తాడేపల్లిగూడెం రూరల్ ప్రాంతం చినతాడేపల్లిలో ఏర్పాటు చేసిన సచివాలయం
ఏ చిన్న అవసరం వచ్చినా.. సచివాలయం. ఆరోగ్యం బాగోకపోతే.. ఆస్పత్రి. సాగు సమస్య వస్తే.. రైతుభరోసా కేంద్రం. ఎవరికైనా అన్యాయం జరిగితే.. గ్రామ పోలీసు. పిల్లలకు పౌష్టికాహారం ఇస్తూ ఇంగ్లిష్ చెప్పే అంగన్‌వాడీ కేంద్రం.. గ్రామ స్వరూపం మారిపోయింది. గ్రామ స్వరాజ్యం వచ్చింది. ఏ అవసరమైనా ఎక్కడికీ వెళ్లనక్కర్లేదు. అన్నీ ఊళ్లోనే. పల్లెల్లో సంక్షేమం పరవళ్లు తొక్కుతోంది. అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. ఏ అవసరమైనా ఎక్కడికీ వెళ్లనక్కర్లేదు. సేవలన్నీ చేరువలోనే ఉంటున్నాయి. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీని వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నిలబెట్టుకుంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఏడాదిన్నరలోనే ప్రజలకు కావాల్సిన సేవలన్నీ ఊళ్లోనే అందుబాటులోకి వచ్చాయి. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటైంది. రైతులకు భరోసా వచ్చింది. ఆరోగ్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.
జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 2,553 భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతోపాటు 961 సీసీ, బీటీ రోడ్లతో పల్లెలకు సరికొత్త బాటలు వేయనుంది. దీనికి కావాల్సిన టెండర్లు కూడా పూర్తయ్యాయి. త్వరలో రోడ్ల పనులు ప్రారంభం కానున్నాయి. ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు సచివాలయాలు, రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు, మద్దతు ధర కల్పించేలా రైతు భరోసా కేంద్రాలు, పల్లె వైద్యానికి పెద్దపీట వేస్తూ విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటవుతున్నాయి. వీటి భవన నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ ఏడాదిలోనే అన్ని భవనాలు అందుబాటులోకి వచ్చేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా మారాయి.
పెదతాడేపల్లిలో ఏర్పాటు చేసిన రైతుభరోసా కేంద్రం
910 గ్రామ సచివాలయాలు
జిల్లాలో 910 గ్రామ సచివాలయాలు ఏర్పాటయ్యాయి. వీటికి భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.356.07 కోట్లు విడుదల చేసింది. 265 భవనాలు పునాది స్థాయిలో, 213 భవనాలు శ్లాబ్ పూర్తయిన స్థాయిలో, 96 భవనాలు చివరి దశలో ఉండగా, 23 భవనాల నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. సచివాలయ కేంద్రాలుగా ఉన్న ప్రతి పంచాయతీలోను నాడు–నేడు పనులు చేపట్టారు.
గ్రామానికే వైద్యసేవలు
గ్రామంలోనే వైద్యసేవలు అందించేందుకు జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 722 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు మంజూరయ్యాయి. వీటి కోసం ప్రభుత్వం రూ.126.35 కోట్లు మంజూరు చేసింది. వీటిలో 346 భవనాలు పునాది స్థాయిలో, 151 మొదటి అంతస్తు పూర్తయిన స్థాయిలో, 21 భవనాలు చివరి దశలో ఉన్నాయి.
సీసీ రోడ్లకు రూ.162 కోట్లు
జిల్లాలో 949 సీసీ రోడ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటికి రూ.162.77 కోట్లు వెచ్చించారు. 12 బీటీ రోడ్లను మంజూరు చేశారు. మొత్తం 78,268 కిలోమీటర్ల మేర బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.49.46 కోట్లు వెచ్చించనున్నారు.
921 రైతుభరోసా కేంద్రాలు
జిల్లాలో 921 రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వీటికి భవనాలు నిర్మించేందుకు రూ.205.78 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటికే 51 భవనాలు పూర్తయ్యాయి. 645 కేంద్రాలు పునాదిస్థాయిలో, 221 భవనాలు శ్లాబ్ స్థాయిలో ఉన్నాయి.
వేగంగా అభివృద్ది పనులు
గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లకు భవన నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. త్వరలోనే వీటిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం. వీటితో పాటు గ్రామాల్లో బీటీ, సీసీ రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించాం.
– భాస్కర్‌రెడ్డి, పంచాయతీరాజ్ ఎస్‌ఈ
Comments
Please login to add a commentAdd a comment