సాక్షి, అమరావతి : ఎన్టీఆర్ హయాంలోలాగ తాను తలచుకుంటే ఎవరినైనా సీఎం కుర్చీలో కూర్చోబెట్టగలనన్న అతివిశ్వాసం రామోజీరావులో ఇంకా చావలేదు. తన వికృత రాతలతో రాష్ట్ర ప్రభుత్వానికి మద్యంపై పైసా ఆదాయం రాకుండా చేయాలని.. అలా ప్రభుత్వ ఆదాయ మార్గాలకు గండికొడితే రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవచ్చని.. తద్వారా వాటిని అమలుచేయలేని పరిస్థితిల్లోకి నెడితే వైఎస్ జగన్ సర్కార్ ప్రజావిశ్వాసం కోల్పోతుందనేది రామోజీ దింపుడు కళ్లెం ఆశ.
కానీ, ఇప్పుడున్నవి ఎన్టీఆర్ హయాం నాటి రోజులు కాదని ఆయన గుర్తించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన మనసంతా బాబును అర్జెంటుగా సీఎం కుర్చీపై కూర్చోపెట్టడంపైనే కేంద్రీకృతమై ఉంది. ఇందుకోసం ఆయన పడుతున్న ప్రయాస అంతాఇంతా కాదు. ఇందులో భాగమే ఆయన విషపుత్రిక ఈనాడులో అచ్చోసి ప్రజలకు ఏమాత్రం కిక్కివ్వని తాజా కథనం ‘ఆ కిక్కు ఎవరికో.. అస్మదీయుల బ్రాండ్ల ధరలు తగ్గింపు’.. బాగోతం. రాష్ట్రంలో మద్యం ధరలపై పన్నుల విధానాన్ని ప్రభుత్వం ఇటీవల హేతుబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
దీనికి మసిపూసి మారేడుకాయ చేసే క్రమంలో ‘పచ్చ’కిక్కు ఎక్కించుకుని ఉన్నవి లేనివి ఊహించుకుని పచ్చమీడియా చేతికొచ్చింది పిచ్చిరాతలు రాసిపారేసింది. అబద్ధాలను రంగరించి చంద్రబాబుకు ప్రీతిగా వండామని సంబరపడ్డాయి. కానీ, ఈ వంటకం వండే క్రమంలో పప్పులో కాలేశారు. అదేమిటంటే.. రాష్ట్ర మార్కెట్‌లో లేని మద్యం బ్రాండ్లు, దాదాపు బ్యాలెన్స్ స్టాక్‌లేని బ్రాండ్ల పేర్లను పేర్కొంటూ కథనాన్ని నమ్మించేందుకు ప్రయత్నించి ఎల్లో ముఠా అభాసుపాలైంది. ‘పచ్చ’ పైత్యంలోని అసలు వాస్తవాలు ఏమిటంటే..
♦ మద్యం ఉత్పత్తులపై పన్నుల విధానాన్ని హేతుబద్ధీకరిస్తూ ప్రభుత్వం చాలా స్వల్పంగా ఏఆర్‌ఈటీ, ఏఈడీ, వ్యాట్ పన్నులతోపాటు స్పెషల్ మార్జిన్‌ను సవరించింది. అన్ని బ్రాండ్ల మద్యం ఉత్పత్తుల బేసిక్ ధరపై పన్నుల శాతాన్ని నిర్ణయిస్తూ పన్నుల విధానంలో ఏకరూపత తీసుకొచ్చింది. దాంతో అతికొద్ది బ్రాండ్ల ధరలే స్వల్పంగా పెరిగాయి. అత్యధిక బ్రాండ్ల ధరలు యధాతథంగానే ఉన్నాయి. మొత్తం మీద ఆదాయం కొద్దీగా పెరిగినట్లు కనిపిస్తున్నా అత్యధిక బ్రాండ్ల మద్యం ధరల్లో మాత్రం ఏమాత్రం మార్పులేదు.
♦ ఇక అస్మదీయుల బ్రాండ్ల ధరలు పెరగలేదంటూ పచ్చ పత్రికలు ప్రచురించిన మద్యం బ్రాండ్లు అసలు మార్కెట్‌లో లేనేలేవు. సంబంధిత కంపెనీలు ఆ మద్యం బ్రాండ్లను రెన్యూవల్ చేసుకోలేదు. ఆ కంపెనీల మద్యం నిల్వలు దాదాపు ముగింపునకు చేరుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో హోల్‌సేల్, రిటెయిల్ మద్యం దుకాణాల్లో ఆ మద్యం బ్రాండ్ల నిల్వలు కూడా దాదాపులేవు. అంటే ఆ బ్రాండ్లు, వాటి ధరలు కేవలం కాగితాలపైనే కనిపిస్తున్నాయి తప్ప మార్కెట్‌లో అందుబాటులో లేవన్నది వాస్తవం. కానీ, ఆ బ్రాండ్ల ధరలు పెరగనే లేదంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పచ్చ పత్రికలు యత్నించాయి.
♦ రాష్ట్రంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మద్యం బ్రాండ్ల గురించి పచ్చ పత్రికలు కనీసం పేర్కొనలేదు. ఎందుకంటే ఆ బ్రాండ్ల మద్యం ధరలు ఏమాత్రం పెరగలేదు కనుక. ఆ విషయాన్ని ప్రజలకు తెలియకుండా ఉండేందుకే ఆ బ్రాండ్ల పేర్లను పచ్చ పత్రికలు ఉద్దేశపూర్వకంగా విస్మరించాయి.
♦ ఎంఎస్ బయోటెక్, ఈగిల్ డిస్టిలరీస్, ఎస్‌పీవై ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్, ఎస్‌ఎన్‌జీ సుగర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్పిత్తి చేసే మద్యం బ్రాండ్లకు సంబంధించి మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వాటి ధరలు పెరగలేదు. ప్రస్తుతం రాష్ట్ర మార్కెట్‌లో అందుబాటులోలేని ఆ కంపెనీల బ్రాండ్ల ధరలే స్వల్పంగా పెరిగాయి తప్పా మార్కెట్‌లో ఉన్న బ్రాండ్ల ధరలు పెరగలేదు. ఉదా.. కింగ్‌ఫిషర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, ఎస్‌ఎన్‌జే 10000 సూపర్ స్ట్రాంగ్ బీర్ ధరల గురించి పచ్చ పత్రికలు ప్రధానంగా రాశాయి. కానీ, ఆ బ్రాండ్లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మార్కెట్‌లో దాదాపు అందుబాటులో లేనేలేవు. గతంలో తెచ్చిన స్టాక్ దాదాపు పూర్తయ్యింది.
♦ పన్నులను హేతుబద్ధీకరించడంతో అతికొద్ది కంపెనీల లీటర్ సైజు లిక్కర్ బాటిళ్ల ధరలు మాత్రమే స్వల్పంగా తగ్గాయి. రాష్ట్రంలో ఒక లీటర్ అంతకంటే పెద్ద పరిమాణంలో మద్యం బాటిళ్ల ఉత్పత్తి, అమ్మకాలు కేవలం నామమాత్రమే.
♦ ఇక మద్యం కంపెనీల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం దాదాపు చెల్లించేసింది. ఇటీవల రూ.175 కోట్లు చెల్లించడంతో బకాయిలన్నీ తీరిపోయాయి.
♦ కొన్ని కంపెనీలకు మద్యం ఉత్పత్తులపై కేసుకు రూ.250 చెల్లించమన్నారని పచ్చ పత్రికలు పేర్కొన్న విషయం పూర్తిగా అవాస్తవం. పూర్తి పారదర్శక విధానంలో ప్రభుత్వం మద్యం కంపెనీల నుంచి మద్యం కొనుగోలు చేస్తోంది. రాష్ట్రంలో దశలవారీగా మద్య నియంత్రణ విధానాన్ని కచ్చితంగా పాటిస్తూ ప్రభుత్వం మద్యం కొనుగోలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment