సాక్షి, కర్నూలు: గోనెగండ్ల మండలం అల్వాల గ్రామానికి చెందిన దాడిబండ ఆమోస్ (26) దారుణ హత్య కేసు మిస్టరీ వీడింది. ఆమోస్ భార్య అరుణ ప్రోద్బలంతో ఆటోడ్రైవర్ ములకల సూర్యప్రదీప్, అతని స్నేహితుడు నేసే జీవన్‌కుమార్‌తో కలసి హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేల్చారు. నిందితులను పక్కా ఆధారాలతో నాల్గవ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ శంకరయ్యతో కలసి బుధవారం సాయంత్రం డీఎస్పీ కేవీ మహేష్ తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు.
డిగ్రీ వరకు చదువుకున్న ఆమోస్ అదే గ్రామానికి చెందిన కుమ్మరి గోపాల్ కుమార్తె అరుణను 2016లో కులాంతర వివాహం చేసుకున్నాడు. అయితే అరుణ మైనర్ అయినందున ఆమెను హోమ్‌లో ఉంచి ఆమోస్‌పైన నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. అరుణ మేజర్ అయిన తర్వాత తిరిగి ఇద్దరూ కలుసుకుని మరోసారి వివాహం చేసుకున్నారు. వీరికి నాలుగు సంవత్సరాల వయస్సు గల కుమారుడు ఉన్నాడు.
చదవండి: (రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దార్ మృతి)
అల్వాల గ్రామంలో ఉన్నప్పుడు మద్యం సేవించి భార్యను అమోస్ శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టేవాడు. ఈ విషయంలో భార్యాభర్తలు గొడవ పడి అల్వాల గ్రామం వదిలి ఏడాది క్రితం కర్నూలుకు వచ్చారు. ఉద్యోగనగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటూ సిటీ స్క్వేర్ మాల్‌లోని బజాజ్ ఎలక్ట్రిక్ షోరూమ్‌లో ఆమోస్ సెక్యూరిటీ గార్డుగా, అదే షోరూమ్‌లో జాకీ దుస్తుల దుకాణంలో అరుణ సేల్స్ గర్ల్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవారు. వీరిద్దరూ సూర్యప్రదీప్ అనే వ్యక్తి ఆటోలో వెళ్లి వస్తుండేవారు. ఆటోడ్రైవర్ సూర్యప్రదీప్‌తో కలసి ఆమోస్ తరచూ మద్యం సేవించేవాడు. ఈ క్రమంలో ఆటోడ్రైవర్‌తో అరుణకు చనువు ఏర్పడి తన బాధలు చెప్పుకుంది.
హత్య కేసులో నిందితుల అరెస్ట్ చూపి వివరాలు వెల్లడిస్తున్న కర్నూలు డీఎస్పీ కేవీ మహేష్
భర్త తనను శారరీకంగా, మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడని, అతనిని అడ్డు తొలగిస్తే పెళ్లి చేసుకుంటానని సూర్యప్రదీప్‌తో చెప్పుకుంది. దీంతో సూర్యప్రదీప్ పథకం ప్రకారం తన స్నేహితుడైన జీవన్ సహాయంతో ఈనెల 22వ తేదీ రాత్రి శరీన్‌నగర్‌లోని సవారితోట కాలనీ చివర గల హంద్రీ నది ఒడ్డుకు ఆమోస్‌ను తీసుకువెళ్లాడు. మద్యం సేవించిన తర్వాత వెంట తీసుకువెళ్లిన రాడ్డుతో తలపై బాది హత్య చేసి ఆ తర్వాత పెట్రోల్ పోసి కాల్చినట్లు విచారణలో నిందితులు అంగీకరించినట్లు డీఎస్పీ వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రాడ్డు, బండరాయి, సెల్‌ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment