YS Avinash Reddy On CBI Investigation In YS Viveka Case - Sakshi
Sakshi News home page

సీబీఐ దర్యాప్తుపై సందేహాలు: ఎంపీ అవినాశ్‌రెడ్డి 

Published Sat, Feb 25 2023 3:33 AM | Last Updated on Sat, Feb 25 2023 9:00 AM

YS Avinash Reddy On CBI investigation In YS Viveka Case - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న అవినాశ్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ.. నిజాన్ని వెలికితీసే కోణంలో కాకుండా, వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని సాగుతోందన్న భావన కలుగుతోందని కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి అన్నారు. సీబీఐ విచారణ సరైన దిశలో వెళ్లాలని చెబుతున్నానే తప్ప అనుమానించడం లేదని స్పష్టం చేశారు. మీడియా సైతం ఈ విషయంలో నిజాలను నిజాలుగా చూపాలని కోరారు.

తనకు తెలిసిన అన్ని నిజాలను పొందుపరుస్తూ సీబీఐ అధికారులకు వినతిపత్రం ఇచ్చానని, అందులోని అంశాలపైనా విచారణ జరగాలని కోరినట్టు తెలిపారు. అబద్ధాన్ని నిజంగా.. నిజాన్ని అబద్ధంగా మార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. శుక్రవారం మధ్యాహ్నం కోఠిలోని సీబీఐ కార్యాల­యంలో ఆయన విచారణకు హాజరయ్యారు.

అనంతరం సాయంత్రం బయటికి వచ్చాక మీడియాతో మాట్లాడారు. జనవరి 28న విచారణకు కొనసాగింపుగా శుక్రవారం రెండోసారి సీబీఐ అధికారుల విచారణకు హాజరైనట్లు తెలిపారు. గతంలో విచా­రణ­ప్పుడు మరోమారు పిలుస్తామని చెప్పారని, ఈసారి మాత్రం మళ్లీ విచారణకు రావాలని చెప్ప­లేద­న్నారు. ఎంపీ ఇంకా ఏమన్నారంటే..

మీడియా బాధ్యతగా వ్యవహరించాలి 
మీడియా బాధ్యతగా వార్తలు ప్రసారం చేయాలని మనవి చేస్తున్నా. గతంలోనూ ఇదే విషయం చెప్పాను. మళ్లీ అదే చెబుతున్నా. నేను విజయమ్మ గారి దగ్గరికి వెళ్లి వస్తే.. బెదిరించి వచ్చానని చర్చలు పెట్టి, ప్రచారం చేస్తున్నారు. అది ఎంత వరకు సబబు? నేను దుబాయ్‌కి వెళ్లిపోయానని వక్రీకరించే వార్తలు వేస్తున్నారు. 

► తెల్లవారుజామున 3 గంటలకు ఫోన్లు చేశానని వక్రీకరించే వార్తలు వేయడమే కాకుండా దానిపై గంటల తరబడి, రోజులపాటు చర్చలు పెడుతున్నారు. విచారణ జరుగుతున్నప్పుడు మీడియా బాధ్యతగా మెలగాలి.  మీడియానే ట్రయల్‌ పూర్తి చేసి..దోషులెవరో, నిర్దోషులెవరో మీడియానే నిర్ణయిస్తోంది. ఇది విచారణపై ఎంత ప్రభావం పడుతుందో ఒకసారి మీరే ఆలోచించండి. ఒక అబద్ధాన్ని సున్నా నుంచి వందకు పెంచే ప్రయత్నం జరుగుతోంది. అదేవిధంగా ఒక నిజాన్ని వంద నుంచి సున్నా చేసే ప్రయత్నం జరుగుతోంది.  

► ముందు నుంచి కూడా ఫ్యాక్ట్‌ టార్గెట్‌గా కంటే పర్సన్‌ టార్గెట్‌గా విచారణ జరగడం సరికాదు. గూగుల్‌ టేకౌట్‌ అన్నది నిజమైన గూగుల్‌ టేకౌటా.. టీడీపీ టేకౌటా అన్నది భవిష్యత్తులో కాలమే నిర్ణయిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే.. సీబీఐ సమర్పించిన కౌంటర్‌లోని విషయాలన్నీ ఏడాది క్రితం టీడీపీ వాళ్లు చేసిన విమర్శలే. అందువల్ల ఎవరికైనా సందేహాలు రావడం సహజం. ఈ పరిస్థితిలో విచారణ సరైన కోణంలో వెళ్లాలని చెబుతున్నాను తప్ప.. నేను అనుమానించడం లేదు. 

ఆ రోజు చెప్పిందే ఈ రోజూ చెబుతున్నా 
► వివేకం సార్‌ చనిపోయిన రోజు నేను మార్చురీ దగ్గర మీడియాతో మాట్లాడాను. మళ్లీ రెండు రోజుల తర్వాత కూడా మీడియాతో మాట్లాడాను. ఆ రోజు ఏం మాట్లాడానో.. ఈ రోజు కూడా అదే మాట్లాడుతున్నా. సీబీఐ వాళ్లకు అదే చెబుతున్నా. ఎవరెన్నిసార్లు పిలిచి అడిగినా అదే చెబుతా. ఎందుకంటే నాకు తెలిసిన నిజం అదే కాబట్టి. 

► ఆ రోజు ఆ విషయం గురించి మీడియాతో మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి నేనే. అందుకే నేను ఆ రోజు చెప్పిందే ఈ రోజూ చెబుతున్నా. సీబీఐ వారి ప్రశ్నలకు నాకు తెలిసిన సమాధానాలు చెప్పాను. 

► వివేకం సార్‌ చనిపోయిన రోజు సీన్‌ ఆఫ్‌ క్రైంకి నేను వెళ్లేటప్పటికే అక్కడ ఒక లెటర్‌ ఉంది. కానీ, ఆ లెటర్‌ను దాచిపెట్టారు. ఆ లెటర్‌లో అది హత్య అని స్పష్టంగా ఉంది. అందులో అనేక అంశాలు ఉన్నాయి. ఆ విషయాల గురించి నేను చెప్పడం కంటే భవిష్యత్తులో అవన్నీ బయటికి వస్తాయి.  

► ఇంతకు ముందు అడిగినట్టే అడ్వొకేట్‌ సమక్షంలో ప్రశ్నించాలని, అన్ని విషయాలు ఆడియో.. వీడియో రికార్డింగ్‌ చేయాలని ఇప్పుడు కూడా కోరాం. ఈ మేరకు సీబీఐ డైరెక్టర్‌ కూడా లెటర్‌ పెట్టాం. కానీ అది జరగలేదు. అయితే ఒక ల్యాప్‌టాప్‌ను మాత్రం నా ముందు ఉంచారు. అది ఎందుకోసం అన్నది నాకు తెలియదు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement