చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రిలో అత్యాధునిక వైద్యం | Vidadala Rajini: 100 Bed Critical Care Unit to Set up in Chilakaluripet | Sakshi
Sakshi News home page

చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రిలో అత్యాధునిక వైద్యం

Published Wed, Jul 27 2022 8:01 PM | Last Updated on Wed, Jul 27 2022 8:05 PM

Vidadala Rajini: 100 Bed Critical Care Unit to Set up in Chilakaluripet - Sakshi

చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రిలో వైద్యులతో మాట్లాడుతున్న మంత్రి రజిని, ప్రిన్సిపల్‌ సెక్రటరీ కృష్ణబాబు

చిలకలూరిపేట (పల్నాడు జిల్లా): చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రిలో అత్యాధునిక వైద్యం అందుబాటులోకి రానున్నదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో కొత్తగా నిర్మిస్తున్న 100 పడకల ఆస్పత్రిని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం మంత్రి పరిశీలించారు. మంత్రి రజిని మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ ప్రాంగణంలో ప్రభుత్వం 100 పడకల ఆస్పత్రి నిర్మిస్తోందని చెప్పారు. దీని కోసం ఇప్పటికే రూ.18.57 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. 4.147 ఎకరాల విస్తీర్ణంలో ఇది నిర్మితమవుతోందని, పనులు దాదాపు పూర్తయ్యాయని, రెండు నెలల్లో ఆస్పత్రిని ప్రారంభిస్తామని చెప్పారు. 


ఈ ఆస్పత్రిలో ఏకంగా 95 మంది సిబ్బందిని నియమించనున్నట్టు వెల్లడించారు. 23 మంది వైద్యులే ఉంటారని చెప్పారు. అన్ని స్పెషాలిటీల వైద్యులూ ఉంటారని వివరించారు. ఆస్పత్రిని ట్రామా కేర్‌ సెంటర్‌గా కూడా మార్చేందుకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. చుట్టూ ప్రహరీ, సిమెంట్‌ రోడ్లు, ఫర్నిచర్‌ కోసం రూ.10 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. అనంతరం మంత్రి  రజిని ఆస్పత్రిలో వైద్యులతో మాట్లాడి సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడారు. మంత్రి వెంట ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌ నివాస్,  ఏపీవీవీపీ కమిషనర్‌ వినోద్‌కుమార్, ఏఎస్‌ఎంఎస్‌ఐడీసీ సీఈ  శ్రీనివాసరావు, నోడల్‌ ఆఫీసర్‌ ప్రదీప్, మున్సిపల్‌ చైర్మన్‌ షేక్‌ రఫాని, ఏఎంసీ చైర్మన్‌ మద్దిరాల విశ్వనాథం ఉన్నారు.


వచ్చే జూన్‌ నాటికి బైపాస్‌ పూర్తి 

వచ్చే ఏడాది జూన్‌ నాటికి చిలకలూరిపేట బైపాస్‌ రోడ్డు నిర్మాణ పనులు పూర్తవుతాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. చిలకలూరిపేట బైపాస్‌ రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబుతో కలిసి మంత్రి పరిశీలించారు.  మంత్రి  మాట్లాడుతూ బైపాస్‌ను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నట్టు చెప్పారు. రోడ్డుకిరువైపులా రిటైనింగ్‌ వాల్‌ నిర్మిస్తున్నామని, దేశంలోనే ఇలాంటి రహదారి నిర్మాణం ఇదే తొలిసారి అని వెల్లడించారు. 


ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.800 కోట్ల వరకు ఖర్చు చేస్తోందని వివరించారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చలువ వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు.  కోటప్పకొండకు ప్రభలు వెళ్లడానికి వీలుగా రహదారికి పురుషోత్తమపట్నం వద్ద అత్యవసర ద్వారాలను ఏర్పాటు చేయాలని ఎంటీ కృష్ణబాబును మంత్రి కోరారు. గణపవరం–అప్పాపురం రోడ్డులో అండర్‌ పాస్‌ నిర్మించాలని, నరసరావుపేట, కోటప్పకొండ రహదారి మధ్యన బైపాస్‌కు రెండో వైపునా సర్వీసు రోడ్డు నిర్మించేలా ప్రతిపాదించాలని సూచించారు. ఈ మూడు అంశాలను తాను ప్రత్యేకంగా పరిశీలిస్తానని, నేషనల్‌ హైవేస్‌ అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తానని కృష్ణబాబు తెలిపారు. (క్లిక్: ఆగస్టు 7న టీటీడీ ఆధ్వర్యంలో ఉచిత వివాహాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement