
శ్రీవారి ఆలయంపై వెళుతున్న విమానం
తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయం పైనుంచి విమానం వెళ్లిన ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. విమానం రేణిగుంట విమానాశ్రయం నుంచి వచ్చిందా.. లేక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిందో తెలియడం లేదు. ఆగమశాస్త్ర నియమం ప్రకారం తిరుమల ఆలయంపై ఎటువంటి విమానాలు వెళ్లరాదు. అయితే తరచూ ఆలయ పైభాగంలో విమానాలు వెళుతున్నాయి. తాజాగా ఘటన నేపథ్యంలో టీటీడీ భద్రతాధికారులు పరిశీలిస్తున్నారు.
వైభవంగా అమావాస్య ఉత్సవం
శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం అమావాస్య ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అలంకార మండపంలో స్వామి, అమ్మవార్లకు విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ స్వామి, అమ్మవార్లను చప్పరాలపై అధిష్టించారు. పురవీధుల్లో ఊరేగుతున్న స్వామి,అమ్మవార్లను భక్తులు దర్శించి పరవశించారు. ఆలయ పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment