Veera Simha Reddy Pre Release Event: Yellow Gang Degenerate Politics - Sakshi
Sakshi News home page

వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌: పచ్చ బ్యాచ్‌.. పరువుపాయే..!

Published Sun, Jan 8 2023 1:31 PM | Last Updated on Sun, Jan 8 2023 2:34 PM

Veera Simha Reddy Pre Release Event: Yellow Gang Degenerate Politics - Sakshi

అది సినిమా ఫంక్షన్‌ అని మరిచారు..ఎప్పటిలాగే పచ్చ బ్యాచ్‌ చీప్‌ ట్రిక్స్‌కు తెరతీసింది. వేదిక పేరుతో టీడీపీ రచ్చ..రచ్చ చేసింది. ఇక ఎల్లో మీడియా అసత్య కథనాలను వండి వార్చేసింది. ప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ ఊదరగొట్టింది. వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ వేదికగా జరిగిన ఈ హైడ్రామాను రక్తి కట్టించబోయిన ఈ బ్యాచ్‌ బోర్లాపడింది. హీరో, చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ, దర్శకుడు మలినేని గోపీచంద్‌ చేసిన వ్యాఖ్యలు ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 

సాక్షిప్రతినిధి, ఒంగోలు: మలినేని గోపీచంద్‌ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను సినిమా బృందం ఒంగోలు నగరంలో నిర్వహించాలని నిర్ణయించింది. తొలుత వేదికను రైల్వే స్టేషన్‌ వద్ద ఉన్న ఏబీఎం గ్రౌండ్‌లో జరుపుకోవాలని నిర్వాహకులు తలంచారు. అందుకోసం ఏర్పాట్లు చేసుకునే ప్రయత్నంలో బందోబస్తు, సభ అనుమతికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఎంతమంది అభిమానులు, ప్రజలు వస్తారని పోలీసులు నిర్వాహకులను అడిగారు. 35 వేల మందికి పైగా పాసులు ఇవ్వాలని భావిస్తున్నామని చెప్పారు. దీంతో పోలీస్‌ అధికారులు ఈ గ్రౌండ్‌ కేవలం 15 వేల మందికి మాత్రమే సరిపోతుందని, ఇంకెక్కడైనా విశాలమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలని సూచించారు. దీంతో వారు ఉత్తర బైపాస్‌లోని ఒక విశాలమైన ప్రాంతాన్ని ఎంచుకొని అనుమతుల కోసం పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇది ఒకపక్క జరుగుతుంటే మరో పక్క ఎల్లో గ్యాంగ్‌ అసత్య ప్రచారానికి పూనుకుంది.

ఏబీఎం గ్రౌండ్‌లో నిర్వహించుకునేందుకు ఇచ్చిన అనుమతులను పోలీసులు రద్దు చేశారంటూ నానా రభస చేసింది. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ఒక అడుగు ముందుకేసి దీన్ని రాజకీయంగా  వాడుకోవటానికి, తనకు అనుకూలంగా మలుచుకోవటానికి సిద్ధమైపోయారు. వెంటనే విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి తమ హీరో సినిమా ఫంక్షన్‌కు అన్యాయం జరిగిపోతోందంటూ తనదైన శైలిలో నానా యాగీ చేశాడు. ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు వచ్చే జనాలకు ఏబీఎం గ్రౌండ్‌ సరిపోదని నిర్వాహకులకు పోలీస్‌ అధికారులు సూచించారే తప్ప వ్యతిరేకించలేదన్న సంగతి కూడా పూర్తిగా వినకుండానే రాజకీయ కోణాన్ని ఆవిష్కరించారు. దీనిని ఆసరాగా తీసుకుని ఎల్లో మీడియా రెచ్చిపోయింది.  కావాలనే ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను అటు పోలీసులు, ఇటు వైఎస్సార్‌ సీపీ రీజినల్‌ కో ఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అడ్డుకుంటున్నాడని జోరుగా ప్రచారం కూడా చేసింది.

ఎలాగైనా రాజకీయంగా వాడుకోవాలని చూసిన దామచర్ల చివరకు విఫలమయ్యాడు. దీంతో జనాల్లో కొద్దో గొప్పో ఉన్న పరువును కూడా పోగొట్టుకున్నాడు.  ఇదిలా ఉంటే శుక్రవారం రాత్రి ఒంగోలు నగరంలో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ ప్రశాంతంగా ముగిసింది. కార్యక్రమం విజయవంతంగా సాగిందని ఫంక్షన్‌ వేదికగా సినిమా డైరెక్టర్‌ మలినేని గోపీచంద్‌ ప్రకటించారు. నా కల సాకారం కావడానికి, ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ విజయవంతానికి మా బాలినేని వాసన్నే కారణమని స్వయంగా వేదిక సాక్షిగా ప్రశంసించారు. దీంతో అసలు వాస్తవం ఏమిటో ప్రజలకు కుండబద్దలు కొట్టినట్లు అర్థమైంది. హీరో బాలకృష్ణ కూడా పోలీసులు బాగా సహకరించారని స్వయంగా ప్రశంసించారు. అయితే ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో అటు బాలకృష్ణ కానీ, ఇటు సినిమా డైరెక్టర్‌ గోపీచంద్‌ కానీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల పేరును కూడా ప్రస్తావించలేదు. దీంతో ప్రతిదాన్నీ రాజకీయం చేయాలనుకునే దామచర్ల పరువు నిలువునా పోయినట్లయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దామచర్లను విమర్శిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు వైరల్‌ అయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement