ఏపీలో ముఠాల పాలన: వైఎస్‌ జగన్‌ | YS Jagan mohan Reddy fires on tdp | Sakshi
Sakshi News home page

ఏపీలో ముఠాల పాలన: వైఎస్‌ జగన్‌

Published Mon, Aug 5 2024 4:38 AM | Last Updated on Mon, Aug 5 2024 8:55 AM

YS Jagan mohan Reddy fires on tdp

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపాటు 

రాష్ట్రం రాజకీయ హింసకు మారుపేరుగా మారింది 

ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతోనే నిత్యం దాడులు 

హామీలు అమలు చేయలేకే ఈ దుర్మార్గాలు 

బాధితులకు అండగా నిలిచి పోరాటం సాగిస్తాం  

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌­రెడ్డి మండిపడ్డారు. రెండు నెలలుగా ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయిందని, పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో జరిగే ఘటనలు, అధికారంలో తమ పార్టీ ఉందనే ధీమాతో చేస్తున్న దాడులు, రాజకీయ ప్రేరేపిత దుశ్చర్యలు.. రాష్ట్రంలో ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయి. 

నంద్యాల జిల్లాలో నిన్న రాత్రి జరిగిన హత్య, ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో జరిగిన దాడి ఘటనలు వీటికి నిదర్శనం. ప్రజలకిచ్చిన హామీలను చంద్రబాబు నిలబెట్టుకోలేకపోవ­డ­ంతో, ఎవరూ ప్రశ్నించ కూడదని, రోడ్డుపైకి రాకూడదని ప్రజ­లను, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడానికే ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతు­న్నారు. బాధితులకు అండగా ఉంటూ, పోరాటాన్ని కొనసాగి­స్తాం’ అని ఆదివారం ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్టు చేశారు.

గ్రామంలో మరికొందరికి హాని
సుబ్బరాయుడు హత్య అత్యంత దారుణం. గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత జయనారపురెడ్డిని రెండుసార్లు చంపేందుకు యత్నించారు.  రాష్ట్రంలో 36 హత్యలు జరిగాయని ఢిల్లీలో మాజీ సీఎం జగన్‌ ధర్నాచేస్తే ఎక్కడ జరిగాయని అడుగుతున్న టీడీపీ నేతలు సీతారామపురం ఘటనపై ఏం సమాధానం చెప్తారు? పోలీసులు, టీడీపీ ప్రభుత్వం కఠిన­చర్యలు తీసుకోకపోతే ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తాం. అర్ధరాత్రి శ్రీనివాసరెడ్డి 30 మంది అనుచరులతో మహిళలు, వృద్ధులపై దాడిచేయడం హేయమైన చర్య. గ్రామంలో మరికొందరికి ప్రాణహాని ఉంది. పోలీసులు స్పందించాలి.  – శిల్పా చక్రపాణిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, శ్రీశైలం 

చేత కాదని చెప్పండి, మా రక్షణ మేం చూసుకుంటాం..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచకాలు రోజు­రోజుకూ పెరుగుతున్నాయి. మళ్లీ ఫ్యాక్షన్‌ విష సంస్కృతిని టీడీపీ నేతలు ప్రోత్సహిస్తున్నారు. దౌర్జన్యాలతో ఏమీ సాధించలేరు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. పోలీ­సులు చేతకాదని చెప్పండి, మా నేతలు, కార్యకర్తలను మేమే రక్షించుకుంటాం.     – కాటసాని రాంభూపాల్‌రెడ్డి,  వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, నంద్యాల

సామాన్యులకు రక్షణ ఎక్కడ?
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యులకు రక్షణ కరువైంది. అధికారంలోకి వచ్చింది పరిపాలన కోసమా, రాజకీయ హత్యల కోసమా? వరుస హత్యలపై జగన్‌ ధర్నాచేస్తే అంతా బూటకమన్న హోంమంత్రి వనిత ఇప్పుడే సమాధానం చెప్తారు? ఎస్‌ఐ మీదనే పెట్రోల్‌ పోసి తగలబెడతామంటూ బెదిరిస్తుంటే మీరేమి చేస్తారు? డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ సమాధానం చెప్పాలి. జగన్‌ హత్యా రాజకీయాలకు పుల్‌స్టాప్‌ పెడితే మీరు మళ్లీ ప్రోత్సహిస్తున్నారు.  – విరూపాక్షి, ఎమ్మెల్యే, ఆలూరు

సంపద సృష్టి అంటే చంపడమా!?
రాష్ట్రంలో సంపద సృష్టించడమంటే వైఎస్సార్‌సీపీ నేతలను చంపడమా? మహిళలు, వృద్ధులపై కత్తులు, కర్రలతో దాడులు చేయడం సిగ్గుచేటు. కాపు కులానికి చెందిన సుబ్బరాయుడును కిరాతకంగా చంపడం దారుణం. ఎస్పీకి కాల్‌చేసి చెప్పినా స్పందించలేదు. గ్రామంలోని వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలు  జయనారపురెడ్డి, జమాల్‌రెడ్డి, పెద్దిరెడ్డి, మరికొంతమందికి రక్షణ కల్పించాలి. వారికేమైనా జరిగితే పోలీసులు, ప్రభుత్వానిదే బాధ్యత. – కాటసాని రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే 

రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం
రాష్ట్రంలో హింసాకాండ ఆగడంలేదు. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది. పోలీసుల కళ్లెదుటే వైఎస్సార్‌సీపీ వారిని వెంటాడి చంపడం బాధాకరం. హత్యలు చేయడమే అభివృద్ధా. రాయలసీమలో ఫ్యాక్షనిస్టులు మహిళల జోలికి వెళ్లరని అంటారు. కానీ, ఇక్కడ మహిళలపైనా దాడిచేయడం సిగ్గుచేటు. అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పారు, ఇప్పుడేం చేస్తున్నారన్నది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఓపికతో ఉన్నారు. సహనం నశిస్తే ఎలా ఉంటుందో పోలీసులు ఆలోచించాలి.  – శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే

భయపెడితే వెనక్కి తగ్గం..
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలుచేస్తే వెనక్కి తగ్గం. కలిసికట్టుగా పోరాడి సీతారామపురంలోని నాయకులు, కార్యకర్తలకు కాపాడుకుంటాం. రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? మహిళలని కూడా చూడకుండా దాడులు చేయడం హేయం. – ఇసాక్‌బాషా, ఎమ్మెల్సీ, నంద్యాల

హత్యా రాజకీయాలు ఆపాలి 
రాష్ట్రంలో హత్యా రాజకీయాలు ఆపాలి. ప్రశాంతంగా ఉన్న సీతారామపురంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త సుబ్బరా­యుడును చంపడం సిగ్గుచేటు. రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉందో ప్రజలకు అర్థమవుతోంది. వైఎస్సార్‌సీపీకి ఓటేస్తే చంపేస్తారా? బాధిత కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటు­ంది.    – ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే

 ఏపీలో అరాచక పాలనపై గత నెల 24వ తేదీన ఢిల్లీ వేదికగా ధర్నా చేపట్టిన వైఎస్సార్‌సీపీ.. ఈ మేరకు జాతీయ    మీడియాతో మాట్లాడిన వైఎస్‌ జగన్‌

 

 

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement