ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఏర్పాటు, సంస్కరణల్లో భాగంగా పాఠ్య ప్రణాళికల్లో సమూల మార్పులు, నైపుణ్యాభివృద్ధికి అప్రెంటీస్ షిప్ తప్పనిసరి, నాలుగేళ్ల హానర్స్ డిగ్రీ కోర్సులు, డిగ్రీ కోర్సుల్లో పూర్తిగా ఆంగ్ల మాధ్యమం, విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి స్కిల్‌డెవలప్‌మెంటు వర్సిటీ ఏర్పాటుతో రాష్ట్ర ఉన్నత విద్యా రంగంలో కొత్త శకం మొదలైంది. పార్లమెంటు నియోజకవర్గానికి ఒక నైపుణ్యాభివృద్ధి విద్యా సంస్థ ఏర్పాటు, విద్యార్థులకు శిక్షణ కోసం కాలేజీలతో పరిశ్రమల ఒప్పందం.. ఐటీ సంస్థలు, వర్తక వాణిజ్య సంస్థల అనుసంధానం, పరిశ్రమలకు అవసరమైన అంశాలను ముందుగానే గుర్తించి అందుకు అనుగుణంగా విద్యార్థులకు ఆయా కోర్సుల్లో తర్ఫీదు ఇవ్వడం తదితర కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుండటం వల్ల ఉన్నత విద్య కొత్త కళ సంతరించుకుంది.
సాక్షి, అమరావతి: రెండేళ్లుగా రాష్ట్రంలో ఉన్నత విద్య కొత్తపుంతలు తొక్కుతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత చదువులు మరింత చేరువయ్యాయి. ఉన్నత విద్యనభ్యసించే వారికి ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వమే పూర్తి స్థాయిలో విద్యార్థులకు అండదండలు అందిస్తుండడంతో చేరికల నుంచి అన్ని అంశాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన విద్య అందేలా ఉన్నత విద్యలో ప్రవేశపెట్టిన సంస్కరణలతో విద్యార్థుల్లో నైపుణ్యం, సామర్థ్యం పెరిగి వారి భవిష్యత్తు ఆశావహంగా మారుతోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకూ మార్గం సుగమమవుతోంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉన్నత చదువుల పరిస్థితి నిరాశాజనకంగా ఉండింది. అప్పట్లో విద్యార్థులకు ఫీజుల భారం ఎక్కువగా ఉండేది. ప్రభుత్వం నుంచి అందే సహకారం అంతంత మాత్రమే కావడంతో పాటు వసతి, భోజనాలకు తల్లిదండ్రులు అప్పులు చేయాల్సి వచ్చేది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉన్నత విద్య సర్వే నివేదికలోని అంశాలను గమనిస్తే చంద్రబాబు హయాంలో ఉన్నత విద్య ఎంతలా కునారిల్లిపోయిందో స్పష్టమవుతుంది.
2015–16 నుంచి 2019–20 వరకు అయిదేళ్ల కాలంలో.. తొలి నాలుగేళ్లూ చంద్రబాబు హయాంలో దుస్థితిని కళ్లకు కట్టినట్లు చూపిస్తుండగా 2019–20లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక క్రమేణా పరిస్థితి మెరుగు పడుతున్న అంశాన్ని స్పష్టం చేస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రభావంతో ఉన్నత విద్య పరుగులు తీస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టే తదుపరి ఉన్నత విద్యా సర్వే కార్యక్రమాలు కోవిడ్ కారణంగా ముందుకు సాగకపోవడం వల్ల ఆ నివేదికలు పూర్తి కాలేదు. అవీ పూర్తయితే రాష్ట్రంలో ఉన్నత విద్యలోని విప్లవాత్మకత దేశ వ్యాప్తంగా మరింతగా ప్రస్ఫుటం అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది.
చేరికల్లో పెరుగుదల
చంద్రబాబు హయాంలో ఎలాంటి ప్రోత్సాహకాలు లేనందున ఉన్నత విద్యలో చేరికలు తక్కువగానే ఉన్నాయి. దేశంలో కాలేజీల్లో సగటు ఎన్రోల్‌మెంటుకు ఏపీ చాలా దూరంలో ఉండింది. ఈ ప్రభుత్వం వచ్చాక మెల్లమెల్లగా పరిస్థితులు మెరుగు పడుతున్నాయి. 2015–16లో దేశంలో ఉన్నత విద్యలో చేరికల గరిష్ట నిష్పత్తి జాతీయ స్థాయిలో 24.5 శాతం కాగా ఏపీలో 30.08 శాతంగా ఉంది. 2019–20లో జాతీయ గరిష్ట చేరికల నిష్పత్తి 27.1 శాతం కాగా ఏపీలో 35.2 శాతానికి చేరింది. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న నేపథ్యంలో గ్రాస్ ఎన్రోల్‌మెంట్ రేషియో 70 నుంచి 90 శాతానికి పెరిగేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల అధికారులకు లక్ష్యాలను నిర్దేశించారు. కాలేజీల్లో సగటు చేరికలు జాతీయ స్థాయిలో 2015–16లో 721గా ఉండగా ఏపీలో 494 మందిగా ఉంది. అదే 2019–20లో జాతీయ సగటు 680 కాగా ఏపీలో 524కు చేరింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మహిళలకు వెన్నుదన్నుగా
గతంలో టీడీపీ ప్రభుత్వం విద్యార్థుల చదువులకు అందించే ప్రోత్సాహం అంతంత మాత్రంగా ఉండడంతో ఆర్థిక భారం మోయలేక అనేక మంది ఉన్నత విద్యకు దూరం అయ్యారు. ప్రస్తుత ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయంబర్స్‌మెంటుతో పాటు వసతి సదుపాయాల కోసం జగనన్న వసతి దీవెన కింద ఏటా రూ.20 వేల వరకు అందిస్తోంది. దీంతో విద్యార్థులకు ఆర్థికంగా ఎలాంటి భారం లేకుండా వారు చదువుకోవడానికి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫలితంగా కాలేజీల్లో చేరికలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, విద్యార్థినుల చేరికలూ క్రమేణా మెరుగు పడుతున్నాయి. మహిళల చేరికలను గమనిస్తే పీజీ కోర్సుల్లో 2015–16లో బాలురు 1,40,943 మంది ఉండగా బాలికలు 1,07,697 మంది ఉన్నారు. అదే అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) కోర్సుల్లో బాలురు 7,42,513 కాగా, బాలికలు 5,86,407గా ఉన్నారు. 2019–20 నాటికి పీజీలో 1,12,024 మంది బాలురు కాగా, బాలికలు 1,05,816 మంది ఉన్నారు. యూజీ కోర్సుల్లో బాలురు 7,98,084 మంది కాగా, బాలికలు 6,96,983 మంది ఉన్నారు. గతంలో కన్నా బాలికల చేరికల శాతం మెరుగు పడింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు అన్ని రకాలుగా సాయం అందుతుండడంతో వారి చేరికలు గణనీయంగా పెరిగాయి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల చేరికలు ఇలా..
సంవత్సరం మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ
2015–16 17,24,538 2,64,142 71,700 6,92,790
2016–17 17,99,433 3,00,767 75,663 7,26,750
2017–18 16,97,282 2,73,702 73,655 7,08,530
2018–19 17,60,830 2,90,802 78,687 7,65,507
2019–20 18,97,149 3,16,573 88,231 8,37,454
దేశంలో 2015–16 నుంచి 2019–20 వరకు ఉన్నత విద్య స్థితిగతులు ఇలా..
►ఉన్నత విద్యలో 3.85 కోట్ల మంది చదువుతున్నారు. వీరిలో 1.96 కోట్ల మంది బాలురు. 1.89 కోట్ల మంది బాలికలు. మొత్తం చేరికల్లో బాలికలు 49 శాతంగా ఉన్నారు.
►దేశంలో 16.6 శాతం కాలేజీల్లో 100 కన్నా తక్కువ మంది విద్యార్థులున్నారు. 4 శాతం కాలేజీల్లో మాత్రమే 3 వేల మందికి మించి చేరికలున్నాయి.
►దేశంలో 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉన్న వారిలో ఉన్నత విద్యలో చదువుతున్న వారు (గ్రాస్ ఎన్రోల్‌మెంటు రేషియో–జీఈఆర్) 27.1 శాతం ఉన్నారు. జనాభా సంఖ్య ప్రకారం బాలురు 26.9 శాతం కాగా, బాలికల చేరికలు 27.3 శాతంగా ఉంది.
►జాతీయ సగటుతో పోలిస్తే ఎస్సీల్లో 23.4 శాతం, ఎస్టీల్లో 18 శాతం మంది ఉన్నత విద్యలో చేరుతున్నారు.
►79.5 శాతం మేర చేరికలు అండర్ గ్రాడ్యుయేషన్‌లోఉండగా, పీహెచ్‌డీ స్థాయికి వచ్చే సరికి అది 0.5 శాతం మాత్రమే ఉంటోంది. ఎక్కువ మంది విద్యార్థులు బీఏలో ఉండగా తదుపరి చేరికలు బీఎస్సీ, బీకాంలలో ఉన్నాయి. ఆర్ట్స్, హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్‌లో 32.7 శాతం మంది, సైన్సులో 16 శాతం మంది, కామర్స్‌లో 14.9 శాతం మంది, ఇంజనీరింగ్‌లో 12.6 శాతం మంది చేరుతున్నారు.
►మొత్తం కాలేజీల్లో 78.6 శాతం ప్రైవేట్ సెక్టార్‌లో ఉన్నాయి.
వైద్య విద్యకు అత్యధిక ప్రాధాన్యం
ప్రజల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఈ దిశగా ప్రజలందరికీ నాణ్యమైన సత్వర వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా కొత్తగా 16 వైద్య కళాశాలల నిర్మాణానికి వేగంగా చర్యలు తీసుకుంటోంది. స్థలాల సేకరణ, డిజైన్లు, మౌలిక వసతులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ఆదేశించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒక బోధన కళాశాల, ఒక నర్సింగ్ కళాశాల ఉండేలా చర్యలు తీసుకున్నారు. తద్వారా రాష్ట్ర విద్యార్థులు ఎంతో మందికి ఎంబీబీఎస్, నర్సింగ్ కోర్సుల సీట్లు అదనంగా రానున్నాయి. వీటితో పాటు పీజీ వైద్య సీట్లు కూడా పెరుగుతున్నాయి. కాగా, యువతలో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ప్రత్యేకంగా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment