మాట్లాడుతున్న మంత్రి ఆదిమూలపు సురేశ్
సాక్షి ప్రతినిధి, కడప/ కడప కార్పొరేషన్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సాధించిన సామాజిక సాధికారత కడప నగరంలో పాటలై పొంగింది. గురువారం నగరంలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర వేలాది ప్రజలతో జైత్రయాత్రలా సాగింది. గురువారం ఉదయం నుంచే కడప నగరంలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది. నృత్యాలు, పాటలు, జై జగన్ నినాదాలతో యాత్ర అంగరంగ వైభవంగా సాగింది. మధ్యాహ్నం 3.25 గంటలకు యూఎస్ మహల్ నుంచి బస్సు యాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది.
స్థానిక ప్రజలు, మహిళలు పూలు, గజమాలలు, మంగళ హారతులు, బాణసంచాతో అడుగడుగునా యాత్రకు బ్రహ్మరథం పట్టారు. పాత బస్టాండులో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి వైఎస్సార్‌సీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అశేష జనవాహిని మధ్య జరిగిన సభలో మంత్రులు, పలువురు మంత్రులు సీఎం జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సాధించిన సాధికారతను వివరించారు. ప్రసంగాల్లో జగన్ పేరు వచ్చిన ప్రతిసారీ ప్రజల హర్షాతిరేకాలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది.
వైఎస్సార్ జిల్లా కడపలో నిర్వహించిన సభలో పాల్గొన్న జనవాహినిలో ఓ భాగం
సంఘ సంస్కర్త సీఎం జగన్: మంత్రి సురేష్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బాబూ జగ్జీవన్‌రామ్, జ్యోతిరావు పూలే ఆలోచనలు కలగలిపిన పాలనతో సీఎం వైఎస్ జగన్ సామాజిక సంఘ సంస్కర్తగా నిలిచారని మంత్రి ఆదిమూలపు సురేష్ అభివర్ణించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలోని ఉప కులాలను కూడా సీఎం వైఎస్ జగన్ ఉన్నత స్థితికి తెస్తున్నారని తెలిపారు. ఆగ్రకులాల సరసన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ విద్యార్థులు చదువుకునేలా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం తెచ్చారన్నారు. మన ఆత్మగౌరవం నిలిపిన జగనన్నకు అండగా నిలవాలని కోరారు.
జగనన్న ఆలోచనకు అండగా నిలుద్దాం: ఎమ్మెల్సీ రవిబాబు
అణచివేతకు గురైన బిడ్డలను సామాజికంగా, రాజకీయంగా ఎదిగేలా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అండగా నిలవాలని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు కోరారు. 40 ఏళ్లుగా పేదల శ్రమశక్తి, ఆలోచన విధానాన్ని దోపిడీ చేసిన చంద్రబాబు రూ.6 లక్షల కోట్లకు ఎదిగారన్నారు.
చంద్రబాబు వళ్లంతా అవినీతి మచ్చే : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
సీఎంగా సుదీర్ఘకాలం పని చేసిన చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం వీసమెత్తు కూడా పనిచేయలేదని తెలిపారు. బాబు వళ్లంతా అవినీతి మచ్చే ఉందని ఎద్దేవా చేశారు. మూడు తరాల క్రితమే వైఎస్ కుటుంబం సామాజిక న్యాయం పాటించిందని తెలిపారు. జగనన్న సర్కార్‌లో స్కావెంజర్ బిడ్డకు కూడా కార్పొరేట్ విద్య అందుతోందన్నారు. పేదల ఉన్నతికి అనుక్షణం తపించే సీఎం వైఎస్ జగన్‌ను మన జాతి కోసం మరోమారు గెలిపించుకోవాలని కోరారు.
సామాజిక న్యాయం నినాదం కాదు..విధానం: డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి సామాజిక న్యాయం నినాదంగానే ఉండేదని, ఇప్పుడు సీఎం జగన్ పాలనలో అది ఓ విధానమైందని డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజాద్‌బాషా చెప్పారు. సీఎం వైఎస్ జగన్ సామాజిక సాధికారితను ఆచరణలో చూపెట్టి దేశంలోనే ఆదర్శంగా నిలిచారన్నారు. కడప ప్రజలు తనను రెండు సార్లు అత్యధిక మెజార్టీతో అసెంబ్లీకి పంపితే, సీఎం వైఎస్ జగన్ డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి ఆయన సరసన కూర్చోబెట్టుకున్నారని చెప్పారు.
సంక్షేమం, సామాజిక న్యాయం సమపాళ్లలో..: ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో సామాజిక న్యాయానికీ అంతే ప్రాధాన్యత ఇచ్చారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. కేబినెట్‌లో 70 శాతం మంత్రులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలేనని చెప్పారు. రాజ్యసభ సభ్యులు, నామినేటెడ్ పోస్టుల్లోనూ ఈ వర్గాలకే సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ఈ సమావేశంలో శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్ జకియా ఖానమ్, ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, ఎంవీ రామచంద్రారెడ్డి, పోతుల సునీత, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధ, మాజీ ఎంపీ బుట్టా రేణుక, కడప మేయర్ సురేష్‌బాబు, వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ ఆకేపాటి అమర్‌నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment