
మాడభూషి శ్రీధర్ రచించిన రైతు వ్యతిరేక చట్టాలపై తిరగబడ్డ ట్రాక్టర్లు అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఉండవల్లి అరుణ్‌కుమార్
సీతంపేట (విశాఖ ఉత్తర): కేవలం 30 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిన వాళ్లకు ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసే అధికారం ఎక్కడిదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్, ఎల్‌ఐసీని ఎలా అమ్మేస్తారని నిలదీశారు. రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం విశాఖలో జరిగిన కార్యక్రమంలో ఉండవల్లి ప్రసంగించారు. స్టీల్ ప్లాంట్‌కు భూములిచ్చిన ఏడు వేల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు.
వారికి న్యాయం చేయకుండా వేరే వారికి ప్లాంటును ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. ఈ రోజు సోషలిజం వర్సెస్ క్యాపిటలిజం నడుస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని కేంద్రాన్ని నిలదీయాలన్నారు. కేంద్రంపై వైఎస్ జగన్ మాత్రమే పోరాటం చేయగలరని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. దేశ బడ్జెట్‌తో సమానమైన సొమ్ము కేవలం 63 మంది వద్ద ఉందంటే.. ఇది సోషలిస్టు దేశమా లేక క్యాపిటలిస్టు దేశమా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో రైటర్స్ అకాడమీ చైర్మన్ వి.వి.రమణమూర్తి, మాజీ జేడీ లక్ష్మీనారాయణ, మాజీ ఆర్టీఐ కమిషనర్ మాడభూషి శ్రీధర్, మాజీ ఎమ్మెల్యే వట్టి వసంతకుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment