
సాక్షి, అమరావతి: విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.14.37 కోట్ల విలువైన 17.90 కిలోల బంగారాన్ని విజయవాడ కస్టమ్స్ అధికారులు స్వాదీనం చేసుకొని.. ఒక మహిళ సహా 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వివరాలను విజయవాడ కస్టమ్స్ కమిషనర్ ఎస్.నరసింహారెడ్డి ఆదివారం మీడియాకు తెలియజేశారు. బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారనే సమాచారం మేరకు విజయవాడ కస్టమ్స్(ప్రివెంటివ్) కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించామని చెప్పారు.
తాడిపత్రి, నెల్లూరు రైల్వేస్టేషన్‌తో పాటు బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద కస్టమ్స్(ప్రివెంటివ్), తిరుపతి, గుంటూరు సెంట్రల్ జీఎస్టీ ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించాయని తెలిపారు. ఈ మొత్తం ఆపరేషన్‌లో విదేశాల నుంచి స్మగ్లింగ్ చేస్తున్న 17.90 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుని 16 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుల్లో ఒక మహిళ కూడా ఉన్నారని చెప్పారు. నిందితులను విశాఖపట్నం ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించినట్టు నరసింహారెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment