గొల్లపల్లి సచివాలయం వద్ద న్యాయం చేయాలని ఏడు నెలల పసిబిడ్డతో బైఠాయించిన వెంకటేశ్వరమ్మ
సాక్షి, గొల్లపల్లి(నూజివీడు) కృష్ణా: పెళ్లిచేసుకుంటానని నమ్మించిన ఓ యువకుడు తనను గర్భవతిని చేసి, ఆ తర్వాత మోసం చేశాడని.. తనకు న్యాయం చేయాలంటూ ఓ యువతి తన ఏడునెలల కుమారుడితో మండలంలోని గొల్లపల్లి సచివాలయం వద్ద సోమవారం బైఠాయించింది. పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా.. తనకేమీ న్యాయం చేయట్లేదని వాపోయింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని తూర్పు దిగవల్లికి చెందిన మిసమెట్ల వెంకటేశ్వరమ్మ(19)కు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. దీంతో గ్రామంలోని ఆమె బంధువుల వద్ద ఉండి మూడేళ్ల క్రితం గొల్లపల్లిలోని ఆమె పెద్దమ్మ సాయల రాములమ్మ వద్దకు వచ్చి ఉంటోంది.
కూలిపనులకు వెళ్తున్న సమయంలో గొల్లపల్లికి చెందిన తటకలూరి విష్ణుబాబు(20) అనే యువకుడు ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని ఆమె వెంట పడేవాడు. రోజూ వెంట పడటంతో వెంకటేశ్వరమ్మ సైతం అతనితో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఇరువురూ ఒక్కటయ్యారు. దీంతో వెంకటేశ్వరమ్మ గర్భవతి అయ్యింది. ఈ నేపథ్యంలో గతేడాది సర్పంచి ఎన్నికలకు ముందు స్థానిక రూరల్ పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు సైతం చేసింది.
చదవండి: (ఒకరు బీటెక్.. మరొకరు బీఎస్సీ.. ఏ కష్టమొచ్చిందో.!)
అయితే ఈ పంచాయతీ గ్రామంలోని పెద్దల వద్దకు వెళ్లగా, వారి ముందు పెళ్లి చేసుకుంటామని ఒప్పుకొని ఆ తరువాత యువకుడితో పాటు వారి తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో పెద్దలు కూడా చేతులెత్తేశారు. ఆ తర్వాత యువతి మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఎన్నిసార్లు తిరిగినా గ్రామంలో పెద్దలు గాని, పోలీసులు గాని పట్టించుకోకపోవడంతో చివరకు ఏమి చేయాలో తెలియక సచివాలయం వద్ద బైఠాయించింది. ఆమెకు మద్దతుగా సోషల్ వర్కర్ పంతం మార్తమ్మ, బీఎస్పీ నియోజకవర్గ ఉపాధ్యక్షురాలు రంగు ధనలక్ష్మిలు, గ్రామంలోని పలువురు మహిళలు నిలిచారు.
చదవండి: (తల్లి మందలించిందని పారిపోయిన యువతి.. చివరికి ఏమైందంటే..)
Comments
Please login to add a commentAdd a comment