
దొండపర్తి(విశాఖ దక్షిణ): మహిళా సాధికారత విషయంలో ఆంధ్రప్రదేశ్‌ని దేశంలోనే ముందు వరసలో నిలబెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అన్నారు. జాతీయ మహిళా కమిషన్, ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ‘జెండర్ రెస్పాన్సివ్ గవర్నెన్స్’ పేరుతో మహిళా ప్రజాప్రతినిధుల సదస్సు విశాఖలో ప్రారంభమైంది.
ఈ సదస్సులో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ సహా వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ వర్క్‌షాప్ తొలిరోజున హాజరైన మంత్రి విడదల రజిని మాట్లాడుతూ కార్యనిర్వాహక రాజధానిగా రూపాంతరం చెందుతున్న విశాఖలో ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం గర్వకారణమన్నారు.
ఏపీలో మహిళ అయి ఉంటే చాలు.. ఆమె పుట్టిననాటి నుంచి మరణించే వరకు ప్రతి దశలో ప్రభుత్వం నుంచి ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా లబ్ధి పొందుతుందని చెప్పారు. అధికార, రాజ్యాంగ, స్థానిక సంస్థల పదవులు.. ఇలా అన్నింటిలోనూ సగభాగం మహిళలకే కేటాయిస్తూ నిజమైన మహిళా సాధికారత దిశగా ఏపీని ముఖ్యమంత్రి ముందుకు తీసుకెళుతున్నారని తెలిపారు. కాగా, తొలిరోజు వర్క్‌షాప్‌లో ‘సాధికారత కలిగిన మహిళా నాయకత్వం–సాధికార ప్రజాస్వామ్యం’ అనే అంశంపై మహిళా శాసనసభ్యులు సదస్సులో చర్చించారు.