అబద్ధపు రాతలు కూటమి మంటలు | - | Sakshi
Sakshi News home page

అబద్ధపు రాతలు కూటమి మంటలు

Published Mon, Aug 19 2024 2:02 AM | Last Updated on Mon, Aug 19 2024 12:59 PM

అబద్ధపు రాతలు

అబద్ధపు రాతలు

అగ్నిప్రమాదాల పేరిట ‘కూటమి’ నాటకాలు

వైఎస్సార్‌సీపీ నేతలకు బురద అంటించే యత్నాలు

మదనపల్లె కలెక్టరేట్‌.. టీటీడీ ఏడీ బిల్డింగ్‌లో ఫైర్‌ యాక్సిడెంట్లపై అసత్య ప్రచారాలు

టీడీపీ నేతల డ్రామాలను రక్తి కట్టించేందుకు ఎల్లోమీడియాలో అవాస్తవ కథనాలు

ప్రభుత్వం ఒత్తిడితో కేసులు నమోదు చేస్తున్న పోలీసులు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురదజల్లాలి.. ఆ పార్టీ నేతలపై కేసులు నమోదు చేయాలి.. భయభ్రాంతులకు గురిచేసి పక్కకు తప్పించాలి.. ఇదే లక్ష్యంతో కూటమి సర్కార్‌ ప్రణాళికాబద్ధంగా నాటకాలాడుతోంది. ఎక్కడ ఏం జరిగినా.. చీమ చిటుక్కుమన్నా.. వైఎస్సార్‌సీపీ నాయకులపై నెపం నెట్టేస్తోంది. ఎల్లోమీడియా అండతో అసత్యాలను ప్రచారం చేయించి పబ్బం గడుపుకుంటోంది. గతంలో ఎలాంటి అవినీతి జరగలేదని అధికారుల నివేదికలు వెల్లడిస్తున్నా నిస్సిగ్గుగా వాటిని బుట్టదాఖలు చేస్తోంది. తాము చెప్పిన విధంగా కేసులు పెట్టేయాలని పోలీసులపై ఒత్తిడి తెస్తోంది. ప్రజాసేవే పరమావధిగా చిత్తశుద్ధితో సేవలందించిన వైఎస్సార్‌సీపీ నేతలను మానసికంగా వేధిస్తూ రాక్షసానందం పొందుతోంది. ఈ క్రమంలోనే మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం.. టీటీడీ పరిపాలనా భవనంలో సంభవించిన అగ్నిప్రమాదాలను సైతం తమకు అనుకూలంగా మలుచుకునేందుకు యత్నిస్తోంది. కక్షపూరితంగా వ్యవహరిస్తూ పచ్చమూకతో మూకుమ్మడి దాడి చేయిస్తోంది.

సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఏమూల ఏం జరిగినా.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలకు అంటగట్టేందుకు కూటమి సర్కార్‌ తన ఎల్లో మీడియా ద్వారా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. వాస్తవాలను పక్కనబెట్టి అవాస్తవాలను.. అభూత కల్పలను ప్రచారం చేస్తోంది. అధికారులపై ఒత్తిడి తెచ్చి వైఎస్సార్‌సీపీ నేతలను ఇబ్బందిపెట్టేందుకు శతవిధాలా విఫలయత్నం చేస్తోంది. మొన్న మదనపల్లె సబ్‌ కలెక్టరేట్‌ ఘటన, నేడు టీటీడీ పరిపాలనభవనంలో చోటు చేసుకున్న ప్రమాదాలే ఇందుకు నిదర్శనం. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో శనివారం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. 

ఈ ప్రమాదంలో కొన్ని జిరాక్స్‌ పేపర్లు పాక్షికంగా కాలిపోయాయి. ప్రతి శనివారం పరిపాలన భవనంలోని ప్రతి విభాగంలో పూజలు చేయటం ఆనవాయితీ. అందులో భాగంగానే డిప్యూటీ ఇంజినీరింగ్‌ విభాగంలో దీపం వెలిగించి పూజ చేశారు. ఆ దీపం కుందె నుంచి నూనె కిందకు కారడంతో వెనుక ఉన్న చెక్కకు మంటలు అంటుకున్నాయి. కింద ఉన్న జిరాక్స్‌ ఫైళ్లకు వ్యాపించాయి. అదే సమయంలో భోజనానికి వెళ్లిన సిబ్బంది తిరిగి రావడంతో ముందుగా ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. వారు వచ్చే లోపే మంటలను ఆర్పేశారు. అయితే కొన్ని జిరాక్స్‌ ఫైళ్లు మాత్రం పాక్షికంగా కాలిపోయాయి.

దుష్ప్రచారానికి బలం చేకూర్చేందుకేనా..?

కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి గత వైఎస్సార్‌సీపీ సర్కార్‌ హయాంలో టీటీడీలో ఏదో జరిగిపోయిందంటూ పచ్చ నేతలు, ఎల్లో మీడియా అసత్య ప్రచారాలు చేసిన విషయం తెలిసిందే. అనంతరం దీనిపై 40 మందితో కూడిన విజిలెన్స్‌ బృందాన్ని నియమించి విచారణ సైతం చేపట్టింది. సుమారు నెల రోజుల పాటు విజిలెన్స్‌ అధికారులు కిందా మీదా పడినా.. ఫైళ్లన్నీ తిరగేసినా చిన్న అవినీతి జరిగినట్లు వెల్లడి కాలేదు. ఇదే విషయాన్ని విజిలెన్స్‌ అధికారులు నివేదిక రూపంలో ప్రభుత్వానికి తెలియజేశారు. దీంతో వెంటనే కూటమి పెద్దలు రంగలోకి దిగారు. ఏదో ఒకటి చేసి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై నిందలు మోపి ఎవరినో ఒకరిని బాధ్యుడిని చేసి అరెస్ట్‌ చేయాలని హుకుం జారీ చేశారు. ఇక చేసేది లేక విజిలెన్స్‌ అధికారులు సైతం ఒత్తిడికి లొంగిపోయి 72 మంది టీటీడీ ఇంజినీర్లకు నోటీసులు జారీ చేశారు.

మదనపల్లె ఘటనలోనూ ఇంతే..!

అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో గత నెల జరిగిన అగ్నిప్రమాదాన్ని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అంటగట్టేందుకు కూటమి ప్రభుత్వం శతవిధాలా యత్నించింది. ఎల్లో మీడియా కథనాల మేరకు పోలీసులు కేసు కట్టారు. అధికారులు విచారణ చేపట్టారు. అయితే ఎక్కడా ఎటువంటి అవకతవకలు జరగలేదని తేలడంతో విచారణను అమరావతికి మార్చారు. మాజీ ఎమ్మెల్యే నవాజ్‌బాషా, వైఎస్సార్‌సీపీ నేత మాధవరెడ్డిపై కేసు నమోదు చేసినా.. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో హైకోర్టు ఆదేశాల మేరకు 41ఏ నోటీసులు ఇచ్చి బెయిల్‌ మంజూరు చేశారు. అయినా వదలకుండా మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో పనిచేసే తేజ అనే జూనియర్‌ అసిస్టెంట్‌ను అమరావతికి తీసుకెళ్లి విచారిస్తున్నారు. అగ్నిప్రమాదం చేయించింది పెద్దిరెడ్డే అని చెప్పమని తేజపై ఒత్తిడి చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

అగ్నిప్రమాదమే ఆయుధంగా..

విజిలెన్స్‌ విచారణలో ఏమీ దొరక్కపోవడంతో దిక్కుతోచని కూటమి నే9తలు శనివారం జరిగిన స్వల్ప అగ్నిప్రమాదాన్ని ఆయుధంగా మలుచుకుని వైఎస్సార్‌సీపీ నేతలు, కొందరు అధికారులపై నెపం నెట్టేందుకు కుట్రకు తెరతీశారు. తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్‌సీపీ నేతలే ఫైళ్లు తగులబెట్టేందుకు ప్రయత్నించారంటూ దుష్ప్రచారం మొదలెట్టారు. ఈ మేరకు ఆదివారం టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఎవరికి వారు మీడియా ద్వారా డ్రామాను రక్తికట్టించారు. అయితే టీటీడీ, విజిలెన్స్‌ అధికారులు మాత్రం అది ప్రమాదవ శాత్తు జరిగిందేనని శనివారం రాత్రే స్పష్టం చేశారు. ఆదివారం చేపట్టిన విజిలెన్స్‌, పోలీసుల విచారణలో కూడా ఇదే విషయం తేటతెల్లమైనట్లు ముఖ్య అధికారి ఒకరు ప్రకటించారు. ఈ ప్రమాదంలో రూ.5వేలు విలువచేసే జిరాక్స్‌ పత్రాలు కాలిపోయాయని వివరించారు. అయితే కూటమి నేతల ఒత్తిడితోనే కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement