తీరంలో నిలిచిన పడవలు
బాపట్ల: సముద్రంలో చేపల వేటను ఏప్రిల్ 15 నుంచి కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. మత్స్య సంపద పునరుత్పత్తి కాలం కావడంతో మే 31 వరకు నిషేధం కొనసాగనుంది. గతంలో వేట నిషేధ కాలంలో మత్స్యకారులు ఆకలితో అలమటించేవారు. ప్రభుత్వాలు పట్టించుకునేవి కావు. దీంతో కుటుంబాల జీవనానికి అష్టకష్టాలు పడేవారు. దీనిని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టగానే మత్స్యకార భరోసా పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనిద్వారా ఏటా వేట నిషేధ సమయంలో రూ.10వేలు గంగపుత్రులకు అందిస్తున్నారు. దీంతో మత్స్యకారుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల మండలంలోని ముత్తాయపాలెం, రామానగర్, ఆదర్శనగర్, హనుమంత్‌నగర్, సూర్యలంక, రామచంద్రాపురం, అడవిపల్లిపాలెం, దాన్వాయ్ పేట, కొత్త ఓడరేవు, పచ్చమొగిలి, విజయలక్ష్మిపు రం గ్రామాల్లో 2,300 మంది మత్స్యకారులు జీవి స్తుంటారు. వీరందరికీ చేపల వేటే జీవనాధారం.
జలాశయాల్లో వేటకు ఉల్లాసంగా..
వేట నిషేధ సమయంలో ప్రభుత్వం అందించే మత్స్యకార భరోసాతోపాటు గంగపుత్రులకు జలాశయాల్లో వేట వరంగా మారింది. బాపట్ల తీరంలోని మత్స్యకారులు వేటలో నిష్ణాతులు కావడంతో ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. అక్కడి జలాశయాల్లో వేటకు వీరిని తీసుకెళ్తుంటారు. కర్ణాటక, తమిళనాడు, గోవా, కేరళకు చెందిన వారు వచ్చి రూ.50వేలకుపైగా అడ్వాన్సులు చెల్లించి మరీ ఇక్కడి గంగపుత్రులను తీసుకెళ్తున్నారు. దీంతో వీరు ఉల్లాసంగా వలస వెళ్తున్నారు. ఈ నెలన్నర రోజుల తర్వాత మళ్లీ బాపట్ల చేరుకుంటారు. కొందరు ముఠాలుగా ఏర్పడి రేపల్లె, వేమూరు ప్రాంతాలకు కూడా జలాశయాల్లో వేటకు వెళ్తున్నారు. ఈ ఏడాది ఇతర రాష్ట్రాలకు వెళ్లే బృందాల సంఖ్య పెరిగింది.
వలలను తీసుకుపోతున్న మత్స్యకారులు
10వేల మందికి మత్స్యకార భరోసా
రాష్ట్రప్రభుత్వం వేట నిషేధ సమయంలో మత్స్యకార భరోసా ద్వారా రూ.10వేలు సాయం అందిస్తోంది. ఈ పథకం వల్ల జిల్లాలో పదివేల మంది లబ్ధి పొందుతున్నారు. వేట నిషేధ సమయంలో గంగపుత్రులకు స్థానికంగా కూడా పనులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
– కొక్కిలిగడ్డ చెంచయ్య, మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్
జలాశయాల్లో వేటకు డిమాండ్
జలాశయాల్లో వేటకు వెళ్లే వారికి మంచి డిమాండ్ ఉంది. అడ్వాన్సులు ఇచ్చి మరీ తీసుకుపోతున్నారు. బాపట్ల ప్రాంతంలో గంగపుత్రులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి చూసుకుంటారు. మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలన్నీ అందుతున్నాయి. ఆనందంగా ఉంది.
– గోసల కోదండం, మత్స్యకారుడు
Comments
Please login to add a commentAdd a comment