సాక్షి, విజయవాడ: ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేపట్టారని దేవాదయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రజాసంకల్ప పాదయాత్రకు నేటితో నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నారు. విజయవాడలో నిర్వహించిన సంబరాల్లో పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటికీ పేదల గురించి ఏనాడూ ఆలోచించలేదు. క్యాపిటల్, పెట్టుబడిదారులు, తమ సామాజికవర్గం వారి గురించి మాత్రమే చంద్రబాబు ఆలోచన చేశాడు.
పేదల గురించి ఆలోచించింది ఆనాడు వైఎస్సార్.. నేడు జగన్ మాత్రమే. ఎండ, వాన లెక్క చేయకుండా 14 నెలల పాటు 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో అనేక ఘటనలు వైఎస్ జగన్‌కు ఎదురయ్యాయి. మ్యానిఫెస్టోని రెండేళ్లలోనే నెరవేర్చారు. భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయలేనంత గొప్పగా పరిపాలన చేస్తున్న వ్యక్తి వైఎస్ జగన్. ప్రజల నాడి, ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి జగన్. ప్రజలకి మంచి చేయాలన్న మనసున్న వ్యక్తి. ఇచ్చినమాటను నిలబెట్టుకుంటున్న జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడం సంతోషంగా ఉంది.
చదవండి: (నాలుగేళ్ల ‘ప్రజా సంకల్పం’.. సీఎం జగన్ ట్వీట్)
పళ్లున్న చెట్టుకే రాళ్లదెబ్బలు
ప్రజలకు జగన్ మంచి చేస్తున్నారు కాబట్టే జగన్‌పై ప్రతిపక్షాలు దాడి చేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల నుంచి స్థానిక ఎన్నికల వరకూ ప్రజలు మాకు అండగా నిలిచారు. రేపు జరగబోయే ఎన్నికల్లోనూ మాదే విజయం. ఏపీలో ప్రతిపక్షపార్టీల అవసరం లేదు. జనసేన, బీజేపీ, టీడీపీలు చూడ్డానికి మాత్రమే విడివిడిగా ఉండే రాజకీయ పార్టీలు. సీఎం జగన్‌పై దాడి చేయడానికి మాత్రం మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. ప్రజలు మాతో ఉన్నారు. రాజకీయ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు. రాజకీయ పార్టీలకు అతీతంగా భారతదేశంలో పాలన చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని సగర్వంగా చెబుతున్నాం అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment