Volunteers Protests All Over Andhra Pradesh On Pawan Kalyan Comments Eluru Sabha, Details Inside - Sakshi
Sakshi News home page

AP Volunteers Protests: పవన్‌ వ్యాఖ్యలపై వలంటీర్ల ఆగ్రహ జ్వాల

Published Tue, Jul 11 2023 3:56 AM | Last Updated on Tue, Jul 11 2023 11:25 AM

Volunteers Protests All Over Andhra Pradesh On Pawan Kalyan Comments - Sakshi

ఒంగోలులో పవన్‌కళ్యాణ్‌ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న వలంటీర్‌లు, స్థానిక ప్రజలు , పశి్చమగోదావరి జిల్లా భీమవరంలో పవన్‌ కళ్యాణ్‌ దిష్టిబొమ్మను కాలితో తొక్కి ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా వలంటీర్‌

సాక్షి, అమరావతి, నెట్‌వర్క్‌: గ్రామాల్లో ఆత్మీయులకు స్వచ్ఛందంగా సేవలందించే వలంటీర్లను జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ సంఘ విద్రోహ శక్తులతో పోల్చటంపై నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి. అవ్వాతాతలు, అక్క­చెల్లెమ్మలు ఆప్యాయంగా పలుకరించే వలంటీర్‌ సోదరులకు దురుద్దేశాలను ఆపాదించడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వలంటీర్లుగా దాదాపు 53 శాతం మంది యువతులు సేవలందిస్తుండగా సాటి మహిళలకు వారెందుకు చేటు చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

కోవిడ్‌ మహమ్మారి విరుచుకుపడ్డ వేళ బాధితుల వద్దకు వెళ్లేందుకు కుటుంబ సభ్యులే వెనుకాడినా వలంటీర్లు మానవత్వంతో అందించిన సేవలను గుర్తు చేస్తున్నారు. పవన్‌ తన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుని వలంటీర్లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. పలుచోట్ల వలంటీర్లు ఆగ్రహంతో ఊగిపోతూ పవన్‌కళ్యాణ్‌ ఫోటోలు, పోస్టర్లను చెప్పుతో కొడుతూ నిరసన తెలిపారు. దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు.

జనసేన అధ్యక్షుడి అనుచిత వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వలంటీర్లు నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరయ్యారు. ‘సేవా భావంతో పనిచేసే మా వలంటీర్ల జోలికొస్తే తాట తీస్తాం.. ’ అంటూ హెచ్చరించారు. నిన్న.. వలంటీర్లను మహిళల కిడ్నాప్‌లకు సహకరించే సంఘ విద్రోహులుగా అభివర్ణించిన పవన్‌కళ్యాణ్‌ తాజాగా వారు సేకరించే సమాచారం ఎక్కడెక్కడికో పోతోంది...! అది చాలా భయంకరమైన వ్యవస్థ.. ఇళ్లల్లోకి దూరుతున్నారు.. ! అవి ఊడిగం ఉద్యోగాలంటూ వలంటీర్ల ఆత్మాభిమానాన్ని కించపరిచేలా మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఏపీలో మహిళల కిడ్నాప్‌లకు సంబంధించి తనకు కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం ఉందని పవన్‌ చెబుతుండగా.. అదే నిజమైతే అలాంటి కీలక వివరాలను ఓ రాజకీయ నేతకు నిఘా వర్గాలు అందిస్తాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారానికి స్క్రిప్టు సమకూర్చింది ఈనాడు రామోజీ కాగా చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్‌ యాక్టింగ్‌ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. 

► గత అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్‌ పోటీ చేసిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వలంటీర్లు భారీ ర్యాలీ నిర్వహించి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం పొంగుటూరులో వలంటీర్లు  నల్ల రిబ్బన్లతో విధులకు హాజరయ్యారు. 

► ఎన్టీఆర్‌ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో వలంటీర్లు షెహనాజ్, అశ్విని, లక్ష్మి, ఠాగూర్, దుర్గాప్రసాద్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్‌ అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా పాల్గొని సంఘీభావం తెలిపారు. 

► విజయనగరం జిల్లా చీపురుపల్లిలో భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించి పవన్‌కల్యాణ్‌పై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్ల, జామి మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. 

► శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పవన్‌ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టారు. కొత్తూరు తదితర చోట్ల పవన్‌ కల్యాణ్‌ చిత్రపటాన్ని దగ్ధం చేశారు. 

► డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంతో పాటు మామిడికుదురు మండలం నగరం, రాయవరం మండలం పసలపూడిలో పవన్‌ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. అనపర్తి దేవీచౌక్‌ సెంటర్‌ వద్ద మానవహారం నిర్వహించి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

► కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో పవన్‌ చిత్ర పటాలకు నిప్పు అంటించారు. 
► కరప మండలంలో  అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించి, నిరసన తెలిపారు.
► తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు వాటర్‌ ట్యాంకు జంక్షను వద్ద పవన్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 

► విశాఖ తాటిచెట్లపాలెం జంక్షన్‌ జాతీయ రహదారిపై మానవహారం చేపట్టారు. గోపాలపట్నం పోలీస్‌ స్టేషన్‌లో పవన్‌పై వలంటీర్లు ఫిర్యాదు చేశారు. నెడ్‌క్యాప్‌ చైర్మన్‌ కేకే రాజు వలంటీర్లకు సంఘీభావం తెలిపారు. భీమిలిలో ర్యాలీ చేపట్టి పవన్‌ దిష్టిబొమ్మని దహనం చేశారు. గాజువాక, పెందుర్తి, మల్కాపురం జంక్షన్ల వద్ద నిరసన ప్రదర్శనలు జరిగాయి. అనకాపల్లిలో కలెక్టర్, ఎస్‌పీకి వినతిపత్రాలు అందించారు. బుచ్చెయ్యపేట, వడ్డాది ప్రాంతాల్లో వలంటీర్లు ఆందోళనలు నిర్వహించారు. పాడేరు, అరకు, చింతపల్లి, రంపచోడవరంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

► ఉమ్మడి కృష్ణా జిల్లావ్యాప్తంగా పలుచోట్ల పవన్‌ కల్యాణ్‌ దిష్టిబొమ్మలు దగ్ధం చేసి మానవహారాలు నిర్వహించారు. పెనమలూరు కామయ్యతోపు సెంటర్‌లో వలంటీర్ల సమాఖ్య అధ్యక్షుడు సమీర్‌ అహ్మద్‌ షాజాద్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

► వలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్‌కల్యాణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా గుడ్లూరు, ప్రకాశం జిల్లా మార్కాపురంలో పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దగదర్తి, బిట్రగుంటలో వలంటీర్లు ప్రజాప్రతినిధులతో కలిసి పవన్‌ కల్యాణ్‌ ఫోటోలకు నిప్పు అంటించారు. 

ఒంగోలులో కొవ్వొత్తులతో మానవహారం నిర్వహించారు. చీమకుర్తి, పొన్నలూరు, పెద్ద దోర్నాలలో వలంటీర్లు నల్ల బ్యాడ్జ్లతో నిరసన తెలిపారు. 

► పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల వ్యాప్తంగా పలుచోట్ల పవన్‌ దిష్టిబొమ్మలను దహనం చేశారు. భట్టిప్రోలు, చెరుకుపల్లి, పర్చూరు, చీరాల, అద్దంకి నియోజకవర్గాల పరిధిలో జాతీయ రహదారులపై పవన్‌ కల్యాణ్‌ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మహిళా వలంటీర్లు పవన్‌ కల్యాణ్‌ దిష్టిబొమ్మలను చెప్పులతో కొట్టి నిరసన తెలిపారు.

► ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉరవకొండ, బెళుగుప్ప, కనగానపల్లి, రామగిరి పోలీసుస్టేషన్లలో పవన్‌పై ఫిర్యాదు చేశారు. పుట్లూరు, గుత్తిలో నిరసన వ్యక్తం చేశారు. రాయదుర్గం, సోమందేపల్లి, ఆత్మకూరు, పరిగి, కళ్యాణదుర్గంలో పవన్‌ దిష్టిబొమ్మలు దహనం చేశారు.

► ఉమ్మడి కర్నూలు జిల్లాలో పవన్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్నూలు జిల్లా పరిషత్‌ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం, పాత బస్టాండ్‌ వద్ద వలంటీర్లు నిరసన తెలిపారు. పత్తికొండలో పవన్‌పై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బనగానపల్లెలో దిష్టిబొమ్మ దహనం చేశారు.

► కడపలోని ఏడు రోడ్ల సర్కిల్‌ వద్ద పవన్‌ కళ్యాణ్‌ దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. చెన్నూరు బస్టాండు, వేంపల్లెలోని నాలుగురోడ్ల కూడలిలో దిష్టిబొమ్మను దహనం చేశారు. పులివెందుల, అన్నమయ్య జిల్లా రామసముద్రంలో నిరసనలు ఎగసిపడ్డాయి. ప్రొద్దుటూరులో పవన్‌ కల్యాణ్‌పై కేసు నమోదు చేయాలని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

► తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో నిరసనలు భగ్గుమన్నాయి. నగరి మున్సిపల్‌ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శనలు జరిగాయి.

► సమాజానికి సేవ చేస్తున్న తమను అసాంఘిక శక్తులతో పోల్చడంపై మండిపడుతూ చింతలపూడిలో వలంటీర్లు పవన్‌కళ్యాణ్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యే వీఆర్‌ ఎలీజాఈ కార్యక్రమంలో వలంటీర్లతో కలిసి  పాల్గొన్నారు. ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు పవన్‌కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వలంటీర్లలో 60 శాతం మంది మహిళలే ఉన్నారని గుర్తు చేశారు.

పవన్‌ కళ్యాణ్‌ బేషరతుగా వలంటీర్లకు క్షమాపణ చెప్పాలని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డిమాండ్‌ చేశారు. ఏలూరు, దెందులూరు, నూజివీడు, చింతలపూడి, ఉండి, తాడేపల్లిగూడెం, నర్సాపురం, పాలకొల్లు, ఆచంట తదితర నియోజకవర్గాల్లో పవన్‌కళ్యాణ్‌ దిష్టిబొమ్మలను దహనం చేసి చెప్పులతో కొట్టి నిరసన తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement