
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు వికృత రాతలతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విషం జిమ్మడమే లక్ష్యంగా దురుద్దేశపూరిత కథనాలను అచ్చేస్తున్న ఈనాడు రామోజీరావు పేద బిడ్డల పెళ్లికి ప్రభుత్వం చేస్తున్న సాయాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. బడుగు, బలహీనవర్గాలవారి వివాహాలకు గత టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన సాయం కంటే దాదాపు రెట్టింపుకు పైగా సాయాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందిస్తున్నా రామోజీ పచ్చకళ్లకు కనిపించడం లేదు.
అంతేకాకుండా గత టీడీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలను చెల్లించినా తనకేమీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే ‘కళ్యాణమస్తు.. జాప్యం మస్తు’ అంటూ ఒక విష కథనాన్ని సోమవారం ఈనాడు పత్రికలో అచ్చేశారు. అసత్యాలు, అబద్ధాలతో సాగిన ఈ కథనానికి సంబంధించి అధికారులు వెల్లడించిన వాస్తవాలివిగో..
పేదింటి బిడ్డల పెళ్లికి ఉద్దేశించిన కళ్యాణమస్తు పథకం కింద 43,490 జంటలకు గత టీడీపీ ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాల్సి ఉంది. అయితే 2018 నుంచి రూ.177.96 కోట్లు చెల్లించకుండా ఎగనామం పెట్టింది. ఆర్థిక సాయం చేస్తామని ఆశపెట్టి వారిని నిండా ముంచింది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత టీడీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నింటినీ విడుదల చేసింది. ఈ విషయాన్ని ఈనాడు తన కథనంలో ఉద్దేశపూర్వకంగా విస్మరించింది. పైగా లబ్దిదారులకు ఆర్థిక సాయం విడుదలలో గత టీడీపీ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో ఒక్కపదం రాస్తే ఒట్టు.
లబ్దిదారులకు తప్పిన అవస్థలు..
గత ప్రభుత్వం హయాంలో లబ్దిదారుల ఎంపికలో కళ్యాణమిత్రలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రస్తుత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా దరఖాస్తుల నమోదు, పరిశీలన, ధ్రువీకరణను సులభం చేసింది. దీంతో లబ్ధిదారులకు అవస్థలు తప్పాయి. దరఖాస్తులు, ధ్రువీకరణను సైతం డిజిటలైజ్ చేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో 2.6 లక్షల మంది వలంటీర్లు సహాయమందిస్తుండటంతో లబ్దిదారుల ఎంపిక మరింత సులువైంది.
ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆశయంతో..
ఆడ పిల్లల చదువులను ప్రోత్సహించాలనే మహోన్నత లక్ష్యంతో వివాహాలు చేసుకునేవారు కనీసం పదో తరగతి చదివి ఉండాలని ప్రభుత్వం నిబంధన విధించింది. దీంతో తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను పదో తరగతి వరకు తప్పనిసరిగా చదివిస్తున్నారు. అలాగే కళ్యాణమస్తు పథకానికి అర్హులు కావాలంటే వధువులకు 18 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉండాలని ప్రభుత్వం మరో నిబంధన పెట్టింది. దీంతో అందరూ ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నతాశయం ఆచరణలో మంచి ఫలితాలు ఇస్తోంది.
పేద పిల్లలకు జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన వంటి పథకాల ద్వారా ఉన్నత విద్యకు మంచి ప్రోత్సాహం అందిస్తున్నారు. ముస్లిం, మైనారిటీలు విద్యలో తక్కువ శాతం ఉన్నారని.. కాబట్టి ప్రభుత్వం పదో తరగతి నిబంధన సడలించాలని ఈనాడు తన కథనంలో రాయడం సంకుచితమే అవుతుంది. కళ్యాణమస్తు పథకానికి ముడిపెట్టి వారిని చదువుకు దూరం చేసే ప్రయత్నం ‘ఈనాడు’ చేయడం దుర్మార్గం. కళ్యాణమస్తు, షాదీ తోఫా కోసం ప్రభుత్వం పదో తరగతి చదివి ఉండాలనే నిబంధన పెట్టడం వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్న ఉన్నతాశయమే తప్ప మరొకటి కాదు.
పెళ్లిళ్లకు నిబంధనలు అంటూ ఈనాడు అసత్య ఆరోపణలు...
ప్రస్తుత ప్రభుత్వం పెళ్లిళ్లకు ఆర్థిక సాయంఅందించడంలో నిబంధనలు పెడుతోందంటూ ఈనాడు అసత్య ఆరోపణలు చేసింది. కొత్తగా ఆంక్షలు విధించడం వల్ల లబ్దిదారుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని అబద్ధాలను అచ్చేసింది. గతేడాది నవంబర్ 23న జరిగిన చివరి విడతలో దరఖాస్తులు, ఆర్థిక సాయం విడుదల గమనిస్తే ‘ఈనాడు’ వక్రరాతల్లో డొల్లతనం అర్థమవుతోంది.
దరఖాస్తులకు గడువు ఆగస్టు–అక్టోబర్ 2023 వరకు ఆర్థిక సాయం విడుదల: నవంబర్ 23, 2023
వచ్చిన దరఖాస్తుల సంఖ్య 11,807
అనర్హతకు గురయిన దరఖాస్తులు 1,196
ఆమోదం పొందిన దరఖాస్తులు 10,611
ఈ జంటలకు ప్రభుత్వం రూ.81.64 కోట్లు పంపిణీ చేసింది.(( అంతేకాకుండా ముందుగా దరఖాస్తు చేసుకున్న వారిలో తిరస్కరణకు గురైన దరఖాస్తులను ప్రభుత్వం మరోసారి పరిశీలించి 267 జంటలకు రూ.2.15 కోట్లను అందించింది)) ఈనాడు తన కథనంలో గత ప్రభుత్వంలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని తిరస్కరణకు గురయ్యాయి అనే లెక్కలే ప్రస్తావించకపోవడం గమనార్హం. కానీ గతానికి భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం ప్రతి దరఖాస్తులను పరిశీలించి, ధ్రువీకరించి, జాబితాలను కూడా సోషల్ ఆడిట్‌లో అందుబాటులో ఉంచుతోంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కింద ఆర్థిక సాయం అందిస్తోంది.
నాడు–నేడు తేడా ఇలా..
♦ గత టీడీపీ ప్రభుత్వంలో ఆర్థిక సాయం అనే మాటే కల్ల. ప్రస్తుత ప్రభుత్వం మూడు నెలలకు ఒకసారి నమోదైన లబ్దిదారులందరికీ ఒకేసారి విడుదల చేస్తోంది.
ూ గత ప్రభుత్వం హయాంలో పట్టణ ప్రాంతాల్లోని మెప్మా కార్యాలయాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడేవారు. ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రంలోని 15,004 గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా స్థానికంగానే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
♦ గత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని ఐకేపీల పరిధిలోని మండల సమాఖ్యల ద్వారా లబ్దిదారులను ఎంపిక చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం లబ్ధిదారులు ఉన్న చోట నుంచే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఎంపిక చేస్తోంది.
♦ గత ప్రభుత్వం బకాయిలను విడుదల చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వంలో వివాహం జరిగిన తేదీ నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకుంటే మూడు నెలలకు ఒకసారి అప్పటివరకు వచ్చినవాటన్నింటికీ ఆర్థిక సాయం అందిస్తోంది. ఎలాంటి లంచాలకు తావు లేకుండా నేరుగా వధువుల తల్లుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తోంది.