సాక్షి, అమరావతి: బడ్డీ కొట్టులో రూపాయి చాక్లెట్ కొన్నా.. ఇంట్లోనే కూర్చొని టికెట్లు బుక్ చేయాలన్నా.. గ్యాస్, కరెంట్ తదితర బిల్లులు చెల్లించాలన్నా.. అన్నింటికీ ప్రజలు ఇప్పుడు ‘యూపీఐ’ యాప్‌లనే ఆశ్రయిస్తున్నారు. చివరకు భిక్షాటనలోనూ యూపీఐ క్యూఆర్ కోడ్‌లనే ఉపయోగించేస్తున్నారు. అన్నింటికీ పేమెంట్ యాప్‌లతోనే చెల్లింపులు జరుపుతున్నారు. ముఖ్యంగా గత రెండు, మూడేళ్ల నుంచి జనం చేతుల్లో క్యాష్ తక్కువైపోయి.. స్కానింగ్ ఎక్కువైపోయింది.
యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యూపీఐ) ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మరో అకౌంట్‌కు మొబైల్ ఫోన్ ద్వారా చెల్లింపులు జరిపేందుకు వాడే ఒక వాహకం. దీని ద్వారా ఆన్‌లైన్ పేమెంట్స్ చాలా సులవుగా, వేగంగా జరిగిపోతున్నాయి. ప్రస్తుతం పేమెంట్ యాప్‌ల ద్వారా రోజుకు రూ.లక్ష వరకు బదిలీ చేసే అవకాశముండటంతో.. దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల ప్రజలు బ్యాంకులకు వెళ్లి.. గంటల పాటు వేచి చూసే శ్రమ కూడా తప్పింది. సమయం కూడా ఆదా అవుతోంది.
వేగంగా వృద్ధి..
‘డేటా డాట్ ఏఐ’ అనే సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం 2022లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది డౌన్‌లోడ్ చేసుకున్న యాప్స్‌లో ఫోన్ పే, పేటీఎం, గూగుల్‌పే మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. మొబైల్ బ్యాంకింగ్, డిజిటల్ వ్యాలెట్, పేమెంట్, పర్సనల్ లోన్స్ ఎంతో వేగంగా వృద్ధి చెందాయని ఈ నివేదిక వెల్లడించింది. ఇక టాప్–10 డౌన్‌లోడెడ్ యాప్స్‌లో నాలుగు, ఆ తర్వాతి స్థానాల్లో బజాజ్ ఫిన్ సర్వ్, యోనో ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా వరల్డ్, క్రెడిట్ బీ, ధని, నవీ, గ్రో యాప్స్ ఉన్నాయి.
ఆదమరిస్తే అంతే..
డిజిటల్ పేమెంట్స్ వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో.. ముప్పు కూడా అదే స్థాయిలో ఉంది. కాస్త అజాగ్రత్తగా ఉన్నా.. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయే ప్రమాదముంది. యూపీఐ పేమెంట్స్‌పై అవగాహన లేకపోవడం, తమకు వచ్చే మోసపూరిత ఫోన్ కాల్స్, మెసేజ్‌లను నమ్మడం వల్ల చాలామంది మోసపోతున్నారు.
లాటరీ తగిలిందని.. మీ ఖాతా వివరాలు అప్‌డేట్ చేయాలి ఓటీపీ చెప్పండని, ఈ లింక్ మీద క్లిక్ చేస్తే అదృష్టం వరిస్తుందని.. ఇప్పుడు కొత్తగా మా వీడియోలను చూస్తే చాలు, సోషల్ మీడియాలో లైక్ కొడితే చాలు డబ్బులిస్తామంటూ అనేక రకాలుగా సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసి.. వన్‌టైమ్ పాస్‌వర్డ్(ఓటీపీ), యూపీఐ పిన్ నంబర్లు తెలుసుకొని డబ్బులు లాగేస్తున్నారు.
ఇలా మోసపోకుండా ఉండాలంటే.. పాస్‌వర్డ్‌లను తరచుగా మారుస్తుండాలి. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్‌లను తెరవకూడదు. క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయకూడదు. ఎవరికీ ఎలాంటి సందర్భంలోనూ ఓటీపీ చెప్పకూడదు. ఇలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు.. చెల్లింపుల విషయంలో జాగ్రత్తగా ఉంటే మోసాల నుంచి తప్పించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment