బాలకాండ పారాయణంలో వేదాలను ఆలపిస్తున్న వేద పండితులు
తిరుమల: చంద్ర గ్రహణం కారణంగా నవంబర్ 8న ఉదయం 8.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. ఈ కారణంగా 8న బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. దీంతో 7న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని టీటీడీ తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం 2.39 గంటల నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. ఈ కారణంగా 8న శ్రీవాణి,రూ.300 దర్శన టికెట్లను టీటీడీ రద్దు చేసింది. రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి చేసి సర్వదర్శనానికి అనుమతిస్తారు.
భక్తజనరంజకంగా ‘బాలకాండ’
ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై ఆదివారం 13వ విడత బాలకాండ అఖండ పారాయణం జరిగింది. శ్రీ హనుమత్ సమేత సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తుల సమక్షంలో బాలకాండలోని 61 నుంచి 65 సర్గల వరకు ఉన్న 137 శ్లోకాలను, యోగవాసిష్టం– ధన్వంతరి మహామంత్రంలోని 25 శ్లోకాలనూ పారాయణం చేశారు. వేద పండితులు అఖండ పారాయణం చేయగా పలువురు భక్తులు వారిని అనుసరించి శ్లోక పారాయణం చేశారు.
సర్వ దర్శనానికి 38 గంటలు
తిరుమలలో 31 క్యూ కంపార్ట్‌మెంట్లు నిండి ఉన్నాయి. సర్వదర్శనానికి 38 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు పడుతోంది. శనివారం అర్ధరాత్రి వరకు 82,604 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 37,025 మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.5.57 కోట్లు వేశారు.
శ్రీవారి సేవలో ప్రముఖులు
శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.రాజేశ్వరరావు, తెలంగాణ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఏపీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, పెద్దారెడ్డి, ఎమ్మెల్సీ భరత్, ఎంపీ బ్రహ్మానందరెడ్డి, తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి సతీమణి లక్ష్మి రవి దర్శించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment