
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో నాటి సీఎం చంద్రబాబు విజయవాడలో నిర్దాక్షిణ్యంగా పెద్ద ఎత్తున కూలగొట్టిన దేవాలయాల పునఃనిర్మాణ మహా క్రతువును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. గత సర్కారు నగరంలో కూల్చివేసిన 9 గుడులకు సంబంధించి రూ.3.79 కోట్లతో తొలిదశలో పునఃనిర్మాణ పనులకు సీఎం వైఎస్ జగన్ శుక్రవారం భూమి పూజ నిర్వహించనున్నారు. బెజవాడ కనకదుర్గమ్మ గుడి అభివృద్ధి, విస్తరణలో భాగంగా రూ.77 కోట్లతో చేపట్టిన మరో 8 పనులకు కూడా సీఎం జగన్ భూమి పూజ చేయనున్నారు. ఆగమ పండితులు నిర్ధారించిన ప్రకారం రేపు ఉదయం 11.01 గంటల ముహుర్తానికి శనీశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేపట్టనున్న ప్రాంతంలో రెండు వేర్వేరు శిలాఫలకాలను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. భూమి పూజ అనంతరం ముఖ్యమంత్రి జగన్ ఇంద్రకీలాద్రి కొండపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు బుధవారం ఆలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
స్థలాల ఎంపిక తరువాత మిగిలిన ఆలయాల పునఃనిర్మాణం
గత సర్కారు హయాంలో కూల్చివేసిన వాటిల్లో ఆయా ప్రాంతాలలో ప్రస్తుతం స్థలం అందుబాటులో ఉన్న మేరకు తొలిదశలో 9 ఆలయాల పునఃనిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. మిగిలిన ఆలయాల పునఃనిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలాల కోసం దేవదాయ శాఖ అధికారులు అన్వేషిస్తున్నారు. స్థలాల ఎంపిక పూర్తి కాగానే మిగిలిన చోట్ల కూడా ఆలయాల పునఃనిర్మాణ పనులు చేపడతారు. దుర్గగుడి అభివృద్ధి, విస్తరణ రూ.77 కోట్లతో చేపడతుండగా అందులో రూ.70 కోట్ల నిధులు ప్రభుత్వం సమకూరుస్తోంది. మిగతా రూ.7 కోట్లను దుర్గ గుడి నిధుల నుంచి వెచ్చించనున్నారు.
విజయవాడ అర్జున వీధి గోశాలలోని కృష్ణ మందిరం కూల్చి వేసిన దృశ్యం
మతాల మధ్య చంద్రబాబు చిచ్చు
మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకునే నాయకుడు చంద్రబాబు. 13 జిల్లాల పరిధిలో వివిధ రకాల ఘటనల కారణంగా ఇటీవల నష్టం జరిగిన ఆలయాల పునఃనిర్మాణానికి అన్ని చర్యలు తీసుకుంటాం.
– వెలంపల్లి శ్రీనివాసరావు, దేవదాయశాఖ మంత్రి
విజయవాడలో పునఃనిర్మాణం చేపట్టే ఆలయాలు ఇవీ..
1. రూ.70 లక్షలతో రాహు–కేతు ఆలయం
2. రూ.9.50 లక్షలతో శ్రీసీతమ్మ పాదాలు
3. రూ.31.50 లక్షలతో దక్షిణాభిముఖ ఆంజనేయస్వామి ఆలయం (సీతమ్మ పాదాలకు సమీపంలో)
4. రూ. 2 కోట్లతో రాతితో శ్రీశనీశ్వర ఆలయం పునఃనిర్మాణం
5. రూ. 8 లక్షలతో బొడ్డు బొమ్మ..
6. రూ.20 లక్షలతో శ్రీ ఆంజనేయస్వామి ఆలయం (దుర్గగుడి మెట్ల వద్ద)
7. రూ. 10 లక్షలతో శ్రీసీతారామ లక్ష్మణ సమేత శ్రీదాసాంజనేయ ఆలయం
8 రూ. 10 లక్షలతో వీరబాబు ఆలయం (పోలీసు కంట్రోల్ రూం సమీపంలో)
9. కనకదుర్గ నగర్‌లో రూ.20 లక్షలతో శ్రీవేణుగోపాలకృష్ణ మందిరం, గోశాల.
దుర్గ గుడి అభివృద్ది విస్తరణ పనులు ఇలా...
1. రూ.8.50 కోట్లతో ప్రసాదం పోటు భవన నిర్మాణం
2. రూ. 5.60 కోట్లతో మల్లేశ్వరస్వామి ఆలయ పునః నిర్మాణం
3. రూ. 2 కోట్లతో మల్లేశ్వరస్వామి ఆలయ ప్రాకారం విస్తరణ
4.రూ. 23.60 కోట్లతో కేశఖండన శాల భవన నిర్మాణం
5.రూ. 19.75 కోట్లతో అన్నప్రసాదం భవన నిర్మాణం
6. రూ. 5.25 కోట్లతో కనకదుర్గ టోల్‌ప్లాజా (తిరుపతి అలిపిరి వద్ద ఉండే ద్వారం మాదిరిగా దుర్గ గుడి ఘాట్ ఆరంభం వద్ద నిర్మిస్తారు)
7. రూ. 6.5 కోట్లతో ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడకుండా మరమ్మత్తులు, పట్టిష్ట చర్యలు.
8. రూ.2.75 కోట్లతో ఆలయం మొత్తం ఎనర్జీ, వాటర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ పనులు
Comments
Please login to add a commentAdd a comment