భర్త ఇంటి ముందు బైఠాయించిన సునీత
నరసన్నపేట : న్యాయం కోసం ఓ మహిళ రోడ్డెక్కింది. భర్తతోనే ఉంటానని.. ఆయనే నా జీవితమంటూ మౌనపోరాటానికి దిగింది. ఈ సంఘటన నరసన్నపేటలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకొని న్యాయం చేయడానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో దీక్షను విరమించింది. దీనికి సంబంధించి బాధితురాలు సునీత తెలిపిన వివరాల్లోకి వెళితే.. విజయనగరం పట్టణంలోని బోయి వీధికి చెందిన సునీతకు నరసన్నపేటకు చెందిన ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకుడు బోయిన రఘురాంతో 2006లో వివాహమైంది.
వీరి సంసార జీవితం కొన్నేళ్ల పాటు బాగానే సాగింది. అయితే పిల్లలు పుట్టడం లేదనే కారణంతో 2019లో మాయమాటలు చెప్పి భర్త రఘురాం విజయనగరంలోని ఆమె కన్నవారింటికి పంపించేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ తీసుకురాలేదని బాధితురాలు వాపోయింది. పలుమార్లు నరసన్నపేట లక్ష్మన్నపేటలోని అత్తవారింటికి రాగా.. తాళాలు వేసి వెళ్లిపోతున్నారని పేర్కొంది. ఈ క్రమంలోనే శనివారం కూడా ఇక్కడికి రాగా అత్తింటివారు ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయారని తెలిపింది. దీంతో న్యాయం చేయాలంటూ అక్కడే బైటాయించి నిరసన తెలిపింది.
ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. వివాహమైన తరువాత తమ కాపురం బాగానే సాగిందని.. అయితే పిల్లలు కలగకపోవడంతో అత్తింటివారు వేధించి కన్నవారి ఊరైన విజయనగరం పంపించేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారని.. వారు బతకడమే కష్టంగా ఉందని.. అలాంటి వారికి భారంగా తయ్యారయ్యానని కన్నీటి పర్యంతమైంది. భర్తతోనే ఉంటానని న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.
అత్తవారింటికి తీసుకెళ్లకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్ర యించినట్లు సునీత వివరించింది. సునీత మౌనపోరాటానికి దిగిన విషయం నరసన్నపేట పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో వారు దీక్షా ప్రాంతానికి వెళ్లి బాధితురాలితో మాట్లాడారు. కేసు కోర్టులో నడుస్తున్నందున ఇలా దీక్షలకు దిగడం మంచిదికాదని నచ్చచెప్పారు. త్వరలోనే కౌన్సెలింగ్ నిర్వహించి న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇవ్వడంతో సునీత దీక్షను విరమించింది.
Comments
Please login to add a commentAdd a comment