సమావేశంలో మాట్లాడుతున్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య. చిత్రంలో మంత్రులు, సీనియర్ నాయకులు
సాక్షి, అమరావతి: కుల వృత్తులతో తరతరాలుగా సమాజానికి సేవలందిస్తున్న బీసీ సామాజిక వర్గాలకు దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆర్థిక తోడ్పాటుతోపాటు రాజకీయంగా ఉన్నత అవకాశాలు కల్పిస్తున్న ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని బీసీ ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ప్రతి పనిలోనూ బీసీల శ్రమ, కృషి దాగుందన్నారు. బీసీల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ మూడున్నరేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న కృషిని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. బీసీలే ముఖ్యమంత్రులుగా ఉన్న ఇతర రాష్ట్రాల్లోనూ బలహీన వర్గాలకు ఇంత సంక్షేమం సాధ్యం కాలేదన్నారు.
వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని 175 స్థానాల్లోనూ గెలిపించి సీఎం జగన్ రుణం తీర్చుకుంటామని, మరో 30 ఏళ్లు ఆయనే సీఎంగా ఉంటారని స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిలోని సీఎస్‌ఆర్ కళ్యాణ మండపంలో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అధ్యక్షతన బీసీ ప్రజా ప్రతినిధుల సమావేశం జరిగింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి దీనికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం బీసీ నేతలు మాట్లాడారు. త్వరలో 26 జిల్లాల్లోనూ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు.
సమావేశంలో బీసీ ప్రజా ప్రతినిధులు
సామాజిక న్యాయానికి పెద్దపీట: బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి
సామాజిక న్యాయానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. 137 కార్పొరేషన్లకు సంబంధించి 484 పదవులు ఇస్తే 243 బీసీలకే ఇచ్చాం. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేశాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. మూడున్నరేళ్లలో డీబీటీ ద్వారా వారికి దాదాపు రూ.2 లక్షల కోట్ల మేర ప్రయోజనం చేకూర్చాం.
పోరాడే బాధ్యత మాదే: జోగి రమేశ్, గృహ నిర్మాణశాఖ మంత్రి
బీసీల హక్కుల కోసం పోరాడే బాధ్యతను వైఎస్సార్ సీపీ స్వీకరించింది. బీసీ సామాజిక వర్గాలన్నింటిని ఏకం చేసి వారి ప్రయోజనాలను కాపాడగలిగేది ఒక్క వైఎస్సార్ సీపీ మాత్రమే. కలసికట్టుగా పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చి సీఎం జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుంటాం.
అండగా నిలుద్దాం: సీదిరి అప్పలరాజు, పశుసంవర్థక శాఖ మంత్రి
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి కుల అహంకారం ఉంది. బీసీలు న్యాయమూర్తులుగా పనికి రారని గతంలో కేంద్రానికి లేఖలు రాశారు. మత్స్యకారులను తోకలు కత్తిరిస్తానని బెదిరించారు. ఎస్సీల కుటుంబంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని కుల అహంకారంతో మాట్లాడారు. చంద్రబాబు హయాంలో బీసీ హాస్టళ్లు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. అధికారం కోల్పోయాక రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుంటే అడ్డుకోవాలని చూశారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాకే సామాజిక న్యాయం సాకారమైంది. ఆయనకు అంతా అండగా నిలవాలి.
బాబు నైజాన్ని ఎండగట్టాలి: ఉషశ్రీ చరణ్, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి
బీసీలను ఎంతో ఆదుకుంటున్న సంక్షేమ పథకాలను ఆపాలంటున్న చంద్రబాబు నైజాన్ని ప్రజల్లో ఎండగట్టాలి. అనంతపురం అంటే బీసీల జిల్లా. వారంతా సీఎం జగన్ వెంటే నడుస్తున్నారు. గతంలో ఎప్పుడూ, ఎవరూ చేయనన్ని సంక్షేమ పథకాలను సీఎం జగన్ ప్రవేశపెట్టి అన్ని కులాలకు అండగా నిలిచారు. బీసీలకు చేయాల్సిందంతా చేసినా ఇంకా ఏం చేయగలమా? అని తపిస్తుంటారు.
బీసీలను బెదిరించిన చంద్రబాబు: పోతుల సునీత, ఎమ్మెల్సీ
బీసీల తోకలు కత్తిరిస్తానంటూ చంద్రబాబు గతంలో బెదిరించారు. సీఎం జగన్ నా బీసీ సోదరులు, అక్క చెల్లెమ్మలంటూ ఆప్యాయంగా పిలుస్తారు. ఆయనకు మనపై ఉన్న ప్రేమకు అదే నిదర్శనం. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, డాక్టర్ సంజీవ్‌కుమార్, తలారి రంగయ్య, బెల్లాన చంద్రశేఖర్, గోరంట్ల మాధవ్, మార్గాని భరత్, డాక్టర్ సత్యవతి, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, హనుమంతరావు, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, దాడి వీరభద్రరావు, వైఎస్సార్‌సీపీ మహిళా నేత కిల్లి కృపారాణి పాల్గొన్నారు.
సమానంగా ఎదిగేలా తోడ్పాటు
ఇతర సామాజిక వర్గాలతో సమానంగా బీసీలు అభివృద్ధి చెందేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. టీడీపీ ఐదేళ్లలో బీసీలకు విదిల్చింది కేవలం రూ.19,369 కోట్లు మాత్రమే. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు దాదాపు రూ.2 లక్షల కోట్ల మేర పారదర్శకంగా లబ్ధి చేకూర్చింది.
– గుమ్మనూరు జయరాం, కార్మిక శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment