వేలల్లో రుణం.. లక్షల్లో వసూళ్లు | Visakha Cybercrime China Loan App Andhra Pradesh | Sakshi
Sakshi News home page

వేలల్లో రుణం.. లక్షల్లో వసూళ్లు

Published Sun, Sep 11 2022 4:10 AM | Last Updated on Mon, Sep 12 2022 7:37 PM

Visakha Cybercrime China Loan App Andhra Pradesh - Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాజమహేంద్రవరానికి చెందిన దుర్గారావు దంపతులు, పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన శివ రుణ యాప్‌ల వేధింపులు తాళలేక ఇటీవల  చేసుకోవడం రాష్ట్ర వాప్తంగా కలకలం సృష్టించింది. ఇలా దేశ వ్యాప్తంగా ఎంతో మంది యాప్‌ల నిర్వాహకులు పంపిన అసభ్యకర మార్ఫింగ్‌ వీడియోలకు జడిసి అర్ధంతరంగా తనువు చాలించడం చర్చనీయాంశమైంది.

కొంత మంది బాధితులు మాత్రమే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా విశాఖపట్నంలోనూ ఒక మహిళ తాను తీసుకున్న రూ.5 వేల రుణానికి రూ.12 వేలకుపైగా చెల్లించినా.. అసభ్య వీడియోలతో బెదిరించడంతో విశాఖ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో విశాఖ పోలీసుల విచారణలో విస్తుగొలిపే అంశాలు బయటకొచ్చాయి. రుణయాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే సమయంలో మన ఫోన్చ్‌లోని కాంటాక్ట్‌ నంబర్లు, గ్యాలరీలోని ఫొటోలకు యాక్సెస్‌ను తీసుకుంటారు.

తద్వారా మన కాంటాక్ట్‌లోని నంబర్లకు రుణం తీసుకున్న వారి గురించి చెడుగా ప్రచారం చేయడంతో పాటు గ్యాలరీలో నుంచి కుటుంబ సభ్యుల ఫొటోలను తీసుకుని మార్ఫింగ్‌ చేసి అసభ్యంగా మార్చి భయపెడుతున్నారు. చైనా నుంచి ఆపరేట్‌ అవుతున్న ఈ రుణయాప్‌ల స్థావరాలు నేపాల్, బంగ్లాదేశ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయా దేశాల్లో ప్రత్యేకంగా కార్యాలయాలను నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలో, దేశంలో స్థానికంగా ఉండే వివిధ వ్యక్తుల నుంచి కరెంట్, ఫర్మ్‌ బ్యాంకు అకౌంట్లను కొనుగోలు చేసి.. వీటి ద్వారా మొత్తం ఆర్థిక వ్యవహారాలను సాగిస్తున్నారు.

తక్కువ రుణం ఇచ్చి, భారీగా వసూలు చేసి.. అందులో కొంత మొత్తాన్ని ఇక్కడ తమకు ఫర్మ్, కరెంటు అకౌంట్లు ఇచ్చిన వారికి కమీషన్‌ కింద చెల్లిస్తున్నారు. మిగిలిన భారీ మొత్తాన్ని డాలర్లలోకి మార్చుకుని బిట్‌ కాయిన్స్‌ రూపంలో చైనాకు తరలిస్తున్నారు. ఈ అకౌంట్లన్నింటినీ ఆన్‌లైన్‌లో చైనా నుంచే నిర్వహిస్తుండటం గమనార్హం.

ఈ అకౌంట్ల నిర్వహణకు ఇక్కడి వారి నుంచి ఓటీపీ కూడా తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకు హాంకాంగ్‌కు చెందిన కెవిన్‌ అనే వ్యక్తి సూత్రధారిగా తేలింది. ఇతనికి బ్యాంకు అకౌంట్లు విక్రయించిన వారు సుమారు 250 మంది వరకు ఉన్నట్లు తెలిసింది. ఒక్కొక్కరి అకౌంట్ల ద్వారా రూ.150 కోట్ల మేర లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. 
 
లోన్‌ యాప్‌లు.. విష వలయాలు
విశాఖకు చెందిన గిరి ఒక ఆటోడ్రైవర్‌. తొలుత ఒక రుణయాప్‌ నుంచి రూ.5 వేలు ఫిబ్రవరిలో రుణం తీసుకున్నాడు. అయితే, ఆయనకు నికరంగా డిపాజిట్‌ అయ్యింది రూ.3,500 మాత్రమే. అనంతరం వారి రుణాన్ని వారంలోగా చెల్లించేందుకు మరో రుణ యాప్‌ ద్వారా మరికొంత రుణం తీసుకున్నాడు. అయితే రుణం తీర్చినప్పటికీ మరింత చెల్లించాల్సిందేనంటూ బెదిరింపు కాల్స్‌ వచ్చాయి.

వారి కుటుంబ సభ్యుల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి పంపిస్తామంటూ బెదిరించసాగారు. దీంతో మొత్తం 13 రుణయాప్‌ల నుంచి సుమారు లక్ష రూపాయల మేర రుణం తీసుకున్నాడు. వీరికి ఏకంగా రూ.3,65,000 మేర చెల్లించారు. అయినప్పటికీ వేధింపులు ఆగకపోవడంతో చివరకు ఆగస్టులో సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది.

ఒక రుణయాప్‌లో తీసుకున్న రుణానికి మించి భారీగా చెల్లించాల్సి రావడంతో మరొక రుణయాప్‌ను ఆశ్రయించేలా ఓ పథకం ప్రకారం వ్యవహారం నడుస్తోందని తెలుస్తోంది. కెవిన్‌ లాంటి వారు సృష్టించిన విష వలయంలో ఎంత మేర ఇండియా కరెన్సీ బిట్‌కాయిన్స్‌ రూపంలో చైనాకు తరలిపోతోందో అంచనాలకు అందడం లేదు.  

2 వేల మంది ఉద్యోగులు
వాస్తవానికి మొదట్లో చైనా నుంచి ఆపరేట్‌ చేస్తున్న రుణయాప్‌ల నిర్వాహకులు శ్రీలంకలో కార్యాలయాలను ప్రారంభించారు. అయితే శ్రీలంకలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో తమ స్థావరాలను నేపాల్, బంగ్లాదేశ్‌లకు మార్చారు. ఏకంగా 2 వేల మంది ఉద్యోగులతో పనిచేసే కార్యాలయాన్ని నేపాల్‌లో నిర్వహిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో కూడా ఇదే తరహాలో కార్యాలయాలను నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఒక సెంటర్‌ నుంచి నిరంతరాయంగా రుణం తీసుకున్న వారికి బెదిరింపు కాల్స్‌ వెళుతుంటాయి.

మరో సెంటర్‌ నుంచి రుణం తీసుకున్న వారి ఫొటోలను మార్ఫింగ్‌ చేసి అసభ్యకరమైన వీడియోలను పంపుతున్నారు. ఇక్కడ పని చేసే వారిలో అనేక మంది భారత్‌ నుంచి వెళ్లిన వారే. అక్కడి నుంచి ఫోన్‌ కాల్స్‌ అన్నీ ఇండియా సిమ్‌కార్డుల నుంచే వస్తుండటం గమనార్హం. ఇండియా సిమ్స్‌ను సరఫరా చేసేందుకు ప్రత్యేక ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నట్లు తెలిసింది. కాగా, ఈ రుణ యాప్‌లను ఎవరూ ఆశ్రయించకుండా అవగాహన కల్పించడమే ప్రస్తుతం ప్రాధాన్యత అంశమని విశాఖ పోలీసు కమిషనర్‌ శ్రీకాంత్‌ చెబుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement