
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చట్ట ప్రకారమే దర్యాప్తు చేస్తున్నామని హైకోర్టుకు సీబీఐ నివేదించింది. హైకోర్టును తప్పుదోవ పట్టించి తమ దర్యాప్తునకు ఆటంకం కలిగించడమే పిటిషనర్ల ఉద్దేశమని పేర్కొంది. వివేకానందరెడ్డి హత్య కేసులో పిటిషనర్లయిన సునీల్ యాదవ్, అతని సోదరుడు కిరణ్ యాదవ్‌ల పాత్రను ప్రస్తుత దశలో కొట్టిపారేయలేమని సీబీఐ స్పష్టం చేసింది. వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు తమను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని, తమను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ వైఎస్సార్ జిల్లా మోతునూతలపల్లికి చెందిన యాదాటి సునీల్ యాదవ్, అతని సోదరుడు, తల్లి, తండ్రి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీబీఐ డీఎస్పీ దీపక్ గౌర్ కౌంటర్ దాఖలు చేశారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి.
పిటిషనర్లకు క్లీన్‌చిట్ ఇవ్వలేదు..
► హైకోర్టు ఆదేశాల మేరకు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు చేపట్టాం. చట్టానికి అనుగుణంగా దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు కీలక దశలో ఉంది. కఠినమైన చట్టం నుంచి తప్పించుకునేందుకు పిటిషనర్లు ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్లు చెబుతున్నవన్నీ నిరాధారమైనవి. రాష్ట్ర పోలీసులు క్లీన్‌చిట్ ఇవ్వలేదు. ఈ కేసులో పిటిషనర్ల పాత్రను తోసిపుచ్చలేం. పిటిషనర్‌ను ఢిల్లీ సీఐడీ కార్యాలయంలో విచారణ చేసినంత కాలం అతను ఢిల్లీలోని తన బంధువు ఇంట్లో ఉన్నారు.
► హత్యకు ముందు, ఆ తర్వాత సునీల్ యాదవ్ ప్రవర్తన, నడవడిక అత్యంత అనుమానాస్పదంగా ఉన్నట్లు మా దర్యాప్తులో తేలింది. అతనికి వ్యతిరేకంగా కీలక ఆధారాలు లభించాయి. వాటిని ప్రస్తుతం బయట పెట్టలేం. అందువల్ల ఈ పిటిషన్‌కు విచారణార్హతే లేదు.
► పిటిషనర్ ఆమోదంతో అతని ఈ మెయిల్ ఐడీ, ఫేస్ బుక్ ఖాతాలను, అతని చేతి రాత నమూనాలను అతని సమక్షంలోనే పరిశీలించాం. సునీల్ యాదవ్ అంగీకారంతో ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అతనికి సైకలాజికల్ అసెస్‌మెంట్, వాయిస్ లేయర్డ్ అనాలసిస్ నిర్వహించాం. అయితే ఎలాంటి పోలిగ్రాఫ్ టెస్ట్ చేయలేదు. థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదు.
నేడు విచారణ జరపనున్న న్యాయస్థానం
వాస్తవానికి సునీల్ యాదవ్ దాఖలు చేసిన వ్యాజ్యం గురువారం విచారణకు రావాల్సి ఉంది. అయితే విచారణకు రాకపోవడంతో సునీల్ తరఫు న్యాయవాది టీఎల్ నయన్ కుమార్ గురువారం ఉదయం న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ముందు ప్రస్తావించారు. దీంతో ఈ వ్యాజ్యంపై శుక్రవారం విచారణ జరుపుతానని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment