2024 నాటికల్లా విశాఖ మెట్రో.. | Visakhapatnam Metro Project Will Be Completed 2024 | Sakshi
Sakshi News home page

2024 నాటికల్లా విశాఖ మెట్రో..

Published Wed, Jul 29 2020 7:13 AM | Last Updated on Wed, Jul 29 2020 12:25 PM

Visakhapatnam Metro Project Will Be Completed 2024 - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగర వీధుల్లో మెట్రో రైలు పరుగు తీసేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే లైట్‌మెట్రో, ట్రామ్‌ కారిడార్‌లకు సంబంధించిన డీపీఆర్‌ తయారు చేసే బాధ్యతల్లో యూఎంటీసీ సంస్థ తలమునకలు కాగా.. ప్రాజెక్టు అంచనాల వ్యయం తయారు చేయడంలో అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ బిజీగా ఉంది. లైట్‌ మెట్రో రైలు కారిడార్‌ నిర్మాణానికి ఒక కిలోమీటరుకు రూ.200 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తుండగా.. ట్రామ్‌ కారిడార్‌కు రూ.100 నుంచి రూ.120 కోట్లుగా భావిస్తున్నారు. లైట్‌ మెట్రోకు సంబంధించిన డీపీఆర్‌ని నవంబర్‌ నెలాఖరుకు, ట్రామ్‌ కారిడార్‌కు సంబంధించిన డీపీఆర్‌ని డిసెంబర్‌ నెలాఖరుకల్లా ప్రభుత్వానికి నివేదించేందుకు యూఎంటీసీ అంగీకరించింది.  నగరంలో ఏ సమయంలో ఎంత ట్రాఫిక్‌ ఉంటోంది.. మెట్రో కారిడార్‌ రూట్‌మ్యాప్‌లలో జరుగుతున్న అభివృద్ధి 2050 నాటికి జరగనున్న మార్పులు, పెరగనున్న ట్రాఫిక్‌ మొదలైన అంచనాలతో డీపీఆర్‌ తయారవుతోంది. 

కీలక నిర్ణయాలు పూర్తవడంతో.. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ పనులు ఊపందుకున్నాయి. లైట్‌ మెట్రోరైలు, మోడ్రన్‌ ట్రామ్‌ కారిడార్‌లకు సంబంధించిన సవివర ప్రాజెక్ట్‌ నివేదిక(డీపీఆర్‌) అర్బన్‌ మాస్‌ ట్రాన్సిస్ట్‌ కంపెనీ చేతిలో సిద్ధమవుతోంది. లైట్‌ మెట్రో రైలు ప్రాజెక్ట్‌కు సంబంధించి గతంలో రూపొందించిన 42.55 కిలోమీటర్ల డీపీఆర్‌ను అప్‌డేట్‌ చేస్తూ.. 79.91 కి.మీకు సంబంధించిన డీపీఆర్‌ను రూ.5.34 కోట్లకు, 60.20 కి.మీ పొడవున్న ట్రామ్‌ కారిడార్‌కు సంబంధించిన డీపీఆర్‌ను రూ.3.38కోట్లకు అర్బన్‌ మాస్‌ ట్రాన్సిస్ట్‌ కంపెనీ లిమిటెడ్‌ (యూఎంటీసీ)కు ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు రెండు ప్రాజెక్ట్‌లకు సంబంధించిన డీపీఆర్‌ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. 

నవంబర్‌లో లైట్‌ మెట్రో.. డిసెంబర్‌లో ట్రామ్‌ 
ఏప్రిల్, మేలో రెండు డీపీఆర్‌లకు చెందిన బాధ్యతలను అప్పగించి.. ఆరు నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. అయితే.. కోవిడ్‌–19 కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో డీపీఆర్‌ పనులను యూఎంటీసీ ప్రారంభించడంలో ఆలస్యమైంది. దీంతో ప్రభుత్వం అదనపు సమయం కేటాయించింది. లైట్‌మెట్రోకు సంబంధించిన డీపీఆర్‌ను నవంబర్‌ నెలాఖరుకు, ట్రామ్‌ కారిడార్‌కు సంబంధించిన డీపీఆర్‌ను డిసెంబర్‌ నెలాఖరుకల్లా ప్రభుత్వానికి నివేదించేందుకు యూఎంటీసీ అంగీకరించింది. ఈ మేరకు నగరంలో ఏ సమయంలో ఎంత ట్రాఫిక్‌ ఉంటోంది.. మెట్రో కారిడార్‌ రూట్‌మ్యాప్‌లలో జరుగుతున్న అభివృద్ధి, 2050 నాటికి జరగనున్న మార్పులు, పెరగనున్న ట్రాఫిక్‌ మొదలైన అంచనాలతో డీపీఆర్‌ తయారవుతోంది. 

లైట్‌ మెట్రో ప్రాజెక్ట్‌ 79.91 కి.మీ మేర రూపుదిద్దుకుంటోంది. వివిధ దేశాల్లో చేపట్టిన ప్రాజెక్ట్‌లను అధ్యయనం చేసిన అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌(ఏఎంఆర్‌సీ) ప్రాజెక్ట్‌ వ్యయంపై ప్రాథమిక అంచనాలను రూపొందించింది. ఒక కిలోమీటర్‌ మేర లైట్‌ మెట్రో కారిడార్‌ నిర్మాణానికి రూ.200 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. అదే విధంగా లైట్‌ మెట్రోతో పోలిస్తే ట్రామ్‌ కారిడార్‌ నిర్మాణం తక్కువ ఖర్చుతో కూడుకున్నదిగా గుర్తించారు. ఒక కి.మీ ట్రామ్‌ కారిడార్‌ నిర్మించేందుకు రూ.100 కోట్లు నుంచి రూ.120 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని భావిస్తున్నారు. మొత్తం 79.91 కి.మీ మేర లైట్‌ మెట్రో ప్రాజెక్ట్‌ నిర్మాణానికి సుమారు రూ.16,000 కోట్లు, 60.20 కి.మీ మేర ట్రామ్‌ కారిడార్‌ నిర్మాణానికి రూ.7,320 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇప్పటికే ట్రామ్‌కు సంబంధించి బ్రెజిల్, స్పెయిన్, దుబాయ్, ఫ్రాన్స్‌ దేశాల ప్రాజెక్ట్‌ల వివరాలు సేకరిస్తున్నారు. డీపీఆర్‌ సిద్ధమైతే ఈ అంచనా వ్యయాల్లో స్వల్ప మార్పులుండనున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 

  ఇవీ అంచనాలు  

  • లైట్‌ మెట్రో డీపీఆర్‌ పూర్తయ్యే సమయం– 2020 నవంబర్‌ 
  • కిలోమీటర్‌ నిర్మాణానికి లైట్‌ మెట్రోకు అయ్యే ఖర్చు– సుమారు రూ.200 కోట్లు 
  • ట్రామ్‌ కారిడార్‌ డీపీఆర్‌ పూర్తయ్యే సమయం– 2020 డిసెంబర్‌ 
  • కిలోమీటర్‌ నిర్మాణానికి ట్రామ్‌ కారిడార్‌కు అయ్యే ఖర్చు– సుమారు రూ.100 కోట్లు నుంచి రూ.120 కోట్లు 
  • అగ్రిమెంట్‌ పూర్తి చేసుకునే సమయం–మార్చి 2021 
  • లైట్‌ మెట్రో కారిడార్‌ పనులు ప్రారంభించే సమయం– జూన్‌ 2021 
  • విశాఖ వీధుల్లో మొదటి మెట్రో సర్వీసు ప్రారంభమయ్యే సమయం– మార్చి 2024 

2024 నాటికల్లా పట్టాలెక్కేలా..  
ఈ ఏడాది చివరి నాటికల్లా లైట్‌ మెట్రో, మోడ్రన్‌ ట్రామ్‌ కారిడార్లకు డీపీఆర్‌లు పూర్తి కానున్నాయి. వాటిని ప్రభుత్వం అధ్యయనం చేసిన వెంటనే బిడ్డింగ్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతాం. పరిస్థితులన్నీ అనుకూలిస్తే మార్చి 2021 నాటికి పనులకు సంబంధించి అగ్రిమెంట్‌ పూర్తి చేస్తాం. జూన్‌ 2021 నాటికి లైట్‌ మెట్రో కారిడార్‌ పనులు ప్రారంభిస్తాం. మార్చి 2024 నాటికి లైట్‌ మెట్రోలో ఒక కారిడార్‌ నుంచి ప్రయాణాలు ప్రారంభించేలా.. మెట్రోరైలు ప్రాజెక్ట్‌ను శరవేగంగా పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. – రామకృష్ణారెడ్డి, ఎండీ, అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement