సీఐడీ కేసుల్లో దోషులకు శిక్ష ఖాయం  | We have taken heritage IT returns as per rules: andhra pradesh | Sakshi
Sakshi News home page

సీఐడీ కేసుల్లో దోషులకు శిక్ష ఖాయం 

Published Tue, Apr 9 2024 3:39 AM | Last Updated on Tue, Apr 9 2024 3:15 PM

We have taken heritage IT returns as per rules: andhra pradesh - Sakshi

5 కేసులు దర్యాప్తు చేస్తున్నాం 

పూర్తి ఆధారాలతో కోర్టులో చార్జిషిట్లు దాఖలు.. కేస్‌ డైరీలు, ఇతర ఆధారాలన్నీ న్యాయస్థానానికి ఇచ్చాం

అందుకోసం లక్షల పేజీల ఫొటోస్టాట్‌ కాపీలు తీశాం.. సక్రమంగా రాని కాపీలను చిత్తుగా పరిగణించి కాల్చివేశాం 

ఇది అన్ని దర్యాప్తు సంస్థలు పాటించే విధానమే.. దీన్ని వక్రీకరిస్తూ ఓ వర్గం మీడియా దుష్ప్రచారం 

కేసుల ఆధారాలన్నీ భద్రంగా ఉన్నాయి 

నిబంధనల ప్రకారమే హెరిటేజ్‌ ఐటీ రిటర్న్‌లు తీసుకున్నాం

హెరిటేజ్‌ నుంచి కూడా కొన్ని పత్రాలు తీసుకున్నాం.. సిట్‌ స్పష్టీకరణ 

సిట్‌ దర్యాప్తు చేస్తున్న కేసులకు సంబంధించిన పత్రాలన్నీ న్యాయస్థానాల్లో ఉన్నాయి. ఆ కేసుల్లో దోషులకు శిక్షలు పడటం ఖాయం.     – సిట్‌కు నేతృత్వం వహిస్తున్న ఐజీ కొల్లి రఘురామరెడ్డి 

సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి, కుంభకోణాలపై సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) నమోదు చేసిన కేసుల్లో దోషులకు శిక్ష ఖాయమని తేలడంతో ఎల్లో గ్యాంగ్‌ బెంబేలెత్తుతోంది. దాంతో సిట్‌పై దుష్ప్రచారం చేసేందుకు యత్నించి బోర్లా పడింది. చంద్రబాబు కేసుల పత్రాలను సిట్‌ కార్యాలయం ప్రాంగణంలో కాల్చివేస్తున్నారంటూ ఎల్లో చానళ్లు సోమవారం హడావుడి చేశాయి. ఈ ఎన్నికల తరువాత వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని భావించే సిట్‌ అధికారులు ఇలా పత్రాలను కాల్చివేస్తున్నారంటూ వక్రీకరించిన కథనాలతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించాయి.

కానీ తాము దర్యాప్తు చేస్తున్న అయిదు కేసుల్లో పూర్తి ఆధారాలతో న్యాయస్థానాల్లో చార్జ్‌షీట్లు దాఖలు చేశామని, అంతకు ముందే కీలక  కేస్‌ డైరీలు, ఆధారాలుగా ఉన్నఒరిజినల్‌ పత్రాలను కూడా న్యాయస్థానాలకు సమర్పించామని సిట్‌ స్పష్టం చేసింది. ఆ సందర్భంగా తీసిన లక్షలాది ఫొటోస్టాట్‌ కాపీల్లో సరిగా రాని వాటిని చిత్తుగా పరిగణించి కాల్చివేశామని వెల్లడించడంతో ఎల్లో మీడియా నోళ్లు మూతపడ్డాయి. అసలు కేసులకు సంబంధించిన పత్రాలను రహస్యంగా కాల్చివేసే ఉద్దేశమే ఉంటే ఎక్కడో రహస్యంగా చేస్తారు. అది పెద్ద కష్టమేమీ కాదు. కానీ, సిట్‌ కార్యాలయ ప్రాంగణంలో.. అదీ పట్టపగలు అందరూ చూస్తుండగా ఎందుకు చేస్తారు? ఈ చిన్న లాజిక్‌ను మర్చిపోయిన ఎల్లో మీడియా బోల్తా పడింది.  

అదిగో తోక.. ఇదిగో పులి
తాడేపల్లిలోని సిట్‌ కార్యాలయం ఉన్న గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాంగణం సమీపంలో కొన్ని చిత్తుకాగితాలను  సిబ్బంది సోమవారం ఉదయం కాల్చివేశారు. అది చూసి టీడీపీ నేతలు, ఆ పారీ్టకి కొమ్ముకాసే ఎల్లో మీడియా చానళ్లు హడావుడి మొదలుపెట్టాయి. చంద్రబాబుపై నమోదు చేసిన కేసుల కీలక పత్రాలను సిట్‌ అధికారులు రహస్యంగా దహనం చేసేస్తున్నారని, వాటిలో హెరిటేజ్‌ ఫుడ్స్‌కు సంబంధించిన పత్రాలు ఉన్నాయంటూ ప్రచారం ప్రారంభించాయి. అనుమతి లేకుండా సిట్‌ అధికారులు తీసుకున్న హెరిటేజ్‌ ఫుడ్స్, నారా భువనేశ్వరిల ఆదాయ పన్ను రిటర్న్‌ కాపీలు వీటిలో ఉన్నాయని ఊదరగొట్టాయి.

చంద్రబాబుపై అక్రమంగా కేసులు నమోదు చేశారని, లోకేశ్‌ను అక్రమంగా విచారించారని, అందుకే ఆ కేసుల కాపీలను దహనం చేసేస్తున్నారని కూడా చెప్పుకొచ్చాయి. అంతే కాదు.. ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బండారం బయటపడుతుందనే ఆందోళనతోనే సిట్‌ అధికారులు ఇలా పత్రాలను రహస్యంగా దహనం చేసేస్తున్నారని కూడా ఇష్టానుసారం వక్రీకరణలతో కూడిన కథనాలను ప్రసారం చేశాయి. ఎన్నికల వేళ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు పడరాని పాట్లు పడ్డాయి. 

దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిన సిట్‌ 
టీడీపీ నేతలు, ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని సిట్‌ ఓ ప్రకటనలో సమర్థంగా తిప్పికొట్టింది. ‘సిట్‌ కార్యాలయం సమీపంలో దహనం చేసినవి చిత్తు ప్రతులే. మేము దర్యాప్తు చేస్తున్న 5 కేసుల్లో పూర్తి ఆధారాలతో ఇప్పటికే విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో చార్జిషిట్లు దాఖలు చేశాం. ఈ కేసుల కేస్‌ డైరీలు, ఇతర కీలక ఆధారాలను న్యాయస్థానానికి ఎప్పటికప్పుడు సమర్పించాం. ఆధారాల్లో వేటినీ ధ్వంసం చేయలేదు. ఆధారాలన్నీ భద్రంగా ఉన్నాయి. పూర్తి ఆధారాలతో నమోదు చేసిన ఈ కేసుల్లో దోషులకు శిక్షలు పడటం ఖాయం. ప్రతి కేసులో 40 మంది వరకు నిందితులు ఉన్నారు.

ఒక్కో కేసులో ఒక్కో నిందితునికి సంబంధించి దాదాపు 10 వేల పేజీలను ఫొటోస్టాట్‌ కాపీలు తీయాల్సి వచ్చింది. లక్షలాది పేజీలు కాపీలు తీసే క్రమంలో మెషిన్లు వేడెక్కడం కాగితాలు వాటిలో ఇరుక్కుపోవడం, ఇంకు తగ్గిపోవడం వంటి కారణాలతో చాలా కాపీలు ఫేడ్‌ అవుట్‌ అయ్యాయి. వీటిని పక్కనపెట్టేసి కొత్తగా మళ్లీ కాపీలు తీయాల్సి వచ్చింది. ఫేడ్‌ అవుట్‌ అయిన వాటిని చిత్తుగా పరిగణించి కాల్చివేశాం. ఇది అన్ని దర్యాప్తు సంస్థల్లో, సాధారణ ఆఫీసుల్లో కూడా పాటించే ప్రక్రియే’ అని సిట్‌ అధికారులు పేర్కొన్నారు. 

నిబంధనల ప్రకారమే హెరిటేజ్‌ ఐటీ రిటర్న్‌లు తీసుకున్నాం  
హెరిటేజ్‌ ఫుడ్స్‌ కంపెనీ, చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యుల ఆదాయ పన్ను రిటర్న్‌ కాపీలను అక్రమంగా తీసుకున్నారని, అందుకే వాటిని దహనం చేశారన్న ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని కూడా సిట్‌ తిప్పికొట్టింది. తాము నిబంధనల ప్రకారమే హెరిటేజ్‌ ఫుడ్స్, ఇతర నిందితుల ఆదాయ పన్ను రిటర్న్‌ కాపీలను తీసుకున్నామని తెలిపింది. ఆదాయ పన్ను శాఖకు అధికారికంగా లిఖిత పూర్వకంగా కోరి వారి నుంచి ఆ కాపీలను తీసుకున్నామని చెప్పింది. హెరిటేజ్‌ ఫుడ్స్‌ కంపెనీ నుంచి కూడా అధికారికంగానే లేఖ రాసి మరీ చాలా పత్రాలను తీసుకున్నామంది.

ఆ ఐటీ రిటర్న్‌లు, హెరిటేజ్‌ ఫుడ్స్‌ నుంచి తీసుకున్న పత్రాల ఆధారంగానే ఈ కేసులో లోకేశ్, ఇతర నిందితులను విచారించామని సిట్‌ తెలిపింది. ఆ దర్యాప్తు నివేదికను కూడా న్యాయస్థానానికి సమర్పించామని చెప్పింది. ఓ వర్గం మీడియా ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేయడాన్ని సిట్‌ తీవ్రంగా ఖండించింది. ఆ మీడియా చానళ్లు దుష్ప్రచారాన్ని మాని వాస్తవాలను తెలుసుకోవాలని హితవు చెప్పింది. 

‘హెరిటేజ్‌’కు దీటైన జవాబు ఇచ్చిన సిట్‌ 
చంద్రబాబుపై నమోదైన కేసులకు సంబంధించిన తమ కంపెనీ పత్రాల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ హెరిటేజ్‌ ఫుడ్స్‌ రాసిన లేఖకు సీఐడీ దీటైన సమాధానం ఇచ్చింది. హెరిటేజ్‌ ఫుడ్స్‌కు సంబంధించిన పత్రాలపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, అవన్నీ న్యాయస్థానానికి తాము ఎప్పుడో సమర్పించామని, అన్ని పత్రాలు భద్రంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఈమేరకు సిట్‌ అధికారులు హెరిటేజ్‌ ఫుడ్స్‌ కంపెనీ సెక్రటరీ ఉమాకాంత బారిక్‌కు సోమవారం ఓ లేఖ రాళారు.

తాము హెరిటేజ్‌ ఫుడ్స్‌కు అధికారికంగా లేఖ ద్వారా కోరి 2022 సెప్టెంబర్ 12 నుంచి 2023 అక్టోబరు 4 వరకు ఏడుసార్లు పొందిన ఆ కంపెనీ పత్రాల వివరాలను వెల్లడించారు. ఆ ఒరిజినల్‌ పత్రాలను న్యాయస్థానానికి సమర్పించిన వివరాలను సీఎఫ్‌ఆర్‌ నంబర్లతో సహా తెలిపారు. ఓ వర్గం మీడియా ఉద్దేశపూర్వకంగా చేసిన దుష్ప్రచారాన్ని ఖండిస్తూ తాము జారీ చేసిన ప్రెస్‌ నోట్‌ను కూడా ఈ లేఖకు జతపరిచారు. ఆ వర్గం మీడియా రాజకీయ దురుద్దేశాలతో సిట్‌పై చేస్తున్న దుష్ప్రచారంపై ఎన్నికల కమిషన్‌కు చేసిన ఫిర్యాదు కాపీని కూడా హెరిటేజ్‌ ఫుడ్స్‌కు అందించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement