ఒంగోలులోని ఇందిరా కాలనీలో షేక్ పీరాబీకి వృద్ధాప్య పింఛన్ అందజేస్తున్న వలంటీర్ బాషా
సాక్షి, అమరావతి/తాడికొండ: రాష్ట్ర వ్యాప్తంగా ‘వైఎస్సార్ పింఛన్ కానుక’ పంపిణీ వేగంగా కొనసాగుతోంది. గురువారం సాయంత్రానికి 88.59 శాతం పింఛన్‌ల పంపిణీ పూర్తయింది. గ్రామ, వార్డు వలంటీర్లు తెల్లవారుజూము నుంచే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్‌లు అందజేశారు. ప్రభుత్వం 62,31,221 మందికి పింఛన్‌ల కోసం రూ.1,584.86 కోట్లు కేటాయించింది. మొదటి రోజు 55,20,026 మందికి రూ.1,403.70 కోట్లు అందించారు..
రాజధాని ప్రాంతంలో భూమిలేని పేదలకు కూడా..
అమరావతి రాజధాని ప్రాంతంలో భూమిలేని పేదలకు ప్రభుత్వం అందజేసే పింఛన్లను కూడా గురువారం తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. తుళ్లూరు మండలంలో 16,200 మంది లబ్ధిదారులకుగాను తొలిరోజు 12,423 మందికి (76.69 శాతం మందికి) వలంటీర్లు పింఛను డబ్బు అందజేశారు.
తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలో తొమ్మిది గ్రామాల్లో 5,796 మందికిగాను 5,400 మందికి పింఛన్లు పంపిణీ చేశారు. రాజధాని గ్రామాల్లో భూమిలేని పేదలు మొత్తం 17,173 మందికి ఇప్పటివరకు వారి బ్యాంకు ఖాతాల్లో సీఆర్‌డీఏ ద్వారా పింఛను డబ్బు జమచేసేవారు.
Comments
Please login to add a commentAdd a comment