సాక్షి, అమరావతి: వరుసగా మూడుసార్లు నెగ్గి తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ హ్యాట్రిక్ సాధించింది. 2014 నుంచి తాజా ఎన్నికల వరకు పార్టీ అభ్యర్థులే ఇక్కడ విజయం సాధించడం గమనార్హం. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం తగ్గినా భారీ మెజారిటీని కైవసం చేసుకుంది. అప్పుడు 13,16,473 (79.76 శాతం) ఓట్లు పోల్ కాగా తాజా ఉప ఎన్నికలో 11,04,927 (64.42 శాతం) పోలయ్యాయి. అంటే ఈసారి 2,11,546 (15.34 శాతం తక్కువ) ఓట్లు తక్కువగా పోలయ్యాయి.
గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఎంపీగా గెలిచిన బల్లి దుర్గా ప్రసాద్ 55.03 శాతం ఓట్లతో 2,28,376 ఓట్ల మెజార్టీ సాధించారు. ఇప్పుడు డాక్టర్ ఎం.గురుమూర్తి 56.67 శాతం ఓట్లతో 2,71,592 ఓట్ల మెజార్టీ సాధించారు. 2019లో పోలైన ఓట్లలో వైఎస్సార్‌సీపీ మెజార్టీ శాతం 15.38 అయితే ఇప్పుడు మెజార్టీ శాతం 24.59 కావడం గమనార్హం. అంటే 23 నెలల్లోనే జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మెజారిటీ 9.21 శాతం పెరిగింది.
టీడీపీ దీనావస్థ..
రెండు దఫాలు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన పనబాక లక్ష్మి 2019 ఎన్నికల్లో 4,94,501 ఓట్లు సాధించగా ఈసారి ఆమెకు 3,54,516 ఓట్లు మాత్రమే దక్కాయి. 2019లో టీడీపీకి 37.65 శాతం ఓట్లు రాగా ఇప్పుడు 32.08 శాతం మాత్రమే వచ్చాయి. అంటే 5.57 శాతం ఓట్లు తగ్గాయి. అది కూడా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసి సర్వశక్తులు ఒడ్డితే ఆ మాత్రం ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో బీఎస్పీ 20,971 (1.60 శాతం) ఓట్లు సాధిస్తే అప్పుడు బీజేపీకి 16,125 (1.22 శాతం) ఓట్లు వచ్చాయి. ఈ రెండు పార్టీల ఓట్లు కలిపితే 37,096 ఓట్లు (2.82 శాతం) వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ 57,080 ఓట్లు (5.17 శాతం) సాధించింది.
ఇదే అత్యధికం
తిరుపతిలో 1989 సాధారణ ఎన్నికల దగ్గర్నుంచి పరిశీలిస్తే ఈ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి గురుమూర్తి సాధించిన మెజారిటీనే అత్యధికమని స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment