షన్, కళ్యాణకట్ట.. ఇలా ఆలయంలోని ప్రతి శాఖలోనూ శ్రీవారి సేవకులను తీసుకుంటున్నాం. ప్రతి రోజూ మూడువేల నుంచి మూడున్నరవేల మంది శ్రీవారి సేవకులు వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు.

దళారీ వ్యవస్థను రూపుమాపటమే లక్ష్యం
ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 పద్ధతిని రద్దుచేసి ప్రొటోకాల్‌కి సమస్య లేకుండా వీఐపీ దర్శనాలు కొనసాగిస్తున్నాం. ప్రతిరోజూ అదనంగా 2 గంటల సమయం సామాన్య భక్తులకు కేటాయిస్తున్నాం. ఈ పద్ధతిలో ప్రముఖులకు ఎక్కడా సమస్య లేకుండా చర్యలు తీసుకుంటూనే దళారీ వ్యవస్థను కట్టడి చేశాం. ప్రస్తుతం 90 శాతం మేరకు దళారీ వ్యవస్థ లేకుండా చర్యలు చేపట్టాం. నిరంతరం తిరుమలలోనే ఉంటూ రిసెప్షన్, కళ్యాణకట్ట, అన్నదానం, వైకుంఠం–1, వైకుంఠం–2 క్యూకాంప్లెక్స్‌లు, ఆలయంలో రెగ్యులర్‌గా పర్యవేక్షిస్తూ తనిఖీలు నిర్వహిస్తున్నాం. క్రమశిక్షణ లోపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. 

తిరుమలకు రాలేని వారిని దృష్టిలో ఉంచుకుని... 
తిరుమలకు రాలేని పరిస్థితిలో ఉన్న భక్తులు కూడా స్వామివారి కళ్యాణం చూసి తరించేందుకు అవకాశాలు కల్పిస్తున్నాం. 2004 నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. ఎస్వీబీసీ చానెల్‌ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా స్వామివారి సేవలను భక్తులకు తెలియజేస్తున్నాం. పరకామణిలో ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించాలనే దానిపై దృష్టి సారించాం. పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత నిర్ణయం తీసుకుంటాం. 

కాలుష్య రహిత తిరుమల
తిరుమల ఎంత పవిత్రమైన క్షేత్రమో అందరికీ తెలిసిందే. అందులో భాగంగా తిరుమలను ప్లాస్టిక్‌ రహిత తిరుమలగా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. అందులో భాగంగా ఉద్యోగులు ప్లాస్టిక్‌ బాటిళ్లు, వస్తువులు వాడకుండా రెండు నెలలుగా నియంత్రించాం. అతిథి గృహాల్లో వాటర్‌ డిస్పెన్సరీలు ఏర్పాటు చేస్తున్నాం. వాటి ద్వారా జల ప్రసాదం నీళ్లను అందించేందుకు ప్రణాళికలు చేపట్టాం. వీఐపీలకు అదే నీటిని గాజు గ్లాసులో అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. ప్లాస్టిక్‌ వాటర్‌ ప్యాకెట్లను ఆపేశాం. ప్రస్తుతం వాటర్‌ బాటిళ్ల కొనుగోలు నిలిపివేశాం. ప్లాస్టిక్‌ నియంత్రణకు తిరుమలలోని హోటల్స్‌ యాజమాన్యాలతో సంప్రదింపులు చేపట్టాం. జనతా క్యాంటీన్లలో కూడా ఇదే పద్ధతిని తీసుకురావాలని ఆదేశాలు ఇచ్చాం. ఇంకా చిన్న చిన్న హోటళ్లు, ఫుడ్‌ సెంటర్స్‌ వారితో సమావేశం ఏర్పాటు చేసి ప్లాస్టిక్‌ రహిత తిరుమలపై అవగాహన కల్పించి, నియంత్రించే ఏర్పాట్లు చేస్తున్నాం. అన్నదానం కోసం కూరగాయలు, బియ్యం సరఫరా చేసే డోనర్లతో సమావేశం ఏర్పాటు చేశాం. మరింత నాణ్యమైన సరుకులు సరఫరా చెయ్యాలని కోరాం. 

శ్రీవారి సేవలో అరుదైన అవకాశం
శ్రీవారికి సేవ చేసేందుకు నాకు అరుదైన అవకాశం దక్కింది. తొలిసారిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నాలుగు మాఢవీధులు విస్తరణ చేపట్టాం. ప్రైవేటు వారి చేతుల్లో ఉన్న ఆస్తులను సేకరించాం. రెండవసారి అవకాశం వచ్చాక బూందీ పోటును బయటకు తెచ్చాం. అప్పట్లో 40వేల లడ్డు ప్రసాదాలు తయారు చేసేవారు. ఇప్పుడు 4 లక్షల నుంచి 5 లక్షల లడ్డుప్రసాదాలు తయారు చేసే స్థాయికి తీసుకొచ్చాం. మొదట్లో 40వేల నుంచి 45 వేల మంది భక్తులు మాత్రమే దర్శించుకునే అవకాశం ఉండేది. మహాలఘు దర్శనం ద్వారా లక్ష మందికి పైగా దర్శన ఏర్పాట్లు కల్పించే స్థాయికి తీసుకొచ్చాం. వైకుంఠం–1, వైకుంఠం–2 క్యూ కాంపెక్స్‌లను ఎయిర్‌ కండిషన్‌ చేశాం. అతిథి గృహాల్లో 4వేల గదులు ఉండేవి. అటువంటిది 3,500 గదులను అదనంగా నిర్మించగలిగాం. అలిపిరి నుంచి తిరుమల వరకు నడక దారిలో ఉన్న షెడ్ల ఆధునికీకరణ కోసం డోనర్‌ను ఒప్పించాం.

త్రీడీ రూపంలో స్వామి వారి నగలు
స్వామివారి నగలను అందరూ చూసే అవకాశం ఉండదు. అందుకోసం స్వామి వారి నగలను త్రీడీ ఇమేజ్‌ చెయ్యనున్నాం. అలాగే మ్యూజియంలో ఆలయ నమూనా కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. అందులో ఆలయ విశేషాలను కళ్లకు కట్టినట్లు చూపించనున్నాం. దీని కోసం డోనర్‌ కూడా ముందుకు వచ్చారు. మా ప్రయత్నాలు విజయవంతమైతే వచ్చే ఆరునెలల్లోగా స్వామి వారి నగలను త్రీడీ ద్వారా చూపించనున్నాం.

టైమ్‌ స్లాట్‌తో రండి
భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంటి నుంచి బయలు దేరేటప్పుడే టైమ్‌ స్లాట్‌ తీసుకొస్తే దర్శనం సులభతరం. ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చెయ్యనున్నాం. టైమ్‌ స్లాట్‌ లేకుండా వస్తే ఆలస్యం అవుతుందని తెలుసుకుని ప్రతి ఒక్కరూ టైమ్‌ స్లాట్‌ తీసుకొచ్చేలా చర్యలు చేపట్టనున్నాం.
– మోపూరి బాలకృష్ణారెడ్డి, సాక్షి ప్రతినిధి, తిరుపతి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement