డ్రైవర్లపై నోరుపారేసుకున్న చంద్రబాబు
శింగనమల వైఎస్సార్‌సీపీ అభ్యర్థి టిప్పర్ డ్రైవర్ అంటూ అవమానం
వెంటనే క్షమాపణ చెప్పాలనిడ్రైవర్ల సంఘం డిమాండ్
లేకుంటే బాబుకు బుద్ధి చెబుతామని ప్రతిన
చిత్తూరు రూరల్/బైరెడ్డిపల్లి/నగరి/తిరుపతి సిటీ: చంద్రబాబునాయుడుకు పేదలంటే గిట్టదు. దళితులన్నా, బడుగు, బలహీన వర్గాలన్నా ఆయనకు పడదు. అందుకే బహిరంగ సభలు, అసెంబ్లీ సమావేశాల్లో వారిని హేళనగా మాట్లాడేస్తుంటారు. సాక్షాత్తు అసెంబ్లీలోనే ‘ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా..?’ అంటూ దళితులను తీవ్రంగా అవమానపరిచారు. ఆపై నాయీబ్రాహ్మణులను తన దరికి చేరకుండానే కించపరిచి వెలుపులకు పంపేయడం గతంలో చర్చనీయాంశమైంది.
ఇప్పుడు ఎడమచేత్తో వేలిముద్రలేసేవారు టిప్పర్ డ్రైవర్లంటూ శింగనమల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యరి్థని ఉద్దేశించి చులకనగా మాట్లాడడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై జిల్లాలోని డ్రైవర్లు అగ్గిమీదగుగ్గిలమవుతున్నారు. దళితులు వేలిముద్రగాళ్లని, డ్రైవర్లని నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని మండిపడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో బాబుకు రాజకీయ సమాధి కట్టడం ఖాయమని ప్రతినబూనుతున్నారు. వెంటనే డ్రైవర్లందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే ఆందోళన తప్పని హెచ్చరిస్తున్నారు.
బాబులో ఓటమి భయం కనిపిస్తోంది
డ్రైవర్లనే కాదు, గతంలో ఎస్సీలను, నాయీ బ్రాహ్మణులను సైతం ఇదే రీతిలో అసభ్య పదజాలంతో అవమానించాడు. సీఎం జగన్ పేదల పక్షపాతి. కష్టం విలువ తెలిసిన నాయకుడు. అందుకే టిప్పర్ డ్రైవర్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఇది సాహసమనే చెప్పాలి. పేద, మధ్యతరగతి కుటుంబాలు జగనన్న పక్షాన నిలిచి మరో మారు సీఎంగా గెలిపించుకుంటారు. బాబును ప్రజలు పట్టించుకోవడం లేదు. అందుకనే ఆయన ఇలాంటి నీచపు మాటలకు తెరతీస్తున్నారు.
– పి.కరుణాకర్, క్యాబ్ డ్రైవర్, తిరుపతి
పేదల వ్యతిరేకి చంద్రబాబు
చంద్రబాబు నాయుడు పేదల వ్యతిరేకి. ఎన్నిక ల్లో సామాజిక న్యాయం పాటిస్తూ నిరుపేద అయిన టిప్పర్ డ్రైవర్‌కు ఎమ్మెల్యే సీటు కేటాయించిన పేదల పక్షపాతి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి. నిరుపేద టిప్పర్ డ్రైవర్‌కు రాజకీయ అవకాశం కల్పించడాన్ని జీర్ణించుకోలేని బాబు బహిరంగ సభలో హేళనగా మాట్లాడడం దారుణం. తన 14 ఏళ్ల పాలనలో బడుగు, బలహీన వర్గాల వారిపై దాడులు చేసి అగౌరవ పరిచారు.
– కె.కేశవులురెడ్డి, శ్రీలక్ష్మీ వెంకటేశ్వర వైట్ బోర్డ్ కార్ డ్రైవర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి, తిరుపతి
డ్రైవర్లంతా రోడ్డెక్కుతాం
రాష్ట్రంలోని డ్రైవర్లంతా రోడెక్కితే తినే తిండికి కూడా తిప్పలే. ఎక్కడికక్కడికి బండ్లు ఆపేసి చంద్రబాబుపై యుద్ధం ప్రకటిస్తాం. అప్పుడు తెలుస్తుంది డ్రైవర్ల సత్తా ఏమిటో. డ్రైవర్లను హేళన చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కచ్చితంగా చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. మాలాంటి డ్రైవర్లకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడం గిట్టక, అతనితో ఒడిపోతే.. పరువు పోతుందని చంద్రబాబు భావిస్తున్నట్లు ఉంది.
–త్యాగరాజులు, టిప్పర్‌డ్రైవర్, గుడిపాల
మా సత్తా ఏంటో చూపిస్తాం
చంద్రబాబు డ్రైవర్లను హేళన చేసి మాట్లాడితే ఊరుకోం. టీడీపీ హయంలో చంద్రబాబు ఓ సభలో ఎస్సీగా ఎవరైనా పుడతారా..?అని ఎస్సీలను చులకన చేశారు. అందుకే 2019 ఎన్నికలో ఎస్సీలంతా కలిసి తగిన బుద్ధి చెప్పారు. ఇప్పుడు డ్రైవర్లంటూ హేళన చేశారు. ఈసారి ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తాం.
–చిట్టిబాబు, ఆటోడ్రైవర్, చిత్తూరు
డ్రైవర్ విలువ తెలుసా బాబు?
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డ్రైవర్ లేకుండా ఎక్కడికై నా వెళ్లగలడా.. డ్రైవర్ విలువ తెలిసి కూడా డ్రై వర్లను హేళన చేస్తూ మాట్లాడడం సమంజసం కాదు. పేదలకు ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే తప్పేంటి. డ్రైవర్లను చులకన చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
–శ్రీనివాస్, డ్రైవర్, బైరెడ్డిపల్లె
Comments
Please login to add a commentAdd a comment