జీతం బకాయిలు చెల్లిస్తాం.. కుమారుడికి ఉద్యోగం ఇస్తాం
బ్యాంకు అధికారులు హామీ
టీడీపీ, బ్యాంకు సిబ్బంది వేధింపులతో సొసైటీ గుమస్తా శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య
వైఎస్సార్‌సీపీ ఆందోళనతో బాధిత కుటుంబానికి న్యాయం
నరసరావుపేట: టీడీపీ నేతలు, బ్యాంకు సిబ్బంది వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న పల్నాడు జిల్లా అన్నవరం పీఏసీఎస్ ఉద్యోగి ఓరుగుంటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి న్యాయం చేస్తామని జీడీసీసీ బ్యాంకు అధికారులు హామీ ఇచ్చారు. రెండు, మూడు రోజుల్లో జీతం బకాయిలు చెల్లించడంతో పాటు అతని కుమారుడు లక్ష్మీప్రసన్నకుమార్‌రెడ్డికి తండ్రి ఉద్యోగం ఇస్తామన్నారు. అది కూడా పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. వివరాలు.. పల్నాడు జిల్లా అన్నవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో ఓరుగంటి శ్రీనివాసరెడ్డి గుమాస్తాగా పనిచేస్తున్నాడు.
టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ఉద్యోగం మానుకోవాలంటూ అతనిని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. టీడీపీ నేత, అన్నవరం సొసైటీ సీఈవో దొప్పలపూడి శ్రీనివాసరావు బ్యాంకు స్పెషల్ ఆఫీసర్ సురేంద్రబాబుతో కలిసి మూడు నెలలుగా జీతం కూడా నిలిపివేయించాడు. వారిద్దరి వేధింపులు తట్టుకోలేక శ్రీనివాసరెడ్డి శుక్రవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. ఈ నేపథ్యంలో శ్రీనివాసరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. వైఎస్సార్‌సీపీ నేత, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
నిందితులపై వెంటనే కేసు నమోదు చేసి కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. దీంతో శాంతి భద్రతల అదనపు ఎస్పీ సీహెచ్.లక్ష్మీపతి బ్యాంకు అధికారులతో మాట్లాడారు. చీఫ్ మేనేజర్ రమాదేవి ప్రభుత్వాస్పత్రికి వచ్చి శ్రీనివాసరెడ్డి భార్య రామసీతమ్మ, కుమారుడు లక్ష్మీప్రసన్నకుమార్‌రెడ్డి, కుమార్తె దేవికకు హామీలు ఇవ్వటంతో ఆందోళన విరమించారు. వెంటనే హామీల అమలుకు చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి బ్యాంకు అధికారులకు సూచించారు.
కాగా, తన చావుకు టీడీపీ నేత దొప్పలపూడి శ్రీనివాసరావు, స్పెషల్ ఆఫీసర్ సురేంద్రబాబు కారణమంటూ శ్రీనివాసరెడ్డి రాసిన సూసైడ్ నోట్‌ను కుమారుడు లక్ష్మీప్రసన్నరెడ్డి మీడియాకు చూపించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment