సాక్షి, శ్రీకాకుళం: ఏపీలో టీడీపీ మూకలు రెచ్చిపోతున్నాయి. పచ్చ బ్యాచ్ దాడుల్లో మరో వైఎస్సార్‌సీపీ కార్యకర్త మృతిచెందాడు. పది మంది టీడీపీ కార్యకర్తలు కర్రలతో విచక్షణారహితంగా కొట్టడంతో ప్రసాద్ తీవ్ర గాయాల కారణంగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.
కాగా, పచ్చటి పల్లెలో రాజకీయ చిచ్చు రేగుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఎక్కడో ఒక చోట వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై పచ్చ మూకల దాడులు జరుగుతూనే ఉన్నాయి. గత ఆదివారం ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట గ్రామంలో రాత్రి 11.15 గంటల సమయంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త కూన ప్రసాద్‌పై టీడీపీ మూకలు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ప్రసాద్‌కు తీవ్ర గాయాలు కావడంతో జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు కేజీహెచ్‌కు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ప్రసాద్ ఈరోజు తెల్లవారుజామున మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. మరోవైపు.. ప్రసాద్ మరణ వార్త విని మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అర్దరాత్రి అరాచకం..
టీడీపీ వర్గానికి చెందిన కొందరు ఆదివారం రాత్రి జాతీయ రహదారి పక్కనే ఉన్న దాబా హోటల్‌లో బర్త్‌డే పార్టీ చేసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి బైక్‌లపై గ్రామానికి బయల్దేరారు. అదే సమయంలో కూన ప్రసాద్ తన బండిపై రామ చెరువు వైపు వెళ్తూ.. వారికి ఎదురుపడడంతో వారంతా ఒక్కసారిగా బైక్ ఆపి తాళం తీసుకుని మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. పది మంది కర్రలతో విచక్షణారహితంగా కొట్టడంతో ప్రసాద్ భయంతో పరుగులు తీశాడు. అయినా వదలకుండా వెంటాడి మరీ కొట్టారు. చివరకు బీసీ కాలనీలోని సూర కృష్ణమూర్తి అనే వ్యక్తి ఇంటి టెర్రస్‌పైకి ఎక్కితే.. అక్కడకూ వచ్చి దాడి చేశారు. దాడిలో దెబ్బలకు తాళలేక అపస్మారక స్థితికి చేరటంతో విడిచి పెట్టి వెళ్లిపోయారు.
అనంతరం గ్రామంలో పికెట్ నిర్వహిస్తున్న పోలీసులకు విషయం తెలియడంతో వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా ఎస్‌ఐ ఆధ్వర్యంలోని సిబ్బంది అక్కడకు వచ్చారు. అనంతరం 108 వాహనంలో క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో గ్రామంలో పోలీస్ పికెట్ బందోబస్తు సిబ్బంది సంఖ్య పెంచారు.
Comments
Please login to add a commentAdd a comment