
సాక్షి, న్యూఢిల్లీ: తన స్వగ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (వైఎస్సార్‌సీపీపీ) నేత విజయసాయిరెడ్డి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి చెప్పారు. గ్రామంలో పనులన్నీ పూర్తయ్యాక ఒకసారి సందర్శించాలని కోరారు. న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో పలు పార్టీల నేతలు వెంకయ్యనాయుడుతో తమకున్న సాంగత్యాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ప్రజాజీవితంలో వెంకయ్యనాయుడుకు ఉన్న సుదీర్ఘ అనుభవం పదవీ విరమణ అనంతరం కూడా దేశానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. తామిద్దరూ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒకే నియోజకవర్గానికి చెందిన వారమన్నారు. సభలో కొన్నిసార్లు వెంకయ్యనాయుడుతో విభేదించి ఉండొచ్చుగానీ.. తర్వాత అలాచేసి ఉండకపోతే బాగుండునని అనిపించేదని ఆయన చెప్పారు.
వెంకయ్యనాయుడు స్ఫూర్తి
పాఠశాల రోజుల నుంచే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యక్తిత్వం, ప్రసంగాలు, దార్శనికత తనకు స్ఫూర్తినిచ్చాయని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ చెప్పారు. ప్రజాజీవితం, సేవల నుంచి వెంకయ్యనాయుడు ఎప్పటికీ విరమించుకోరని పేర్కొన్నారు.
సుదీర్ఘ అనుబంధం
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో తనకు సుదీర్ఘ అనుబంధం ఉందని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు చెప్పారు. వెంకయ్యనాయుడు ప్రసంగాలు వినడానికి తాను చాలా దూరం ప్రయాణించానని నాటి రోజులు గుర్తుచేసుకున్నారు. మాతృభాష వినియోగాన్ని ప్రోత్సహించడంలో వెంకయ్యనాయుడు నిబద్ధతను కొనియాడారు. ప్రజాజీవితంలో ఎదురులేని మంచి వ్యక్తుల్లో వెంకయ్యనాయుడు ఒకరని కొనియాడారు.