తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న సింగంశెట్టి శ్రీనివాసరావు, కుటుంబ సభ్యులు
తాడేపల్లి రూరల్: తన ఇంటికి వెళ్లడానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు వాడుతున్న రోడ్డు స్థలం తమదేనని, దాన్ని ఇప్పించాలని గుంటూరు జిల్లా ఉండవల్లికి చెందిన సింగంశెట్టి శ్రీనివాసరావు తాడేపల్లి తహసీల్దార్‌కు వినతిపత్రం అందించాడు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్ శ్రీనివాసులురెడ్డిని కలిశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఉండవల్లిలో ఆయన నివాసముంటున్న లింగమనేని ఎస్టేట్‌కు దారిలేకపోవడంతో ఆర్డీవో, తాడేపల్లి తహసీల్దార్‌లు.. శ్రీనివాసరావుకు చెందిన 8 సెంట్ల స్థలాన్ని తీసుకున్నారు.
ఈ స్థలంలో చంద్రబాబు ఇంటికి వెళ్లడానికి వీలుగా బీటీ రోడ్ వేశారు. అయితే ఈ స్థలానికి సంబంధించి బాధితుడికి రూపాయి కూడా చెల్లించలేదు. అప్పటి నుంచి అదిగో ఇస్తాం.. ఇదిగో ఇస్తాం అంటూ కాలం గడిపారు. ఇప్పుడు తన తండ్రి శేషగిరిరావుకు ఆరోగ్యం బాగోలేదని.. ఇప్పటికే రూ.10 లక్షల వరకు ఖర్చు పెట్టామని శ్రీనివాసరావు వాపోతున్నాడు. వైద్యానికి నగదు లేక ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చేశామని కన్నీటిపర్యంతమయ్యాడు.
తన తండ్రి వైద్యానికి మరో రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుందని.. తమ స్థలం తమకు ఇస్తే అమ్ముకుని వైద్యానికి డబ్బు సమకూర్చుకుంటామని చెబుతున్నాడు. తన తండ్రి చావుబతుకుల్లో ఉంటే మరోవైపు తమకు కమీషన్ ఇస్తే స్థలానికి డబ్బులు ఇప్పిస్తామంటూ టీడీపీ నేతలు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ స్థలం అయినా తమకు అప్పగించాలని లేదా నగదు అయినా ఇవ్వాలని కోరాడు. లేకపోతే చంద్రబాబు ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని శ్రీనివాసరావు పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment