కులాలు చూడం.. మతాలు చూడం.. ప్రాంతాలు చూడం.. వర్గాలు చూడం.. చివరకు రాజకీయాలు చూడం.. పార్టీలు కూడా చూడకుండా ప్రతి ఒక్కరికీ మంచి చేసే ప్రభుత్వం మనది అని చెప్పడానికి గర్వపడుతున్నా.. ఇవి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి బహిరంగ సభలోనూ చెప్పే మాటలు.. అవును.. ఈ మాటలు అక్షర సత్యాలని నిరూపిస్తున్నాయి రాష్ట్రంలోని పరిస్థితులు.. ఒక్క వైఎస్సార్ జిల్లానే తీసుకుంటే ఇక్కడి ప్రతి నియోజకవర్గంలోనూ తెలుగుదేశం పార్టీ నాయకుల కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేకూరింది. అమ్మఒడి మొదలుకుని రైతు భరోసా వరకు.. అనేక సంక్షేమ ఫలాలను వారు అనుభవిస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఈ వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, కడప: ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన రోజున వర్గాలను చూడం, పార్టీలను చూడం, రాజకీయాలకతీతంగా ప్రభుత్వ ఫలాలు అందిస్తామని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆ మేరకు అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వ పథకాలు అర్హుల ఇంటికి చేరుతున్నాయి. తర, తమ, భేదం లేకుండా ఆయా పథకాలకు అర్హులైతే గ్రామసచివాలయ వ్యవస్థ ద్వారా లబ్ధి చేకూరుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జన్మభూమి కమిటీ సభ్యుల సిఫార్సు ఉన్నోళ్లకే ప్రభుత్వ పథకాలు అందేవి. నాటి పరిస్థితులను ప్రస్తుతం పూర్తిగా తిరగరాశారు. అందుకు తార్కారణమే టీడీపీ నేతల కుటుంబానికి చేకూరిన లబ్ధి. జిల్లా వ్యాప్తంగా టీడీపీ క్రియాశీలక నేతలందరికీ వైఎస్ జగన్ సర్కార్ సంక్షేమ ఫలాలు దక్కాయి. సామాన్య కార్యకర్త నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న నేతల వరకూ అర్హుల జాబితాలో ఉండడం విశేషం.
జిల్లా వ్యాప్తంగా రూ.5,997.74 కోట్లు లబ్ధి
గడిచిన మూడేళ్లలో ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు వివిధ పథకాల ద్వారా రూ.5,997.74 కోట్లు నేరుగా లబ్ధి చేకూర్చింది. అందులో వైఎస్సార్ పెన్షన్ కానుక ద్వారా వివిధ ఫించన్లు 2,49,868 మంది లబ్ధిదారులకు రూ.2,287.58 కోట్లు దక్కింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా 2,22,041 మందికి వివిధ చికిత్సల నిమిత్తం రూ.478.17 కోట్లు వెచ్చించారు. అలాగే వైఎస్సార్ రైతు భరోసా ద్వారా నాలుగు విడతలుగా జిల్లాలోని రైతుల ఖాతాలకు రూ.1,022.06 కోట్లు జమ చేశారు. వైఎస్సార్ చేయూత ద్వారా అక్కచెల్లెమ్మలకు రూరల్‌లో రూ.467.85 కోట్లు, అర్బన్‌లో రూ.149.59 కోట్లు దక్కింది. జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా రూ.244.06 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాలకు చేరింది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్ అర్హతే ఏకైక ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అందిస్తోంది.
టీడీపీ కౌన్సిలర్ కుటుంబానికి...
సోమేశుల సుధామణి బద్వేల్ మున్సిపాలిటీలో 6వవార్డు టీడీపీ కౌన్సిలర్. తెలుగుదేశం పార్టీకి చెందిన ఆమె కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో మూడేళ్లలో రూ.11,60,440 నగదు వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరింది. ఉమ్మడి కుటుంబం కావడంతో తోడికోడలు సోమేశుల సుభాషిణికి రూ.9,04,924, స్వతహాగా కౌన్సిలర్ సుధామణికి రూ.78,994, కోడలు సోమేశుల సావిత్రికి రూ.1,50,598, మరో తోడికోడలు సోమేశుల సుబ్బరత్నమ్మకు రూ.25,924 లబ్ధి చేకూరింది. కౌన్సిలర్ కుటుంబానికి లభించిన సంక్షేమ పథకాల వివరాలను తాజాగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.సుధా కుటుంబ సభ్యులకు అందించారు.
తెలుగు యువత మాజీ మండల అధ్యక్షుడి కుటుంబానికి రూ.3.56 లక్షల లబ్ధి
చాపాడు మండలంలోని సీతారామాపురం గ్రామానికి చెందిన టీడీపీ తెలుగు యువత మాజీ మండల అధ్యక్షుడు మార్తల నరసింహారెడ్డి కుటుంబానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో మూడేళ్ల కాలంలో రూ.3,56,476లు లబ్ధి చేకూరింది. నరసింహారెడ్డికి క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా రూ.1,68,910, ఇన్‌పుట్ సబ్సిడీ రూ.27వేలు, ఆయన సతీమణి రమాదేవికి క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా రూ.97,210లు, ఇన్‌పుట్ సబ్సిడీ రూ.17,280లు, కుమారుడు తరణి కృష్ణన్‌కు క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా రూ.30,707లు, ఇన్‌పుట్ సబ్సిడీ ద్వారా రూ.15,360లు వర్తించింది.
టీడీపీ ఇన్‌చార్జి కుటుంబానికి మేలు
ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని మంజూరు చేసింది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆయన కుటుంబం వరుసగా రైతు భరోసా ద్వారా లబ్ధి పొందుతోంది. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తండ్రి గండ్లూరి ప్రతాప్‌రెడ్డికి కమలాపురం మండలం కోగటం గ్రామ పరిధిలో పంట పొలాలు ఉన్నాయి. టీడీపీ ఇన్‌చార్జి జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి సతీమణి మౌనికా రెడ్డి, సోదరులు వీరప్రదీప్‌కుమార్‌రెడ్డి, వీరారెడ్డి, తండ్రి గండ్లూరి ప్రతాప్‌రెడ్డి, తల్లి పద్మావతమ్మలకు 2021లో కమలాపురం మండలంలో సబ్సిడీ శనగలు మంజూరయ్యాయి.
టీడీపీ సర్పంచ్‌కు అక్షరాలారూ.2,13,256 లు లబ్ధి
రాజుపాళెం మండలం అర్కటవేముల గ్రామ పంచాయతీ టీడీపీ సర్పంచ్ ఎత్తపు ప్రభావతి కుటుంబానికి గత మూడేళ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.2,13,256 లబ్ధి చేకూరింది. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పర్యటించినప్పుడు సర్పంచ్ కుటుంబానికి చేకూరిన లబ్ధిని వివరించారు.
సర్పంచ్ కుటుంబానికి చేకూరిన లబ్ధి
ఇన్‌పుట్ సబ్సిడీ – రూ.46,215
వైఎస్సార్ పెన్షన్ కానుక – రూ.65,000
వైఎస్సార్ సున్నా వడ్డీ – రూ.3,210
వైఎస్సార్ ఆసారా – రూ.23,442
వైఎస్సార్ సున్నా వడ్డీ – రూ.7,913
వైఎస్సార్ రైతు భరోసా – రూ.67,500
Comments
Please login to add a commentAdd a comment