సాక్షి, విశాఖపట్నం: మధురవాడ భూముల విషయంలో టీడీపీ నాయకులు, కొన్ని మీడియా సంస్థలు తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. బాబు హయాంలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న టీడీపీ నేతల నుంచి వాటిని తిరిగి స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతున్నందునే భూ ఆక్రమణల పేరిట తనపై, వైఎస్సార్‌సీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్న టీడీపీ నాయకులు బండారు సత్యన్నారాయణమూర్తి తదితరులతో పాటు, ఈనాడు, ఆంధ్ర జ్యోతి, టీవీ5, మహాన్యూస్ మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ విశాఖ నార్త్ ఏసీపీ చుక్క శ్రీనివాసరావుకు శుక్రవారం పీఎంపాలెం పోలీసు స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు ఇచ్చారు.
వారం పది రోజుల్లో వారికి నోటీసులిస్తామని, ఆ తర్వాత పరువునష్టం దావా వేస్తానని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ఎన్‌సీసీ వ్యవహారంలో మొదటి నుంచీ ఏం జరిగిందో వివరించారు. ‘‘2005లో విఎంఆర్‌డీఏ, జీవీఎంసీల బిడ్డింగ్‌లో ఆరుగురు బిల్డర్లు పాల్గొన్నారు. దాన్లో ఎన్‌సీసీ సంస్థ అత్యధికంగా రూ.93.20 కోట్లుకు బిడ్ వేసింది. అదే ఏడాది డిసెంబర్లో ఎన్‌సీసీకి ఆ భూముల్ని ఖరారు చేశారు.
2007లో అభివృద్ధి రుసుం, వడ్డీతో కలిపి మొత్తం రూ.95 కోట్లు సంస్థ చెల్లించింది. మధురవాడ ఐటీ సెజ్ సమీపంలో మొత్తం 97 ఎకరాల్లో 33 ఎకరాలు నివాసిత స్థలం, 15 ఎకరాలు కొండ ప్రాంతం, 50 ఎకరాలు వ్యవసాయ భూమి. భూమి ఉపయోగాన్ని మార్చుకునేందుకు వారికి 2014 వరకు పట్టింది. అంతకు ముందు 2012లో ఈవ్యవహారంపై విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. విచారణ తర్వాత సంస్థకు నోటీసులిచ్చి అడ్వకేట్ జనరల్ సూచనలతో 2013లో రద్దుచేశారు. కానీ డబ్బులు కట్టించుకుని రద్దు చేశారంటూ ఎన్‌సీసీ సంస్థ 2013 చివర్లో హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. కోర్టు 2014 మార్చిలో స్టేటస్‌కో ఉత్తర్వులిచ్చింది’’ అని విజయసాయిరెడ్డి వివరించారు.
ఎన్‌సీసీ షరతులకు అంగీకరించిన బాబు...
2016లో సంస్థ ఈ భూములను ఫ్రీహోల్డ్ ల్యాండ్‌గా మార్చాలని ఎన్‌సీసీ అభ్యర్థించినట్లు విజయసాయిరెడ్డి చెప్పారు. ‘‘రెవెన్యూ పంపకంలో 3.5 శాతం భూమి నివాసిత ప్రదేశంగా, 4 శాతం భూమి వాణిజ్య పరంగా ప్రభుత్వానికి చెల్లిస్తామని, దానికి అంగీకరించకపోతే తమ సొమ్మును 12 శాతం వడ్డీతో వాపస్ చేయాలని సంస్థ కోరింది. ఆ కండిషన్‌కు నాటి సీఎం చంద్రబాబు అంగీకరించారు. తరవాత కేబినెట్లో ఆమోదించి 2019 ఫిబ్రవరిలో ఫ్రీ హోల్డ్ ల్యాండ్‌గా మార్చాడు. అనంతరం క్యాబినెట్ రద్దయినా.. ఆపద్ధర్మ సీఎం హోదాలో ఎన్‌సీసీ అభ్యర్థన మేరకు చంద్రబాబు రిజిస్ట్రేషన్ చార్జీలు రద్దుచేశారు. సంస్థకు అనుకూలంగా జీవో.121ని విడుదల చేశారు. దీనివల్ల ప్రభుత్వాదాయానికి భారీగా గండిపడింది.
జీపీఏ చేసేందుకు అంగీకారం తెలపడంతో ప్రభుత్వానికి మరో రూ.50 కోట్ల నష్టం కలిగింది. కానీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక జీపీఏ వల్ల ప్రభుత్వానికి నష్టం వస్తోంది కనక కుదరదని చెప్పి తప్పనిసరిగా రిజిస్ట్రే్టషన్ చేసుకోవాలని పేర్కొంది. భూమి విలువను అంచనా వేయడానికి కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సూచనల మేరకు మొత్తం రిజిస్ట్రేషన్ చార్జీలు, అభివృద్ధి చార్జీలు కలిపి రూ.187.97 కోట్లకుపైగా వసూలు చేశాం’’ అంటూ వివరించారు. దమ్ముంటే ఎన్‌సీసీ విషయంలో తప్పు చేయలేదని తిరుపతి వేంకటేశ్వరస్వామి వద్ద ప్రమాణం చేయాలని బాబుకు సవాల్ విసిరారు.
రాష్ట్రంలో ఎక్కడున్నా వదిలే ప్రసక్తే లేదు..
చంద్రబాబు 2014–19 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏకంగా రూ.7లక్షల కోట్లు విదేశాలకు తరలించారంటూ... ప్రభుత్వ భూమిని కబ్జాచేస్తే తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోదని స్పష్టంచేశారు. ‘‘రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఎక్కడ భూఆక్రమణ చేసినా తిరిగి స్వాధీనం చేసుకుంటాం. చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు, అనుచరులు.. ప్రభుత్వ భూములను ఎవరు ఆక్రమించుకున్నా.. వదిలే ప్రసక్తే లేదు’’ అన్నారు. అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుల బినామీ కంపెనీలపై ఈడీకి ఫిర్యాదు చేస్తానన్నారు. ‘‘జీఆర్‌పీఎల్ కంపెనీ మురళి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు మంచి స్నేహితుడు. ఆ కంపెనీలో నా అల్లుడికి వాటాలున్నాయనేది పచ్చి అబద్ధం. వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఈనాడు రామోజీరావు ఫిలిం సిటీ కట్టాడు. సంస్థ యజమానిని వెన్నుపోటు పొడిచి ఆంధ్రజ్యోతిని రాధాకృష్ణ లాక్కున్నాడు. మహాన్యూస్ సుజనాచౌదరి ప్రభుత్వ బ్యాంక్‌లకు రుణాలెగ్గొట్టిన ఆర్థిక నేరగాడు. వీళ్లు మాపై బురద జల్లడమా?’’ అని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment