ఆత్మకూరు రూరల్ (మర్రిపాడు)/కాకినాడ సిటీ: వలంటీర్ల వ్యవస్థపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో శుక్రవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. పవన్ దిష్టి బొమ్మ దహనాలు, ర్యాలీలు నిర్వహించి వలంటీర్లు తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు పవన్ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పలు మండలాల్లో వలంటీర్లు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
మండల కేంద్రం మర్రిపాడులోని మండల పరిషత్ కార్యాలయం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. పవన్ దిష్టిబొమ్మను దహనం చేసి తమపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఏఎస్‌పేటలో వలంటీర్లు ధర్నా నిర్వహించారు. సైనికుల్లా పనిచేస్తున్న వలంటీర్లను కించపరచడం సరికాదని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా నందలూరులో పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ వలంటీర్లు ర్యాలీ నిర్వహించారు.
పవన్ వ్యాఖ్యలపై ‘తూర్పు’ జెడ్పీ ఆగ్రహం
వలంటీర్ల వ్యవస్థపై కొందరు వ్యక్తులు పనిగట్టుకొని చేస్తున్న దుష్ప్రచారాన్ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం ఖండించింది. ప్రజలకు సేవలను అందిస్తున్న వలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ, వలంటీర్లకు ప్రజాప్రతినిధులంతా అండగా ఉండే విధంగా జెడ్పీ సమావేశంలో తీర్మానం ఆమోదించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు చేసిన ప్రతిపాదనను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. సభలో పాల్గొన్న ప్రజాప్రతినిధులంతా వలంటీర్లకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. వలంటీర్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని కొందరు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment