ఫ్లోర్‌ క్లీనర్లు, ఫ్రెష్‌నర్లతో ప్రమాదం.. డేంజర్‌ అని తెలిసినా ఎడాపెడా వాడకం | Use of chemicals in name of cleanliness in every home | Sakshi
Sakshi News home page

ఫ్లోర్‌ క్లీనర్లు.. ఫ్రెష్‌నర్లు వాడుతున్నారా? అంతా ‘నీట్‌’ గా ఉండాల్సిందేనా? అయితే ఇది చదవాల్సిందే!

Published Mon, Feb 20 2023 3:47 AM | Last Updated on Mon, Feb 20 2023 8:52 AM

Use of chemicals in name of cleanliness in every home - Sakshi

దోమల్ని తరిమేసేందుకు కాయిల్‌ లేదా రీఫిల్‌.. గచ్చును శుభ్రం చేసేందుకు ఫ్లోర్‌ క్లీనర్‌.. గ్యాస్‌ స్టవ్‌పై మరకల్ని తుడిచేందుకు క్రీమ్‌.. బాత్‌రూమ్‌ను శుభ్రం చేసేందుకు ఓ ద్రవం.. టాయిలెట్‌ను శుద్ధి చేసేందుకు మరో రసాయనం.. సువాసన వెదజల్లేందుకు రూమ్‌ ఫ్రెష్‌­నర్స్‌.. ఇలా చెప్పుకుంటూపోతే ప్రతి ఇంట్లో డజనుకు పైగా రసాయన ఉత్పత్తులు వినియోగించడం పరి పాటిగా మారిపోయింది. ఇవే ప్రజల పాలిటి శాపంగా మారుతున్నాయి. ఇలాంటి వాటిని వినియోగించడం వల్ల ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది.

సాక్షి, అమరావతి: ఇంట్లో పరిశు­భ్రత.. సువాసన కోసం వాడే వాణిజ్య ఉత్ప­త్తుల వినియోగం విచ్చలవిడిగా పెరిగి­పో­తోంది. వీటి వాడకం వల్ల వయసుతో సంబంధం లేకుండా ప్రజలు అనారోగ్యం బారిన­ప­డు­తున్నట్టు వెల్లడైంది. ఆయా ప్యాకెట్లు, డబ్బాలపై ‘ఇది విషం. ఇంట్లో పిల్లలకు దూరంగా ఉంచాలి’ అని.. దీనిని ‘మండే గుణం ఉంది’ అని జాగ్రత్తలు రాసి ఉన్నా.. వాటిని పట్టించుకునే­వారు 10% కూడా ఉండటం లేదు.

సామాజిక మాధ్య­మాల్లో సినీ తారలతో సైతం ఆయా కంపెనీలు ప్రచారం చేస్తున్నాయి. అందుకే విదేశాల్లో నిషేధం విధించిన వాణిజ్య ఉత్పత్తులు సైతం మనదేశంలో విచ్చలవిడిగా అమ్ముడవుతున్నాయి. ఇంటి పరిశుభ్రత కోసం, సువాసన కోసం వాడే వాణిజ్య ఉత్పత్తుల వినియోగం పరిమితి దాటుతోందని, వీటివల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యం బారినపడుతున్నారని ఢిల్లీలోని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎస్‌ఈ) హెచ్చరిస్తోంది. 

పట్టణాల్లో మరీ ఎక్కువ
మనదేశంలో అతి శుభ్రత, ఇంట్లో కొత్త అలవాట్లను ప్రవేశ పెట్టడంలో పట్టణ ప్రజలే ముందున్నారని సీఎస్‌ఈ పేర్కొంది. కొన్నేళ్లుగా తడి, పొడి చెత్తతోపాటు ఈ వేస్ట్‌పై ప్రజల్లో కల్పిస్తున్న అవగాహనతో చాలావరకు మార్పు వచ్చినా.. ఇంటి శుభ్రత కోసం ప్రమాదకర రసాయనాల వాడటం మాత్రం పెరుగుతున్నట్టు గుర్తించింది.

ఇంటింటి చెత్త సేకరణలో భాగంగా అందుతున్న చెత్తలో నెలకు సగటున ఒక్కో ఇంటి నుంచి 5 కేజీలకు పైగా వాడేసిన ఫ్లోర్‌ క్లీనర్లు, యాసిడ్‌ బాటిళ్లు, రూమ్‌ ఫ్రెష్‌నర్స్, మస్కిటో రీఫిల్స్, పెయింట్లు, వార్నిష్‌ డబ్బాలు, గడువు ముగిసిన మందులు వంటివి వస్తున్నట్టు గుర్తించారు.

ప్రమాద­కరమైన గృహ వ్యర్థాలలో పారేసిన పెయింట్‌ డబ్బాలు, పురుగు మందుల డబ్బాలు, సీఎఫ్‌ఎల్‌ బల్బులు, ట్యూబ్‌లైట్లు, విరిగిన పాదరసం థర్మామీటర్లు, సిరంజీలు పట్టణ గృహాల నుంచి సేకరించే చెత్తలో అధికంగా వస్తున్నట్టు గుర్తించారు.

ఇవన్నీ పిల్లలు, వృద్ధుల ఆరోగ్యాన్ని వేగంగా దెబ్బతీసేవే. మనదేశంలో పెస్ట్‌ కంట్రోల్‌ సెంటర్లకు వస్తున్న కాల్స్‌ సైతం ఏటా పెరుగుతున్నాయని, 2012లో రోజుకు 7.6 కాల్స్‌ వస్తే.. 2022లో 23కు చేరినట్టు సీఎస్‌ఈ గుర్తించింది. బొద్దింకలు, బల్లులు, చెద పురుగులు వంటి వాటి నిర్మూలన కోసం అత్యంత విషపూరితమైన రసాయనాలను ఇంట్లో వాడుతున్నట్టు తేలింది. 

సంప్రదాయ విధానాలే మేలు 
అమెరికాలో సగటున ప్రతి కుటుంబం వాడే క్లీనర్స్‌లో 3 నుంచి 11 నుంచి 38 లీటర్ల విష పదార్థాలు ఉన్నట్టు యూఎస్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ ప్రకటించింది. ఇవి గాలిలో కలిసినప్పుడు ప్రమాదకర అవ­శేషాలను విడుదల చేస్తాయని పేర్కొంది. ఆ సంస్థ దాదాపు 2 వేలకు పైగా శుభ్రపరిచే ఉత్పత్తులను పరిశీలించగా, వాటిలో 10 శాతం పైగా విషపూరితమైనవిగా గుర్తించింది.

అత్యంత ప్రమాదకరమైన ఉత్పత్తులను ప్రభు­త్వం రద్దు చేయగా.. మిగిలిన వాటిపై ‘హెచ్చరిక, జాగ్రత్త, ప్రమాదం, విషం’ అన్న పదాలను పెద్దగా ముద్రించేలా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. మన దేశంలోనూ ఇలాంటి ఉత్పత్తులే ఉన్నా­యని పేర్కొంది.

ప్రత్యామ్నాయంగా సహజ మార్గాలను అనుసరించాలని సీఎస్‌ఈ విజ్ఞప్తి చేస్తోంది. డ్రెయిన్‌ శుభ్రం చేసేందుకు ప్లంగర్‌ లేదా ప్లంబర్‌ స్నేక్, అద్దాల శుభ్రతకు వెనిగర్‌ లేదా నిమ్మరసం వంటివి వాడాలని సూచిస్తోంది.  

ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
వంటగది, బాత్రూమ్, హాల్, పడక గదుల్లో సగటున ఒక్కో ఇంటిలో 8 కేజీల వరకు ప్రమాదకర రసాయనాలు, పౌడర్లు వినియో­గిస్తున్నారు. డ్రెయిన్‌ క్లీనర్లు, ఓవెన్‌ శుభ్రం చేసుకునేవి, ఫ్లోర్‌ క్లీనర్లు వంటి వాటిలోని రసాయనాలు ఇంట్లోని వారిపై తీవ్ర దుష్ప్రభావం చూపుతున్నట్టు సీఎస్‌ఈ గుర్తించింది.

పెద్దవారు వాడే డియోడరెంట్లు, బాడీ స్ప్రేలతో ఇంట్లోని పిల్లల ఆరోగ్యం దెబ్బతింటోంది. వీటి వినియోగం వల్ల వెంటనే చర్మం, కళ్లు మండటంతో పాటు దీర్ఘకాలంలో పిల్లల్లో ఆస్తమా వంటి రోగాలు కనిపిస్తు­న్నట్టు యూఎస్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (ఈపీఏ) ప్రకటించింది.

పిల్లల్లో కనిపిస్తున్న ఊపిరి సంబంధింత సమస్యలతో ఆస్పత్రులకు వస్తున్నవారు గతంలో రెండు మూడు శాతం ఉండగా.. అది 10.4 శాతానికి పెరిగినట్టు తేలింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement