గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తే.. అక్రమ అరెస్టులు చేస్తున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో వారం రోజులుగా జరుగుతున్న వైఎస్సార్‌సీపీ యాక్టివిస్టుల అరెస్టుల పర్వంపై గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
అఘాయిత్యాలపై ప్రశ్నిస్తే.. తప్పుడు కేసులు. మద్యం మాఫియాపై ప్రశ్నిస్తే.. తప్పుడు కేసులు. కరెంట్ ఛార్జీలపై ప్రశ్నిస్తే.. తప్పుడు కేసులు. వరద సాయంపై ప్రశ్నిస్తే.. తప్పుడు కేసులు. ఉచిత ఇసుకపై ప్రశ్నిస్తే.. తప్పుడు కేసులు. ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేస్తున్నారని అన్నందుకు.. తప్పుడు కేసు. అసలు జగన్ సృష్టించిన సంపదను ఎందుకు అమ్మేస్తున్నారు?.
‘‘విద్య వద్దు.. మద్యం ముద్దు. నాన్నకు పుల్లు.. అమ్మకు నిల్లు’’ అని పోస్ట్ చేసినందుకు ఓ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారు. ‘‘జనసేన నేతలతో బలవంతంగా కాళ్లు పట్టించుకుంటున్న టీడీపీ నేతలు’’ అనే కథనాన్ని ఫార్వర్డ్ చేసిందుకు ఓ వ్యక్తిపై తప్పుడు కేసు పెట్టారు. అగ్గిపెట్టెలు, క్యాండిల్స్ కోసం ప్రజాధనం కాజేశారని పోస్ట్ చేసినందుకు ఓ యువకుడ్ని అరెస్ట్ చేశారు.
తిరుమలలో చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో.. తలపై వస్త్రాలు పక్కకు వంగిపోయాయి. ఈ జరిగిన పరిణామాన్ని పోస్ట్ చేసి.. ‘‘తిరుపతి లడ్డూ ప్రసాదంపై అసత్యపు ప్రచారం చేసినందుకు దేవుడికి కూడా చంద్రబాబు నచ్చడంలేదని ఓ యవకుడు షార్ట్ రీల్ చేశాడు. అతన్ని కూడా అరెస్ట్ చేశారు.
వీళ్లంతా సోషల్ మీడియా యాక్టివిస్టులు. పైగా యంగ్‌స్టర్స్. రాష్ట్రంలో జరుగుతున్నవే కదా పోస్ట్ చేస్తున్నది. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి రెండు మూడు రోజులు ఉంచి చిత్రహింసలు పెడుతున్నారు. అవన్నీ వాస్తవాలే కదా. జరుగుతున్నవే కదా.
ఏడేళ్లలోపు కేసుల్లో ప్రొసీజర్లు ఉన్నాయి. సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. నిజంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటే.. వారెంట్ ఇవ్వాలి. 41ఏ కింద నోటీసులు ఇవ్వాలి. మెజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలి. ఇది సుప్రీం కోర్టు ఆర్డర్. కానీ, ఇవేవీ పట్టించుకోవడం లేదు అని జగన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment