సాక్షి, అమరావతి: కరోనా వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ మాటకు కట్టుబడుతూ చేనేత కార్మికులను ఆదుకునేందుకు ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వరుసగా మూడో ఏడాది నేతన్నకు ఆపన్న హస్తం అందించేలా వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం అమలుకు సీఎం జగన్ ఆదేశించారు. ఈ ఏడాది వైఎస్సార్ నేతన్న నేస్తం కింద అర్హులైన 80,032 మంది నేతన్నలకు రూ.192.08 కోట్లను సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో కంప్యూటర్ బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఐదేళ్లలో ప్రతి లబ్ధిదారుడికి రూ.1,20,000
మగ్గం కలిగిన, అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. ఐదేళ్లలో ప్రతి లబ్ధిదారుడికి రూ.1,20,000 చొప్పున ఆర్థిక సాయం అందనుంది. ఇప్పటికే 2 విడతల్లో సాయం అందగా తాజాగా మూడో విడత సాయాన్ని అందచేయడం ద్వారా అర్హులైన ప్రతి నేతన్నకు రూ.72,000 చొప్పున ప్రయోజనం చేకూరనుంది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో నేతన్నలకు ప్రభుత్వం రూ.383.99 కోట్లు అందచేసింది. మంగళవారం మూడో విడత కింద ఇచ్చే రూ.192.08 కోట్లతో కలిపితే నేతన్నలకు రూ.576.07 కోట్ల సాయం అందించినట్లయింది.
పారదర్శకంగా అర్హులందరికీ..
దేశ చరిత్రలోనే తొలిసారిగా చేనేత కుటుంబాలకు పారదర్శకంగా లబ్ధి చేకూర్చేలా వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న వెంటనే వలంటీర్ల సహకారంతో నిర్దిష్ట కాలపరిమితితో తనిఖీ పూర్తి చేసి అర్హుల జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శించడం ద్వారా సోషల్ ఆడిట్ చేపట్టింది. ఎక్కడైనా అర్హులకు ప్రభుత్వ పథకాలు ఏ కారణం చేతనైనా అందకపోతే వారికి ఒక నెల రోజుల పాటు గడువిచ్చి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. వెంటనే ఆ దరఖాస్తులను పరిశీలించి అర్హులైతే సాయం అందేలా చర్యలు చేపట్టింది. ఏ ఒక్క అర్హుడికీ అన్యాయం జరగకూడదనే తపనతో ఆర్థిక సాయం అందించేలా ఏర్పాట్లు చేసింది. ఈ ఆర్థిక సాయాన్ని బ్యాంకులు పాత అప్పుల కింద జమ చేసుకోరాదని ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసి నేతన్నలు గౌరవప్రదంగా జీవించేలా ఆపన్న హస్తం అందిస్తోంది.
నేడు చేనేతలకు ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’
Published Tue, Aug 10 2021 2:31 AM | Last Updated on Tue, Aug 10 2021 12:02 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment