దొడ్డిపట్ల గోదావరి రేవులో వరద ప్రాంతాన్ని పరిశీలిస్తున్న చంద్రబాబు
పాలకొల్లు సెంట్రల్ / యలమంచిలి: ‘మాకు ప్రభుత్వం పంపిణీ చేసిన రూ.2 వేలు నగదు అందింది. వరదల్లో చిక్కుకున్న మమ్మల్ని ప్రభుత్వం చాలా బాగా చూసుకుంది. ఈ రోజు వరకు అంటే శుక్రవారం వరకు పునరావాస కేంద్రాల్లో భోజనాలు పెడుతూనే ఉన్నారు..’ అంటూ వరద బాధితులు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో చెప్పారు. బాధితుల పరామర్శ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోని యలమంచిలి మండలం దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం, గంగడపాలెం, లక్ష్మీపాలెం గ్రామాలను సందర్శించారు. ముందుగా దొడ్డిపట్లలో నాలుగు బాధిత కుటుంబాలను సందర్శించగా వారిలో ఇద్దరు ప్రభుత్వం ఇప్పటివరకు బాగానే చూసుకుందన్నారు. ఏటిగట్టు ఎవరు పటిష్టం చేశారని అడుగగా, అధికారుల సహకారంతో తామంతా కృషి చేసి గట్టును పటిష్టం చేసుకున్నామని తెలిపారు.
ఆ తర్వాత అబ్బిరాజుపాలెం, గంగడపాలెం గ్రామాల్లో చంద్రబాబు ప్రసంగించారు. గంగడపాలెంలో టీడీపీ అభ్యర్థిని మంచి మెజార్టీతో గెలిపించారు. చాలా ఆనందంగా ఉందని చెప్పగా, గంగడపాలెం గ్రామస్తుల్లో కొందరు చంద్రబాబు మా కష్టాలు తెలుసుకోవడానికి వచ్చారా లేక పార్టీ నాయకులను పొగడడానికి వచ్చారా అంటూ స్థానిక టీడీపీ నాయకులను నిలదీశారు. అక్కడి నుంచి లక్ష్మీపాలెం గ్రామానికి వెళ్లిన చంద్రబాబును అక్కడి మత్స్యకార ప్రాంతానికి రావాలని పలువురు గొడవ చేయడంతో వెళ్లారు. అక్కడ మహిళలను చంద్రబాబు వివరాలు అడగ్గా ప్రభుత్వం తమకు రూ.2 వేలు ఇచ్చిందని, ఇప్పటివరకు తమను బాగానే చూసుకుందని చెప్పారు. వరద బాధితులు ఉన్నది ఉన్నట్టు చెపుతుండగా, ఏంచేయాలో పాలుపోని స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు.. అదే నేను పోరాటం చేసిన తరువాత ఇవన్నీ వచ్చాయని చెప్పడం గమనార్హం. ఈ పర్యటనలో టీడీపీకి అనుకూలంగా మాట్లాడినచోట కాస్త ఎక్కువసేపు ఉన్న చంద్రబాబు... ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడినచోట వారి మాటలు వినకుండా వెళ్ళిపోయారు. పైపెచ్చు వరద బాధితులను పరామర్శించడానికి బాబు రాగా... స్థానిక నాయకులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించడం గమనార్హం.
బాధితులను ఆదుకోకుండాగాల్లో తిరుగుతారా...
పరామర్శ యాత్రలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న బాధితులను ఆదుకోకుండా గాల్లో తిరిగి వెళ్లిపోతారా? నాడు తండ్రి చనిపోతే సుమారు ఐదేళ్ల పాటు ఓట్ల కోసం ఓదార్పు యాత్ర పేరుతో తిరిగిన జగన్‌మోహన్‌రెడ్డికి... నేడు గడప గడపకూ తిరుగుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు వరద బాధితుల ప్రాంతాల్లో తిరగాలని గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. వరదల్లో నష్టపోయిన బాధితులకు రూ.10 వేలు తక్షణ సాయం అందించాలని, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50 వేలు, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.4 లక్షలు, అరటి తోటకు ఎకరానికి రూ.40 వేలు, తమలపాకుల తోటకు రూ.50 వేలు, వరికి హెక్టారుకు రూ.20 వేలు, ఆక్వా రైతులకు కరెంటు బిల్లు యూనిట్‌కు రూ.1.50 చేస్తూ హెక్టారుకు రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, ఆవు, గేదెలకు రూ.40 వేలు, పశువుల షెడ్డుకు లక్ష నుంచి రూ.1.80 లక్షల వరకు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోందని చెప్పారు. తమ డిమాండ్లను వెంటనే అమలు చేయకపోతే పోరాటం చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment