కరువు సీమలో ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయం.. విశ్వఖ్యాతి పొందాలని.. వేలాది మంది విద్యార్థులు విద్యనభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తొలి పలుకులు నిజం చేస్తూ విశ్వవిద్యాలయ పాలకులు శ్రమించి ‘ఏ’ గ్రేడ్ సాధించారు. నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్(న్యాక్) కమిటీ బుధవారం విశ్వవిద్యాలయానికి 3.13 సీజీపీఎస్‌తో ‘ఏ’ గ్రేడ్‌ను ప్రకటించింది. న్యాక్ నూతన విధానంలో న్యాక్‌కు వెళ్లిన తొలి విశ్వవిద్యాలయం.. ఏ గ్రేడ్ సాధించిన విశ్వవిద్యాలయం యోగివేమన కావడం విశేషం.
వైవీయూ : కడపలో 2006లో ఏర్పాటైన యోగివేమన విశ్వవిద్యాలయం ఇంతింతై వటుడింతై అన్న చందంగా ‘విశ్వ’ఖ్యాతిని పొందుతోంది. నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (న్యాక్) వారు బుధవారం విశ్వవిద్యాలయానికి 3.13 సీజీపీఎస్‌తో ‘ఏ’ గ్రేడ్ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈనెల 2 నుంచి 4వ తేదీ వరకు న్యాక్ పీర్ టీం చైర్మన్ ఆచార్య ధర్మజిత్ సింఘ్ పర్మార్ నేతృత్వంలో ఆచార్య ఆర్. సోమశేఖర్, ఆచార్య ఖలీద్ ఫాజిల్, ఆచార్య జయతీరాజ్, ఆచార్య సి. మధుమతిల బృందం విశ్వవిద్యాలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక సిద్ధం చేసి న్యాక్‌కు పంపారు. విశ్వవిద్యాలయం అధికారులు పంపిన సెల్ఫ్ స్టడీ రిపోర్ట్, న్యాక్ టీం ప్రత్యక్ష పరిశీలన అనంతరం ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా న్యాక్ వారు విశ్వవిద్యాలయానికి ఏ గ్రేడ్‌ను కేటాయించారు.
నూతన విశ్వవిద్యాలయాల్లో తొలి ‘ఏ’ గ్రేడ్ విశ్వవిద్యాలయంగా వైవీయూ..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాటైన 10 విశ్వవిద్యాలయాల్లో ‘ఏ’ గ్రేడ్ సాధించిన తొలి విశ్వవిద్యాలయంగా వైవీయూ నిలిచింది. న్యాక్ గ్రేడింగ్‌లో నూతన విధానాన్ని తీసుకువచ్చిన తర్వాత న్యాక్‌కు వెళ్లి ఏ గ్రేడ్ సాధించిన తొలి విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌లో వైవీయూ నిలవడం విశేషం.
2020 జనవరి 10వ తేదీన వైస్ చాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టిన సమయంలో విశ్వవిద్యాలయానికి ‘ఏ’ గ్రేడ్ తీసుకురావడమే తన ముందున్న లక్ష్యం అని ప్రకటించిన ఆచార్య మునగల సూర్యకళావతి శ్రమించి సాధించారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి న్యాక్ సాధన కోసం ఐక్యూసెల్‌ను (అంతర్గత నాణ్యతా ప్రమాణాల విభాగం) సమాయత్తం చేశారు. ఐక్యూసెల్ ఆధ్వర్యంలో దాదాపు రెండు సంవత్సరాల పాటు శ్రమించి విశ్వవిద్యాలయానికి ఉత్తమ గ్రేడింగ్ తీసుకురావడంలో కృషిచేశారు. 2016 జనవరి వైవీయూకు న్యాక్ 2.54 సీజీపీఎస్‌తో బి ప్లస్ గ్రేడ్ కేటాయించింది. అప్పటి న్యాక్ కమిటీ సూచించిన లోపాలను సవరించుకుంటూ, అధునాతన సౌకర్యాలను కల్పిస్తూ, గూగుల్ క్యాంపస్‌గా తీర్చిదిద్దడంతో పాటు సాంకేతికత, హరిత విద్యాలయంగా తీర్చిదిద్దడంలో సఫలమయ్యారు.
హర్షం వ్యక్తం చేసిన అధికారులు
విశ్వవిద్యాలయానికి న్యాక్ ‘ఏ’ గ్రేడ్ లభించడం పట్ల విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ఆచార్య మునగల సూర్యకళావతితో పాటు వైవీయూ పూర్వపు వైస్ చాన్సలర్‌లు ఆచార్య అర్జుల రామచంద్రారెడ్డి, ఆచార్య బేతనభట్ల శ్యాంసుందర్, ఆచార్య అత్తిపల్లి రామచంద్రారెడ్డి తదితరులు కూడా హర్షం వ్యక్తం చేశారు.
న్యాక్ రావడంలో కీలకపాత్ర..
652 ఎకరాల్లో ఏర్పాటైన విశ్వవిద్యాలయం దాదాపు పచ్చదనంతో ఉండటం.
మల్టీ డిసిప్లినరీ లెర్నింగ్ ఎన్విరాన్‌మెంట్
కేంద్ర పరిశోధన సంస్థలైన డీఎస్‌టీ–ఫిస్ట్, యూజీసీ, సీఎస్‌ఐఆర్, డీబీటీ తదితర సంస్థల నుంచి 10.26 కోట్ల మేర పరిశోధక ప్రాజెక్టులు.
99 శాతం మంది అధ్యాపకులు డాక్టరేట్ కలిగి ఉండటంతో పాటు బోధన, పరిశోధనలో అనుభవం కలిగిన అధ్యాపకులు ఉండటం.
విశ్వవిద్యాలయంలో బాలికల నిష్పత్తి (54.92) బాలుర కంటే ఎక్కువగా ఉండటం.
సిలబస్ రూపకల్పనలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవడం, – పరిశ్రమలకు అనుబంధంగా సిలబస్ రూపకల్పన.
ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్‌లో 101 నుంచి 150 లోపు ఉండటం.
అధ్యాపకులు అందరూ ఆధునిక బోధనా పద్ధతుల్లో బోధించడం. ఐసీటీ, ఈ–లెర్నింగ్, ఎల్‌ఎంఎస్, గూగుల్‌క్లాస్ రూం, సిస్కో, వెబెక్స్, మైక్రోసాఫ్ట్ టిమ్స్ ఉపయోగించడం.
పరిశోధనల్లో ‘హెచ్’ ఇండెక్స్ 40 ఉండటం.
అధ్యాపకులు, పరిశోధకుల జర్నల్స్, పరిశోధనలు 20 శాతం మేరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచురితం కావడం.
విశ్వవిద్యాలయం 6 జాతీయ, అంతర్జాతీయ పేటెంట్స్ కలిగి ఉండటం.
950 కె.డబ్లు్య సోలార్‌ప్లాంట్ కలిగి ఉండటం.
ఆంధ్రప్రదేశ్‌లోనే అతిపెద్ద బొటానికల్ గార్డెన్ ఉండటంతో పాటు, ప్రపంచంలోనే అతిపెద్ద పత్రాలు కలిగిన జెయింట్ వాటర్ లిల్లీ (విక్టోరియా అమేజోనికా) ఉండటం, మియావాకి విధానంలో మినీ ఫారెస్టు ఏర్పాటు చేయడం తదితర అంశాలను విశ్వవిద్యాలయ బలాలుగా న్యాక్ కమిటీ అభిప్రాయపడింది. వీటితో పాటు అధ్యాపకులు, సిబ్బంది కొరత తదితర కొన్ని అంశాలను సరిచేసుకునేలా సూచనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment