వైభవంగా వైకుంఠ ఏకాదశి | Vaikunta Ekadasi Celebrations Grand Scale At TTD | Sakshi
Sakshi News home page

వైభవంగా వైకుంఠ ఏకాదశి

Published Fri, Jan 14 2022 2:38 AM | Last Updated on Fri, Jan 14 2022 3:42 PM

Vaikunta Ekadasi Celebrations Grand Scale At TTD - Sakshi

శ్రీవారి స్వర్ణ రథోత్సవానికి పోటెత్తిన భక్తులు

తిరుమల/చంద్రగిరి: ఇల వైకుంఠం తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముక్కోటి దేవతలు వెంటరాగా మలయప్ప దివి నుంచి భూవైకుంఠానికి వేంచేయడంతో సప్తగిరులు పులకించాయి. వైకుంఠం నుంచి వచ్చిన స్వామి దర్శనానికి ఉత్తరద్వారం స్వాగతం పలికింది. సుప్రీంకోర్టు సీజే దంపతులు, వివిధ  రాష్ట్రాల హైకోర్టు సీజేలు, సుమారు 40 మంది జడ్జీలు, వీఐపీలు వేంకటేశ్వరుడిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకున్నారు. తిరుమలేశుని దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు.

శ్రీవారికి ప్రాతఃకాల ఆరాధన అనంతరం అర్చకులు వైకుంఠ ఏకాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వైకుంఠ ద్వారాలను తెరిచి పూజలు చేశారు. ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో మాత్రమే ఈ ద్వారాలను తెరవడం ఆనవాయితీ. అయితే వరుసగా రెండోసారి కూడా పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పిస్తున్నారు. సామాన్య భక్తులకు సైతం గంట ముందుగానే 7.35 గంటలకే సర్వదర్శనం ప్రారంభించారు. సామాన్యులు సైతం దేవదేవుడిని కనులారా వీక్షించారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా దేవదేవుడు స్వర్ణరథాన్ని అధిరోహించి ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ భక్తులందరూ దర్శనం చేసుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. 
గురువారం తిరుమలలో శ్రీవారి స్వర్ణ రథాన్ని లాగుతున్న సుప్రీంకోర్టు సీజే జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు   

స్వర్ణ రథం లాగిన సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌
ముక్కోటి ఏకాదశి రోజున తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులు దర్శించుకున్నారు. తెల్లవారుజామున శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి స్వాగతం పలికారు. జస్టిస్‌ రమణ దంపతులు వైకుంఠ ద్వారం నుంచి వెళ్లి శ్రీవారి మూల మూర్తిని దర్శించుకున్నారు. అర్చకుల ఆశీర్వాదం అనంతరం టీటీడీ చైర్మన్‌ తీర్థప్రసాదాలను అందించారు. సీజేతోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌ శ్రీవారిని దర్శించుకున్నారు.

ఆయనకు టీటీడీ చైర్మన్, ఈవో స్వాగతం పలికి వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు ఆశీర్వదించగా టీటీడీ చైర్మన్, ఈవో తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులు శ్రీవారి స్వర్ణరథ సేవలో పాల్గొని కొంతసేపు రథాన్ని లాగారు. ఆ తర్వాత వారు తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రీతురాజ్‌ అవస్థి దంపతులు కూడా అమ్మ వారిని దర్శించుకున్నారు. 

తిరుమలకు తరలివచ్చిన వీఐపీలు 
తిరుమల శ్రీవారిని ఆలయ పెద్ద జీయర్‌ స్వామి, చిన్న జీయర్‌ స్వామి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు గౌతమ్‌రెడ్డి, గుమ్మనూరి జయరామ్, వెలంపల్లి శ్రీనివాస్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అనిల్‌ కుమార్‌ యాదవ్, సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణు, ఆదిమూలపు సురేష్, బాలినేని, రంగనాథరాజు, ఎంపీలు భరత్, కొత్త ప్రభాకర్, వెంకటేష్, సత్యవతి, గురుమూర్తి, ఎం.వి.వి.సత్యనారాయణ, శ్రీకృష్ణదేవరాయలు, గోరంట్ల మాధవ్, వేమిరెడ్డి, ఎమ్మెల్యే రోజా, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టీటీడీ చెన్నై, న్యూఢిల్లీ స్థానిక సలహా మండళ్ల అధ్యక్షులు శేఖర్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, బోర్డు సభ్యులు పోకల అశోక్‌కుమార్, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దర్శించుకున్నారు. 

నేడు చక్రస్నానం
వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటల నుంచి 5.30 గంటల మధ్య చక్రస్నాన మహోత్సవాన్ని ఏకాంతంగా నిర్వహించనున్నారు.

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ, కర్ణాటక హైకోర్టు సీజేలు
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా దంపతులు, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రీతురాజ్‌ అవస్థి దంపతులు, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ రమేష్, జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్, జస్టిస్‌ విజయలక్ష్మి, త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అమర్నాథ్‌గౌడ్, తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గోవిందరాజన్, ఏపీ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ, మానిటరింగ్‌ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకున్నారు.

శ్రీవారి సేవలో తెలంగాణ హైకోర్టు సీజే
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ గురువారం ఉదయం వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకున్నారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం హైకోర్టు సీజే, మంత్రి తలసాని కుటుంబ సభ్యులు వేర్వేరుగా తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణ మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, భాజపా నాయకురాలు డీకే అరుణలు శ్రీవారిని దర్శించుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement